
ప్రస్తుతం ఓటీటీ వేదికలపై వైవిధ్యమైన కథాంశాలతో వస్తున్న వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కోవలోనే ప్రముఖ నటి కీర్తి సురేష్, టాలెంటెడ్ యాక్ట్రెస్ రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన తాజా క్రేజీ వెబ్ సిరీస్ 'అక్క' . మహిళల ఆధిపత్యం, పవర్ పాలిటిక్స్, రివెంజ్ , గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో కీర్తి యాక్టింగ్, మేనరిజం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు.

దక్షిణాకోదిలోని 'పెరనూరు' అనే ఒక కల్పిత ప్రాంతం ఆధారంగా ఈ కథ నడుస్తుంది. ఈ నగరంలో గత 800 సంవత్సరాలుగా పురుషుల ఆధిపత్యానికి తావులేకుండా కేవలం మహిళల పాలన మాత్రమే కొనసాగుతుండటం ఇక్కడి ప్రధాన విశేషం. ఇక్కడ వారసత్వంగా అధికారం మహిళల చేతికే బదిలీ అవుతుంది. ఈ సమాజంలో మహిళలకు ప్రియులను ఉంచుకునే స్వేచ్ఛ ఉంటుంది కానీ అధికారికంగా వివాహం చేసుకునే అనుమతి ఉండదు. ఈ వ్యవస్థ మొత్తాన్ని 'అక్క' అనే పేరుతో పిలువబడే శక్తివంతమైన మహిళా నాయకురాలు నియంత్రిస్తుంటారు.

మలేమర్ ప్రాంతానికి అధిపతిగా ఉన్న భవాని (కీర్తి సురేష్) చేతిలో ప్రధాన అధికారం ఉంటుంది. అయితే ఆమె సామ్రాజ్యాన్ని కూలదోయడానికి ముంబై నుంచి వచ్చిన రుద్ర ఎంట్రీ ఇస్తుంది. భవాని ఆధిపత్యానికి సవాల్ విసురుతూ రుద్ర పన్నే పన్నాగం, ఇద్దరి మధ్య జరిగే రక్తసిక్తమైన పోరు, అధికార దాహం, పగలు మరియు నమ్మకద్రోహాల చుట్టూ ఈ కథ సాగుతుంది.

ఈ సిరీస్‌కు ప్రధాన బలం నటీనటుల అభినయమే. భవాని పాత్రలో కీర్తి సురేష్ తన కెరీర్‌లోనే ఎన్నడూ లేనివిధంగా చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. సాంప్రదాయ వస్త్రధారణ, రాజసం ఉట్టిపడే లుక్, కళ్లలోనే తీవ్రతను ప్రదర్శిస్తూ ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మరోవైపు రుద్ర పాత్రలో రాధిక ఆప్టే తనదైన ముద్ర వేశారు. ఆమెలోని నెగెటివ్ షేడ్స్ కోసం చేసే ప్రయత్నాలు కథకు మంచి ఇంటెన్సిటీని తెచ్చాయి. వీరితో పాటు తన్వీ ఆజ్మీ, మోనిక పన్వార్, అన్షుమాన్ పుష్కర్ , మహేష్ మంజ్రేకరి తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మహిళా ప్రధాన గ్యాంగ్‌స్టర్ డ్రామా అనే సరికొత్త కాన్సెప్ట్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, కీర్తి సురేష్ , రాధిక ఆప్టేల మధ్య వచ్చే టెన్షన్ సీన్లు సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మొత్తంగా చూస్తే, 'అక్క' వెబ్ సిరీస్ ఒక డిఫరెంట్ మ్యాట్రిఆర్కల్ (మాతృస్వామ్య) నేపథ్యం ఉన్న గ్యాంగ్‌స్టర్ డ్రామా. రెగ్యులర్ కంటెంట్‌కు భిన్నమైన పవర్ పాలిటిక్స్ ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది.