Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

టిక్ టాక్ భూతం.. ఇంకా వదల్లేదు..!

, టిక్ టాక్ భూతం.. ఇంకా వదల్లేదు..!

మనుషులతో బంధాల కంటే వస్తువులకే ప్రాధాన్యత పెరిగిపోయింది. మారుతున్న టెక్నాలజీని చూసి సంతోషపడాలో బాధపడాలో అర్థంకాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్క యాప్ కుటుంబంలో కలతలు రేపుతోంది. దీంతో చిన్నా పెద్దా అనే తేడా లేదు. అందరూ యాక్టర్లు అయిపోతున్నారు. ఒక డైలాగ్‌ను ఇస్తే చాలు నమిలిపారేస్తున్నారు. దీనంతటికీ కారణం టిక్ టాక్… కోట్లాదిమంది దీన్ని వినియోగిస్తున్నారు. అయితే ఈ యాప్‌ను పరిశీలిస్తే దీనివల్ల కలిగే లాభం కన్నా, నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం టిక్ టాక్ యాప్ వినియోగించొద్దని చెప్పినందుకు ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పైగా తాను సూసైడ్ చేసుకుంటూ ఆ దృశ్యాన్ని రికార్డు చేసి టిక్ టాక్ వీడియోలో పోస్టు చేసింది. ఇక తాజాగా ఓ యువకుడు టిక్‌టాక్ లో వీడియో చేయబోయి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.

ఇంతకు ముందు వరకు ఫేస్ బుక్, వాట్సాప్‌లలో గంటలు తరబడి గడిపేవారు ఇప్పుడు టిక్ టాక్ వీడియోలతో కాలం గడిపేస్తున్నారు. తమకు నచ్చినవారి వీడియోలు చూస్తూ.. వారిని ఫాలో అవుతున్నారు. వేళ్లు అరిగేలా వీడియోలను స్క్రోల్ చేస్తూ రాత్రి పగలు తేడా లేకుండా బతికేస్తున్నారు. ఇక చూసే వారి పరిస్థితే ఇలా ఉంటే ఆ వీడియోలు చేసే వారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మేకప్‌లు వేసుకోవడం, కొత్త కొత్త బట్టలు వేసుకుని సాంగ్స్, డైలాగ్స్‌కు తగ్గట్టు తయారై వీడియోలు షూట్ చేసి అప్ లోడ్ చేయడం అలవాటై పోయింది. ఇందులో మంచి వీడియోలతో పాటు అసభ్యకరమైన పోస్టులు కూడా పెడుతున్నారు. ఆకాతాయిగా చేసే వీడియోలతో కొత్త కొత్త ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు.

కేవలం ఇండియాలోనే 30 కోట్ల మంది టిక్ టాక్‌ను వినియోగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు ఆదేశాల ప్రకారం గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్ల నుండి కొన్ని రోజుల పాటు ఆ అప్లికేషన్‌ తొలగించారు. దీంతో తమకు రోజుకి మూడు కోట్ల యాభై లక్షల రూపాయల నష్టం వస్తోందంటూ, టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేయాలని ఆ సంస్థ స్వయంగా వాదించింది. దీన్ని బట్టి టిక్ టాక్ ఎంతగా వ్యాపించిందో ప్రత్యేకించి చెప్పనవరం లేదు.

టిక్ టాక్ కారణంగా కొద్ది రోజుల క్రితం కోయంబత్తూరులో జరిగిన హత్య కలకలం రేపింది. తన భార్య రెచ్చగొట్టే విధంగా టిక్‌ టాక్‌లో వీడియోలు చేస్తూ పోస్ట్‌ చేయడం భరించలేక, ఎన్నిసార్లు చెప్పినా వినలేదని ఓ వ్యక్తి తన భార్యని దారుణంగా హత్య చేసి చంపేశాడు. అదొక్కటే కాదు, అనేకచోట్ల టిక్‌ టాక్‌ వీడియోలు చేయటం ఒక సరదాగా మొదలై, అది కుటుంబ కలహాలకు, విడాకులకు దారి తీయటం జరుగుతోంది. టిక్‌ టాక్‌లో ఉన్న డ్యూయట్‌ ఫీచర్‌ వలన సమస్య మరింత ముదురుతోంది. ఒక మహిళ ఒక వీడియోను పబ్లిక్‌గా పెడితే దాన్ని ఆసరాగా చేసుకొని, ముక్కు మొహం తెలియని వాళ్లు కూడా డ్యూయట్‌ వీడియోలు తయారు చేస్తున్నారు.

