
90వ దశకం తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది. అప్పట్లో హీరోలతో పాటు హీరోయిన్లకూ మంచి ప్రాధాన్యం ఉండేది. సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, సంఘవి వంటి కథానాయికలు తమ అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అప్పటి యువతలో సంఘవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన సంఘవి అసలు పేరు కావ్య రమేష్. 1993లో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె.. దక్షిణాది భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

దాదాపు 15 ఏళ్ల కెరీర్‌లో 80కి పైగా సినిమాల్లో నటించిన సంఘవి.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించారు. అందులో తెలుగులోనే 38 సినిమాలు ఉన్నట్లు పలు సినీ డేటాబేస్‌లు పేర్కొంటున్నాయి. 1993లో ‘కొక్కరకో’ అనే తెలుగు సినిమాతో సంఘవి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అదే ఏడాది తమిళంలో ‘అమరావతి’ సినిమాలో అజిత్ కుమార్ సరసన నటించే అవకాశం దక్కింది. ‘అమరావతి’ అజిత్ హీరోగా నటించిన తొలి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఆ తర్వాత విజయ్ సరసన ‘రసిగన్’లో నటించడంతో తమిళ ప్రేక్షకుల్లోనూ సంఘవికి మంచి గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి తమిళంతో పాటు కన్నడ, మలయాళ సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ దక్షిణాది హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంఘవి. 1995లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన తాజ్‌మహల్ సంఘవి కెరీర్‌లో కీలకమైన మలుపుగా నిలిచింది. ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంఘవి ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఈ సినిమా విజయంతో తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు రావడం మొదలైంది.

ఆ తర్వాత నాయుడుగారి కుటుంబం, సరదా బుల్లోడు, ప్రియమైన శ్రీవారు, అబ్బాయిగారి పెళ్లి, పట్టుకోండి చూద్దాం వంటి సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయారు. సంఘవి కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే సినిమాల్లో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘సింధూరం’ ఒకటి. తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించడమే కాకుండా, సంఘవికి ఉత్తమ నటిగా నంది అవార్డు దక్కిన చిత్రంగా కూడా గుర్తింపు పొందింది. ‘సింధూరం’ తర్వాత సంఘవి వరుసగా పలు విజయవంతమైన తెలుగు చిత్రాల్లో కనిపించారు.

సూర్యవంశం, శివయ్య, సమరసింహారెడ్డి, సీతారామరాజు, ప్రేయసి రావే, లాహిరి లాహిరి లాహిరిలో, సందడే సందడి తదితర చిత్రాలు ఆమె కెరీర్‌లో భాగమయ్యాయి. సంఘవి తెలుగు, తమిళ సినిమాల్లో వరుస అవకాశాలు అందుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. సినీ కెరీర్‌లో మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే సంఘవి వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టారు. 2016 ఫిబ్రవరి 3న బెంగళూరులో ఐటీ రంగంలో పనిచేసే వెంకటేష్‌ను వివాహం చేసుకున్నారు.