
ఒక పాన్‌లో మూడు టేబుల్‌స్పూన్ల ధనియాలు, ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ సోంపు, మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, మూడు యాలకులు, మూడు లవంగాలు, రెండు అనాస పువ్వు రేకులు వేసి తక్కువ మంటపై దోరగా వేయించాలి. ఇవి మాడిపోకుండా, మిక్సీలో గ్రైండ్ అయ్యేలా కొద్దిగా వేగితే సరిపోతుంది. నాలుగైదు నిమిషాలు వేయించి, స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చి, మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పొడి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా కూరకి అద్భుతమైన రుచిని, చికెన్ కూరలా గట్టిగా ఉండే ముక్కలను అందిస్తుంది.

వెడల్పుగా ఉండే కడాయిని స్టవ్‌పై పెట్టి, కూరకి సరిపడా వేరుశనగ నూనె వేసుకోవాలి. నాన్‌వెజ్ కూరలకు నూనె కొంచెం ఎక్కువ ఉంటే రుచి బాగుంటుంది. నూనె కాగాక, మూడు మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఒక టేబుల్‌స్పూన్ ఉప్పు వేసి మీడియం మంటపై బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

ఉల్లిపాయలు వేగాక, ఒక టేబుల్‌స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్‌స్పూన్ పచ్చిమిర్చిలను కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్ వేసి పచ్చిదనం పోయే వరకు వేయించాలి. ఇప్పుడు పులుపు కోసం, పచ్చిగా, పుల్లగా ఉండే మామిడికాయను తొక్క తీసి తురుముకోవాలి. అర కప్పు మామిడికాయ తురుమును కూడా దీనిలో వేసి, దాని పచ్చిదనం పోయేలా కనీసం 5 నిమిషాలు వేయించాలి. పులుపుకు తగ్గట్టు మామిడికాయ తురుమును అడ్జస్ట్ చేసుకోవచ్చు.

తరువాత, పావు స్పూన్ పసుపు, మూడు నుండి నాలుగు టేబుల్‌స్పూన్ల కారం వేసి బాగా కలపాలి. ఇందులోనే మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు పోయాలి. చేపల నుండి కూడా నీళ్లు ఊరతాయి కాబట్టి మరీ ఎక్కువ నీళ్లు పోయకుండా, సుమారు అర లీటరు పైనే నీళ్లు వేసుకోవచ్చు. పులుసు మరిగేటప్పుడే రుచి చూసి అవసరమైతే ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. పులుసు బాగా మరిగాక, మసాలా పట్టించిన చేప ముక్కలను జాగ్రత్తగా ఒకదానిపై ఒకటి కాకుండా పక్క పక్కనే సర్దుకోవాలి.

మూత పెట్టి, మంటను పూర్తిగా తగ్గించి పావుగంట పాటు ఉడకనివ్వాలి. పావుగంట తర్వాత మూత తీసి కడాయిని మాత్రమే జాగ్రత్తగా కదిలించి, మళ్ళీ మూతపెట్టి మరో పావుగంట పాటు తక్కువ మంటపై ఉడికించాలి. చేపలు త్వరగా ఉడుకుతాయి అనుకుని తొందరపడకుండా, ఇలా నెమ్మదిగా ఎక్కువ సేపు ఉడికించడం వల్ల పులుసులోని ఫ్లేవర్స్ అన్నీ ముక్కల్లోకి బాగా ఇంకి, కూర మరింత రుచిగా తయారవుతుంది. నీచు వాసన లేకుండా, ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలి. కూర మీద నురుగు అంతా పోయి, నూనె చక్కగా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మూతపెట్టి కొద్దిసేపు అలాగే వదిలేస్తే రుచి మరింత పెరుగుతుంది. చివరిగా, కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే. ఈ చిట్కాలను పాటిస్తూ వండితే, చేపలు ఇష్టం లేని వారు కూడా ఈ కూరను మళ్ళీ మళ్ళీ కోరుకుంటారు.