
2021 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. భారత్, పాకిస్థాన్ వంటి జట్లతో నిండిన గ్రూప్ 2 నుంచి సెమీస్ రేసులో నిలిచింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అద్భుత ప్రదర్శన చేసిన ఆ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించింది. ఈ ప్రదర్శనలో న్యూజిలాండ్ బౌలర్ల ప్రత్యేక సహకారం ఉంది. వీరిలో రెండేళ్ల క్రితమే కెరీర్ ముగించాల్సిన ఓ బౌలర్ కూడా ఉన్నాడు. అతని బంతుల మాయాజాలంతో బాట్స్‌మెన్లను బోల్తాకొట్టించి ఆశ్చర్యపరిచాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో కూడా ఆ ఆటగాడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే ఈ మధ్య కాలంలో కష్టపడి తన టెక్నిక్స్ మార్చుకుంటూ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో చోటు దక్కించుకున్నాడు. ఈ ఆటగాడే ఇష్ సోధి.

ఇష్ సోధి లెగ్ స్పిన్నర్. అతను భారతదేశంలోని లూథియానా నగరానికి చెందినవాడు. కానీ అతని కుటుంబం చాలా సంవత్సరాల క్రితం న్యూజిలాండ్‌లోనే స్థిరపడింది. కాబట్టి ఇష్ సోధి కూడా అక్కడే పెరిగాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అతను తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడాడు. కానీ వన్డే, టీ20 ఫార్మాట్లలో ఎక్కువ విజయాలు సాధించాడు. ఇష్ సోధీ ఇటీవలి సంవత్సరాలలో న్యూజిలాండ్ విజయానికి గణనీయంగా సహకరించాడు.

రెండేళ్ల క్రితం 2019లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇష్ సోధీ ఘోరంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అతను 15 ఓవర్లు బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీశాడు. ఈ సమయంలో అతని ఎకానమీ రేటు 11.73గా ఉంది. అంటే బ్యాట్స్‌మెన్‌లు ప్రతి ఓవర్‌లో దాదాపు 12 పరుగులు కొల్లగొట్టారు. ఏ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లోనూ ఇంతకంటే అధ్వాన్నమైన ఎకానమీ రేటు ఎవరికీ లేదు. అటువంటి పరిస్థితిలో అతని సహచర బౌలర్ మిచెల్ సాంట్నర్ సహాయం తీసుకున్నాడు. అప్పటి నుంచి టీ20 క్రికెట్‌లో 7.72 ఎకానమీతో 17.09 సగటుతో వికెట్లు తీశాడు.

ఆసక్తికరంగా 2021 టీ20 ప్రపంచ కప్‌లో, పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ ఆడిన మొదటి మ్యాచ్‌లో ఇష్ సోధిని జట్టులో తీసుకోలేదు. అతని స్థానంలో ఆడమ్ మిల్నేని ఎంపిక చేశారు. కానీ, ఐసీసీ మిల్నేని రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా చేర్చడాన్ని ధృవీకరించకపోవడంతో సోధిని తీసుకున్నారు. మ్యాచ్‌లో ఫకర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్‌లను అవుట్ చేయడం ద్వారా అతను తన అవసరాన్ని నిరూపించుకున్నాడు. దీని తర్వాత, అతను భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగాడు. ఇక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఔట్ చేశాడు. ఈ గేమ్ ద్వారా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

2021 టీ20 ప్రపంచకప్‌లో ఇష్ సోధీ ఐదు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతని ఎకానమీ రేటు 7.17గా ఉంది. అలాగే వికెట్ల సగటు 15.25గా ఉంది. అలాగే ఇప్పటి వరకు ఆడిన మొత్తం 5 మ్యాచ్‌ల్లో ఇష్ సోధి తొలి ఓవర్‌లోనే వికెట్లు పడగొట్టడం విశేషం.