‘కంగారూ’ ఈ పేరు వినగానే మదిలో మెదిలే దేశం ఆస్ట్రేలియా. ఆ దేశ ఐకానిక్ చిహ్నంగా కంగారూ గుర్తుండిపోయింది. మీరెప్పుడైనా ఆలోచించారా..? కంగారూ జంతువులు ఎందుకు ఒక్క ఆస్ట్రేలియాలోనే కనిపిస్తాయి.. ఇతర దేశాల్లో ఎందుకు కనిపించవో..? శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో కొన్ని రహస్యాలు వెలుగులోకొచ్చాయి. అవేంటో తెలుసుకుందాం పదండి..
ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ (ANU), స్విట్జర్లాండ్‌లోని ETH జ్యూరిచ్‌లోని జీవశాస్త్రవేత్తల నేతృత్వంలో ఆస్ట్రేలియన్ సైంటిస్టులు ఓ అద్భుతమైన సంగతి కనుగొన్నారు. అందేంటంటే పది మిలియన్ల సంవత్సరాల క్రితమే భూమిపై ఉండే భిన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రాంతాలు లేదా దేశాలకు జంతువల పంపిణీ విధానం జరిగిందట. ఈ అధ్యయనం ప్రకారం.. ఆస్ట్రేలియా, న్యూ గినియా, ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలను కాంటినెంటల్ ఆగ్నేయాసియా నుంచి విడివడ్డాయి. ఆ సమయంలో ఆస్ట్రేలియా వాతావరణ పరిస్థితులు అనుగుణంగా ఉండటంలో కంగారూ జాతి జంతువులు అక్కడ స్థిరపడ్డాయని తెలిపారు.
అందుకే బోర్నియోలో మార్సుపియల్ క్షీరదాలు కనిపించవు. కానీ దాని పక్కనే ఉన్న సులవేసి ద్వీపానికి వెళితే అవి కనిపిస్తాయి. అలాగే ఆస్ట్రేలియాలో ఎలుగుబంట్లు, పులులు, ఖడ్గమృగాలు వంటి జంతువులేవీ కనిపించవని జీవశాస్త్రవేత్త డాక్టర్ అలెక్స్ స్కీల్స్ చెప్పారు.
జంతు జాతుల ఈ అసమాన పంపిణీకి పాక్షికంగా 45 మిలియన్ సంవత్సరాల నాటి పురాతన ప్లేట్ టెక్టోనిక్స్‌లో వచ్చిన మార్పులే కారణమని డాక్టర్ స్కీల్స్ వివరించారు. సుమారు 35 మిలియన్ల సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా అంటార్కిటికా ఖండంతో అనుసంధానించబడి ఉండింది. కాలక్రమంలో ఆస్ట్రేలియా అంటార్కిటికా నుంచి విడిపోయింది. మిలియన్ల సంవత్సరాలు గడిచే కొద్దీ అది ఉత్తర దిశగా ప్రయాణించి ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో స్థిరపడింది. అక్కడే ఇండోనేషియా అగ్నిపర్వత ద్వీపాలు ఆస్ట్రేలియాలో ఉద్భవించాయి. ఈ ఇండోనేషియా ద్వీపాలు న్యూ గినియా, ఉత్తర ఆస్ట్రేలియాకు చేరుకోవడానికి ఆసియా నుంచి వలస వచ్చిన జంతువులు, మొక్కలకు ‘స్టెప్పింగ్ స్టోన్స్’గా పనిచేశాయి.
ఏది ఏమైనప్పటికీ కాలక్రమేణా చల్లటి వాతావరణం నుంచి పొడి వాతావరణంగా అభివృద్ధి చెందిన ఆస్ట్రేలియాకి ఉష్ణవాతావరణంలో జీవించగలిగే ఆసియా నుంచి వలస వచ్చిన జంతువులు స్థిరపడ్డాయి. ఇలా వలస వచ్చిన జంతువుల్లో కంగారూ ఒకటి. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు సైంటిస్టులు సుమారు 20 వేల పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు, ఉభయచరాల డేటాను విశ్లేషించి వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.