టిక్ టాక్ వీడియోలు చూడొద్దని భర్త మండలించడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. తాను పురుగుల మందు తాగుతూ ఆత్మహత్య చేసుకోవడాన్ని వీడియో తీసి టిక్‌టాక్ లో పెట్టడం సంచలనంగా మారింది. తమిళనాడులోని వంగారం గ్రామానికి చెందిన అనితతో పళనివేలుకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పళనివేలు సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలతో అనిత పెరంబలూరులో ఉంటోంది. ఇంట్లో ఖాళీగా ఉంటోన్న అనిత టిక్ టాక్ కు అలవాటు పడింది. పిల్లల్ని పట్టించుకోకుండా డ్యాన్స్‌ చేయడం, పాటలు పాడడం, మేకప్‌ వేసుకోవడం వంటి వీడియోలను నిత్యం యాప్‌లో పోస్టు చేస్తోంది. విషయం తెలుసుకున్న భర్త మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. పైగా ఆత్మహత్య చేసుకుంటూ ఆ వీడియోను టిక్ టాక్ లో అప్ లోడ్ చేసింది. దీనిబట్టి చెప్పొచ్చు మనిషి ఎంత మూర్ఖంగా ప్రవరిస్తున్నాడో అని. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే అంతగా టిక్ టాక్ ప్రభావం చూపుతోంది.

రెండు రోజుల క్రితం టిక్ టాక్‌లో వెరైటీగా స్టంట్ చేయబోయి ఓ యువకుడు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కర్ణాటక తమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి సమీపంలోని గూడకెరెకు చెందిన కుమార్ సరదాగా తన స్నేహితుడితో కలిసి టిక్ టాక్ వీడియో చేయాలనుకున్నాడు. సినిమా రేంజ్‌లో స్నేహితుడి చేతిలో కాలు పెట్టి.. బ్యాక్ జంప్ చేయడానికి ట్రై చేశాడు. ఎదురుగా తన స్నేహితుడిని నిలబడమని చెప్పి.. పరుగెత్తుకుంటూ వచ్చి స్నేహితుడి చేతిలో కాలు వేశాడు. బ్యాక్ జంప్ చేస్తుండగా అది కాస్త పట్టు తప్పి కుమార్ తల కిందకుపడి.. బాడీ మొత్తం తలపై పడింది. దీంతో అతని మెడ విరిగిపోయింది. ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. కుమార్ మెడ భాగం విరిగిపోయి.. వెన్నుపూస ఎముకలు విరిగినట్లు వైద్యులు చెప్పారు.

తాజాగా టిక్‌టాక్‌లో వీడియో చేయాలనే సరదా ఓ బాలుడి ప్రాణాన్ని బలితీసుకుంది. రాజస్థాన్‌లోని కోటకు చెందిన ఓ బాలుడు తన తల్లి గాజులు, మంగళసూత్రం వేసుకుని వీడియో తీద్దామనుకున్నాడు. అనుకున్నట్లుగా బాత్‌రూంలోకి వెళ్లి మెడకు ఇనుప గొలుసు చుట్టుకుని వీడియో తీయడానికి ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తు గొలుసు మెడకు బిగుసుకుపోవడంతో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయాడు. తమ కుమారుడు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో బాత్‌రూం తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. విగత జీవిగా పడి ఉన్న తమ కుమారుడిని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్డం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

పనులు పక్కన పెట్టి మరి గంటల తరబడి టిక్ టాక్ వీడియోలు చూస్తూ గడిపేవారు ఈ కాలంలో ఎక్కువైపోయారు. ఒకర్ని చూసి ఒకరు అలాగే తయారవుతున్నారు. టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ కూర్చుంటున్నారని.. తమతో గడపడం లేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీకి వెళ్లే వారు, ఆఫీసులకు వెళ్లేవారు అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేదు ఎక్కడ చూసినా.. ఎవరి చేతిలో చూసినా అదే కనిపిస్తోంది. పక్కనవారి మాటలు కూడా పట్టించుకోకుండా టిక్ టాక్ వీడియోల్లో లీనమై పోతున్నారు.

ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని టిక్ టాక్‌పై భారత్‌లో ఏప్రిల్ 15 నుంచి నిషేధం విధించారు. దీంతో చైనాకు చెందిన బైట్‌డాన్స్ టెక్నాలజీస్ గగ్గోలు పెడుతోంది. కంపెనీ రోజుకు కోట్ల రూపాయలు నష్టపోతోందని.. అలాగే 250 మంది ఉద్యోగుల పరిస్థితి రిస్క్‌లో పడిందని ఆ సంస్థ స్పష్టం చేస్తోంది. భారత్‌లో ఉన్న 12 కోట్ల టిక్ టాక్ యూజర్లకు సేవలు కొనసాగిస్తామని తెలిపింది. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అయితే యాప్ టర్మ్స్ అండ్ కండీషన్స్ ఫాలో అవ్వని 60 లక్షల వీడియోలను ఇప్పటివరకూ తొలగించినట్లు బైట్‌డాన్స్ సంస్థ తెలిపింది. కాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాప్‌లలో గూగుల్, ఆపిల్ తర్వాత టిక్ టాక్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఖాతాదారులుగా 88.6 మిలియన్ యూజర్లు ఉన్నారట. ఇప్పటికే యూఎస్, యూకే, హాంకాంగ్, ఇండోనేషియా దేశాల్లో ఈ యాప్‌లపై పూర్తిగా నిషేధం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి యాప్‌లను హద్దుల్లో వినియోగించుకోవాలి. విచక్షణ మరిస్తే ఇబ్బందుల్లో పడటం ఖాయం అని చెప్పడంలో సందేహం లేదు.

Related Tags