
ముందుగా మిక్సీ జార్లో నిమ్మకాయ సైజులో ఉన్న నాలుగు ఉసిరికాయ ముక్కలు, ఒక టీస్పూన్ మిరియాలు, ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక పెద్ద టమాటో లేదా రెండు చిన్న టమాటోలు కట్ వేసుకోవాలి. ఇందులో పావు కప్పు నీళ్ళు పోసి, మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక, ఒక టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, రెండు చిటికెల ఇంగువ వేసి, ఆవాలు చిటపటలాడే వరకు వేయించాలి.

ఆవాలు చిట్లిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు, ముక్కలుగా తుంచిన ఒక ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. ఈ తాలింపులో ఒక టీస్పూన్ సన్నని అల్లం తురుము, ఒక పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా వేయించాలి. వేగిన తాలింపులో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉసిరి-టమాటో పేస్ట్‌ను వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ పసుపు కూడా జోడించాలి.

ఇందులో నీళ్ళు పోసి, మీడియం ఫ్లేమ్ మీద రసం మధ్యలో పొంగు వచ్చేంతవరకు మరగనివ్వాలి. ఈ రసానికి చింతపండు అవసరం లేదు, ఉసిరికాయ, టమాటోలోని పులుపు సరిపోతుంది. సుమారు ఎనిమిది నిమిషాలకు రసం పొంగడం మొదలవుతుంది. రసం మధ్యలో పొంగడం మొదలైన తర్వాత, ఈ స్టేజ్‌లో పావు కప్పు మెత్తగా ఉడికించి ఎనుపుకున్న కందిపప్పును వేయాలి.

పప్పు వేసి కలిపి రెండు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. కందిపప్పు వేస్తే రసం రుచి మరింత పెరుగుతుంది, చిక్కగా నోటికి అందుతుంది. పప్పు వేయకపోయినా రసం బాగుంటుంది. చివరలో తరిగిన కొత్తిమీర తురుము చల్లి, స్టవ్ ఆపివేయాలి.

ఈ రసం మిరియాల ఘాటుతో ఉండాలి. పండిన టమాటో పండ్లనే వేయాలి , అప్పుడే ఉసిరి, టమాటో పులుపుతో చింతపండు అవసరం లేకుండా రసం రుచిగా ఉంటుంది. తరచుగా జలుబు చేసే పిల్లలకు రోజు విడిచి రోజు ఈ రసాన్ని పెట్టడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇది చాలా సింపుల్, ఎంతో హెల్తీ రెసిపీ, తప్పకుండా ప్రయత్నించాలి.