కోల్‌కతా లేడీ డాక్టర్ హత్యాచార ఘటనపై చిక్కుల్లో ఇరుక్కున్న మమత సర్కార్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. యాంటీ రేప్ బిల్లును బెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది. అపరాజిత బిల్లు అని దీనికి పేరు పెట్టారు. రేపిస్టులకు జీవితఖైదు విధించేలా చట్టాన్ని తీసుకొచ్చారు. రేప్ కేసుల్లో దోషులకు 10 రోజుల్లో శిక్షలు పడేలా ఈ బిల్లును తీసుకొచ్చారు. బెంగాల్ అసెంబ్లీలో అపరాజిత బిల్లుకు బీజేపీ కూడా మద్దతు తెలిపింది. రేపిస్టులకు కఠినశిక్షలు అమలు చేయడంలో బెంగాల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు మమత . బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాలకు పాల్పడే నిందితులు స్వేచ్చగా తిరుగుతున్నారని ఆరోపించారు. యూపీలో హథ్రస్ , ఉన్నావ్ రేప్ ఘటనలను ఆమె ప్రస్తావించారు. బెంగాల్ గవర్నర్ అపరాజిత బిల్లును వెంటనే ఆమోదించాలని మమత డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ కేంద్రంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. రేపిస్టులకు కఠినశిక్షలు పడేలా కొత్త చట్టం తేవాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధాని మోదీకి రెండుసార్లు లేఖ రాసినప్పటికి స్పందన లేదన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలను ఎన్నికల ముందు హడావుడిగా పార్లమెంట్‌లో కేంద్రం ఆమోదించిందన్నారు. రాష్ట్రాలను సంప్రదించుకుండానే ఈ బిల్లను తీసుకొచ్చారని మమత విమర్శించారు.
మరోవైపు ఆర్ జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అవినీతి కేసులో సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన సీబీఐ కోర్టులో హాజరుపర్చింది. నిందితులకు ఆరు రోజుల సీబీఐ కస్టడీ విధించింది కోర్టు . లేడీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనపై బెంగాల్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. కోల్‌కతాలో న్యాయవాదులు కోర్టులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..