
సినీ, టెలివిజన్ రంగంలో కనిపించే స్టార్‌డమ్ వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు దాగి ఉంటాయి. తెరపై ఎంతో సంతోషంగా కనిపించే నటీనటులు.. తమ కెరీర్ ప్రారంభంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో కొందరు ఎదుర్కొనే పరిస్థితులు ఆందోళన కలిగిస్తుంటాయి. ఇలాంటి అనుభవాలను చాలామంది తారలు సంవత్సరాల తర్వాత బయటపెడుతున్నారు. తాజాగా టెలివిజన్ నటి, బిగ్ బాస్ ఫేమ్ రష్మీ దేశాయ్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ భయానక సంఘటనను గుర్తుచేసుకున్నారు.

కేవలం 16 ఏళ్ల వయసులోనే ఓ ఆడిషన్‌కు వెళ్లిన సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. ఆ ఘటనను గుర్తుచేసుకుంటూ తాను ఎంత భయపడ్డానో వివరించారు. రష్మీ దేశాయ్ చెప్పిన వివరాల ప్రకారం.. కెరీర్ ప్రారంభంలో ఆమెను ఓ ఆడిషన్ కోసం పిలిచారు. అవకాశంపై ఆశతో అక్కడికి వెళ్లిన ఆమెకు అక్కడ ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆ ప్రదేశంలో తనతో పాటు మరెవరూ లేకపోవడంతో అనుమానం కలిగిందని ఆమె తెలిపారు.

అప్పటికి తన వయసు కేవలం 16 సంవత్సరాలేనని చెప్పిన రష్మీ.. అక్కడ ఉన్న ఓ వ్యక్తి తనకు మత్తు కలిగించే పదార్థాన్ని ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. పరిస్థితిని గమనించిన వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చానని, ఆ తర్వాత జరిగిన విషయాన్ని తన తల్లికి పూర్తిగా చెప్పానని ఆమె వెల్లడించారు. రష్మీ దేశాయ్ వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. భర్తతో విడిపోయిన తర్వాత తన ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా మారిందని ఆమె గతంలో వెల్లడించారు.

సొంతంగా ఇల్లు కొనుగోలు చేసేందుకు తీసుకున్న రుణాలు, ఇతర ఆర్థిక బాధ్యతలు తనపై భారీ భారాన్ని మోపాయని తెలిపారు. తన పేరు మీద దాదాపు రూ.3.25 కోట్ల వరకు అప్పు ఉన్న సమయంలో తాను చేస్తున్న షో కూడా ఆగిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని రష్మీ చెప్పుకొచ్చారు. ఒక దశలో ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడ ఉండాలో కూడా అర్థం కాని పరిస్థితి ఎదురైందని తెలిపారు. ఆ సమయంలో ఎదురైన పరిస్థితిని గుర్తుచేసుకుంటూ రష్మీ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. తన వద్ద ఉన్న ఆడి A6 కారులోనే నాలుగు రోజుల పాటు గడిపానని ఆమె వెల్లడించారు.

టెలివిజన్‌లో స్టార్‌గా ఎదగకముందు రష్మీ దేశాయ్ కొన్ని తక్కువ బడ్జెట్ చిత్రాల్లోనూ నటించారు. కెరీర్ ప్రారంభంలో ఎదురైన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిన ఆమె.. ఆ తర్వాత హిందీ టెలివిజన్‌లో మంచి గుర్తింపు సంపాదించారు. పలు పాపులర్ సీరియల్స్‌తో ప్రేక్షకులకు చేరువైన రష్మీ.. ఆ తర్వాత బిగ్ బాస్ వంటి రియాలిటీ షోల ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు అవకాశాల కోసం తలుపులు తట్టిన రష్మీ దేశాయ్.. ఆ తర్వాత టెలివిజన్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.