
అతిబల మొక్కను మనం నిత్యం చూసే సాధారణ మొక్కలలో ఒకటిగా చెప్పొచ్చు. దీని ఆకులు, పువ్వులు ప్రత్యేకమైనవిగా ఉంటాయి. పువ్వులు దువ్వెనలా ఉండటం వల్ల కొన్ని ప్రాంతాలలో దీనిని "దువ్వెన కాయ" అని కూడా పిలుస్తారు. దీనికి "తుత్తుర బెండ", "ముద్ర బెండ" వంటి అనేక కొత్త పేర్లు ఉన్నాయి. దీనిని కొందరు "అతిబల" అంటారు.

మన శరీరానికి అమితమైన బలాన్ని ఇవ్వడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక దీనికి అతిబల అనే పేరు వచ్చింది. ఆయుర్వేద వైద్యంలో ఈ మొక్కను పలు రకాల వ్యాధుల నివారణకు విరివిగా వాడుతారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి అతిబలను వాడుతున్నారు.

అతిబల ఆకులను పేస్ట్‌గా చేసి ఆవు నెయ్యితో కలిపి నొప్పి ఉన్నచోట రాయడం వల్ల కీళ్ల నొప్పి, కీళ్ల వాతం తగ్గుతాయి. అలాగే, అతిబల ఆకులు ఏడు తీసుకుని మంచి నీటితో నూరి, బట్టలో వడపోసిన రసంలో చక్కెర కలిపి రెండు పూటలా తాగుతూ, ఆకులను దంచి నొప్పులపై వేసి కట్టు కడుతూ ఉంటే నడుం నొప్పితో పాటు ఎలాంటి నొప్పులైనా తగ్గుతాయి.

ఎప్పుడూ నీరసంగా అనిపించే వారికి ఈ చెట్టు ఆకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఉదయాన్నే పరగడుపున రెండు ఆకులు తీసుకుంటే అద్భుతమైన శక్తిని పొందుతారు. అతిబల వేర్లను దంచి పొడి చేసి ఆవు నెయ్యితో కలిపి ఆహారానికి ముందు సేవిస్తే గుండెకు బలం చేకూరుతుంది, ముఖం కాంతివంతంగా మారుతుంది.

ఈ చెట్టు ఆకులను ఉడికించి తింటే రక్త మొలలు తగ్గుతాయి. అతిబల ఆకులను కూరలా వండుకుని రెండు పూటలా తింటుంటే మొలల నుండి రక్తం కారడం తగ్గిపోతుంది. అతిబల ఆకులు 21, మిరియాలు 21 కలిపి మెత్తగా నూరి ఏడు గోలీలను తయారు చేసుకుని, రోజుకొక గోలీ చొప్పున పరగడుపునే మంచి నీటితో ఏడు రోజులు తీసుకుంటే వాతదోషం వల్ల కలిగే మొలలు తగ్గిపోతాయి.