
మన ఇంటి పెరట్లో కానీ మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడు శంఖు పువ్వులు కనిపిస్తూనే ఉంటాయి. ఇవు చూడటానికి సీతాకోకచిలుకల్లా నీలం రంగులో ఉండటం వలన వీటిని బటర్‌ఫ్లై పీ ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు. ఈ శంఖు పువ్వుల్లో ఎన్నో ఆరోగ్యపరమైన, సౌందర్యపరమైన ఉపయోగాలు ఉన్నాయి. ఖరీదైన క్రీములు కొనుక్కోకుండానే మన ఇంట్లోనే దొరికే ఈ పూలతో అందం, ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో ఇప్పుడు చూద్దాం..

శంఖు పూల బ్లూ టీ: శంఖు పూలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. వీటితో బ్లూ టీ తయారుచేసుకుని తాగవచ్చు. ఒక గుప్పెడు శంఖు పూలను వేడినీళ్లలో వేసి బాగా మరిగించాలి. అప్పుడు పువ్వుల రంగు నీళ్లలోకి వస్తుంది. ఆ నీటిని ఒక కప్పులోకి తీసుకుని రెండు మూడు నిమ్మ చుక్కలు, అర స్పూన్ తేనె కలుపుకోవాలి. మీరు రోజూ టీకి బదులుగా ఒక కప్పు ఈ బ్లూ టీ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేయడానికి, కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఫ్యాటీ లివర్, కొలస్ట్రాల్ ను తగ్గించడానికి,బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.

శంఖు పూల వాటర్ : శంఖు పూలను బ్లూ టీ రూపంలోనే కాకుండా మరో విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. రాత్రిపూట కొన్ని శంఖు పూలను నీళ్లలో నానబెట్టాలి. ఉదయానికి వాటి రంగు పూర్తిగా నీళ్లలోకి దిగుతుంది. ఆ నీటిని ఉదయాన్నే తాగాలి. శంఖు పూల నీళ్లను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.అలాగే కంటి చూపు మెరుగుపడటానికి, మైగ్రెన్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది

శంఖు పూలతో ఫేస్ ప్యాక్: చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపించడానికి శంఖు పూలతో ఫేస్ ప్యాక్ కూడా తయారుచేసుకోవచ్చు. ముందుగా కొన్ని శంఖు పూలను నీళ్లలో వేసి బాగా మరిగించి, ఆ నీటిని చల్లార్చుకోవాలి. మరో గిన్నెలో కొంచెం బియ్యప్పిండి తీసుకుని, అందులో కొద్దిగా అలీవ్ నూనెను కలపాలి. ఇప్పుడు ముందుగా తయారుచేసుకున్న శంఖు పూల నీటిని కొద్దికొద్దిగా పోస్తూ మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.

ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసుకోవచ్చు. దీనివల్ల కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు, చిన్నచిన్న నల్ల మచ్చలు తగ్గడానికి, చర్మంపై ట్యాన్ తగ్గి ముఖం మృదువుగా, కాంతివంతంగా కనిపించడానికి సహాయపడుతుంది. శంఖు పూలతో లిప్ బామ్, మాయిశ్చరైజర్లు కూడా తయారుచేసుకోవచ్చు. అందానికి, ఆరోగ్యానికి ఉపయోగపడే ఈ పూలను మనం కూడా తగిన జాగ్రత్తలతో దీనిని తీసుకోవచ్చు.