చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపిన సంగతి అందిరికీ తెలిసిందే. అయితే సోమవారం జరిగినటువంటి కేంద్ర కేబినేట్ సమావేశంలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై చర్చించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అయితే ఈ బిల్లు ఎంపీలకు ఓ అగ్నిపరీక్ష లాంటిదే అని మోదీ అన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పిన వాటిని పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈ బిల్లును అమలు చేయాలంటే ముందుగా.. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలు పూర్తి కావాలి. ఇవి పూర్తి అయిన తర్వాత 2027 నాటికి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను పూర్తి స్థాయిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు పలు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
అయితే మహిళా రిజర్వేషన్ బిల్లును ఈరోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు పాసైతే ఇక చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండనుంది. ఈ బిల్లుకు నారి శక్తి వందన్ అని కేంద్రం నామకరణం చేసింది. రేపు ఈ బిల్లుపై రేపు చర్చ జరగనుంది. అలాగే ఎల్లుండి రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు వల్ల మహిళా శక్తి రెట్టింపు అవుతుందని ప్రధాని మోదీ అన్నారు. అలాగే ఉభయసభలు ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించాలని పిలుపునిచ్చారు. అయితే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు 2010వ సంవత్సరంలో రాజ్యసభలో ఆమోదం పొందినటువంటి బిల్లు కాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే ఈ తాజా బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుందని చెప్పాయి. మరోవైపు ఈ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం విపక్షాలు ఆందోళన చేశాయి. బిల్లు కాపీ తమకు ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నల వర్షం గుప్పించాయి. అలాగే ఈ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం లోక్‌సభ వాయిదా పడింది.
అయితే ఉభయ సభల్లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినట్లైతే.. లోక్‌సభ అలాగే రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఇదిలా ఉండగా.. వాస్తవానికి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో హెచ్‌డీ దేవగౌడ నేతృత్వంలో యునైటడ్ ఫ్రంట్ ప్రభుత్వం ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వాజ్‌పేయ్, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో ప్రవేశపెట్టినప్పటకీ కూడా ఈ బిల్లుకు ఆమోదం లభించలేదు. అయితే చివరికి ఈ బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందింది. కానీ లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. అలాగే 2014లో లోక్‌సభ రద్దు కావడం వల్ల అక్కడితో ఈ బిల్లు ఆగిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఈ బిల్లును ప్రవేశపెట్టింది. మరీ ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..