
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన విజువల్ వండర్ 'రామాయణం: పార్ట్ 1'. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ పౌరాణిక చిత్రంపై మొదటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణాసురుడిగా యష్ తమ అద్భుతమైన నటనతో అలరించగా.. అందరి దృష్టిని అత్యధికంగా ఆకర్షించిన పాత్ర సీతాదేవి.

వెండితెరపై సీతమ్మ పాత్రలో సహజ నటనకు మారుపేరైన న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి నటించడంతో సినిమాపై హైప్ తారాస్థాయికి చేరింది. చిత్రం విడుదలైన తర్వాత సాయిపల్లవి నటనపై నెటిజన్లు, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమాలో సీతాదేవి పాత్రకు సాయిపల్లవి పూర్తిస్థాయిలో ప్రాణం పోశారని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఎలాంటి కృత్రిమ హంగులు, భారీ మేకప్ లేకుండా, తన సహజ సౌందర్యంతోనే సీతమ్మ పవిత్రతను, దైవికత్వాన్ని ఆమె తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ముఖ్యంగా ఎక్స్ వేదికగా సినీ అభిమానులు ఆమె ప్రదర్శనను 'ఎక్స్‌సెప్షనల్' అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ముఖంలో కనిపించే ప్రశాంతత, హుందాతనం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయని, సీత పాత్రకు ఆమె సరిగ్గా సరిపోయిందని అంటున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం సాయిపల్లవి నటనను ప్రత్యేకంగా ప్రశంసించారు. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి అద్భుతమైన అభినయాన్ని కనబరిచారని అన్నారు.

కేవలం సాంప్రదాయ త్యాగశీలిగానే కాకుండా, పౌరాణిక కోణాలను స్పృశిస్తూ ఈ చిత్రంలో సీత పాత్రకు అవసరమైన దృఢత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సాయిపల్లవి చక్కగా ప్రదర్శించారని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తానికి, కాస్టింగ్ ప్రకటన సమయంలో ఎదురైన కొన్ని విమర్శలను తన అద్భుతమైన నటనతో సాయిపల్లవి పూర్తిగా తిప్పికొట్టారు.

తనదైన సహజశైలి, అంకితభావంతో సీతాదేవి పాత్రకు పరిపూర్ణ న్యాయం చేసి, మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. బాక్సాఫీస్ వద్ద విజయపరంపర కొనసాగిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.