అందరికీ సకల శుభాలు కలగాలి.. రాష్ట్రపతి, ప్రధాని నుంచి చంద్రబాబు, రేవంత్, పవన్ కళ్యాణ్ వరకు.. దసరా శుభాకాంక్షలు!

PM Modi Vijayadashami Wishes: దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.

అందరికీ సకల శుభాలు కలగాలి.. రాష్ట్రపతి, ప్రధాని నుంచి చంద్రబాబు, రేవంత్, పవన్ కళ్యాణ్ వరకు.. దసరా శుభాకాంక్షలు!
Pm Modi Vijayadashami Wishes

Updated on: Oct 20, 2026 | 10:55 AM

Vijayadashami Greetings: దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు నేడు (అక్టోబర్ 20, 2026) వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులపాటు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ.. విజయదశమి రోజున రాజరాజేశ్వరి మాతగా కొలువుదీరారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహిస్తున్నారు. విజయదశమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, పూజలు నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పర్వదినాన్ని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆలయాలు భక్తుల రద్దీతో సందడిగా మారాయి. ప్రత్యేక పూజలు, హారతులు, తీర్థప్రసాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి ఆశీస్సులతో కుటుంబాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం చేకూరాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.

దేశ ప్రజలకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దసరా శుభాకాంక్షలు

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ అందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు. ఆనందం, విశ్వాసంతో నిండిన ఈ విజయ పర్వదినం ప్రతి ఒక్కరి సంకల్పానికి నూతన బలాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, విజయాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘రాముడు ధర్మానికి ప్రతిరూపం, మంచితనానికి, సత్యానికి, పరాక్రమానికి ప్రతీక. సకల లోకాలకూ ఆయన మహారాజు, దేవతల్లో ఇంద్రుడు ఎంత గొప్పవాడో, అలాగే లోకాలన్నింటిలో శ్రీరాముడు అంతటి మహోన్నతుడు.’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

 

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు

విజయదశమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరుకున్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్ట స్థానమున్న దసరా పండుగ… ధైర్యం, ధర్మం, సత్యం, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను మనకు గుర్తుచేస్తుంది. ప్రేమ, కరుణ, సోదరభావం, మానవత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి సంకేతంగా ప్రతి పల్లెలో పండుగ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి. లంగాణ పల్లెపల్లెల్లో దసరా వేడుకలకు మరింత ప్రత్యేకతను చేకూర్చే జమ్మిపూజ, జమ్మి ఆకులను (బంగారం) ఆత్మీయులకు అందించుకోవడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం మన సంస్కృతిలోని గొప్పదనానికి ప్రతీకలు. ప్రకృతిని ప్రేమించడం, పెద్దలను గౌరవించడం, బంధాలను బలోపేతం చేసుకోవడం, పరస్పర ప్రేమాభిమానాలను పంచుకోవడం వంటి విలువలను ఈ సంప్రదాయాలు చాటిచెబుతాయని” ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ఈ విజయదశమి రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, సకల విజయాలు కలగాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి.

రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు

‘జై దుర్గాభవాని! రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ మనకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది.
రైతన్న శ్రమకు తగిన ఫలితం, మహిళలకు సాధికారత, యువతకు మంచి భవిష్యత్తు అందించేందుకు మేం చేస్తున్న సంకల్పానికి ఆ జగన్మాత అనుగ్రహం లభించాలని ప్రార్ధిస్తున్నాను. ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.’ అని ట్వీట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దసరా శుభాకాంక్షలు

‘చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయ దశమి పర్వదినాన యావత్ భారతావని ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా శక్తి స్వరూపిణిని ఆరాధిస్తూ దసరా ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకుంటున్నారు. దేశ ప్రజలందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాలు గౌరవ భారత రాష్ట్రపతితోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాకతో మరింత శోభాయమానంగా జరిగాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ వేదికగా నిర్వహించిన జాతీయ స్థాయి సరస్ మేళా రాష్ట్ర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసింది. శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోందని తెలియజేస్తూ.. ఈ విజయదశమి ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షిస్తున్నాను.’ అని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు. రాజరాజేశ్వరి దేవిగా దర్శనం

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ఇవాళ్టితో వైభవంగా ముగియనున్నాయి. చివరి రోజైన విజయదశమి సందర్భంగా దుర్గమ్మవారు భక్తులకు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 2:30 గంటల నుంచే అమ్మవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. 11 నుంచి వైభవంగా సాగిన ఈ నవరాత్రులు ఇవాళ ఉదయం పదిన్నరకు పూర్ణాహుతితో ముగుస్తాయి. అయితే, ఉత్సవాలు నేటితో ముగిసినప్పటికీ, భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు మాత్రం మరో రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి.

ఇక మధ్యాహాన్నం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అమ్మవారిని దర్శించుకోనున్నారు. దసరా ప్రారంభం నుంచి నిన్నటి వరకు 13 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైన తెప్పోత్సవానికి రంగం సిద్ధమైంది. గత మూడేళ్లుగా కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా హంసవాహన విహారానికి అంతరాయం కలిగింది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో పాటు అన్ని అనుమతులు రావడంతో.. మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ హంసవాహన తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

సాయంత్రం 3:45 గంటలకు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం నుంచి ఆదిదంపతుల నగరోత్సవ ఊరేగింపు ప్రారంభమై కృష్ణా తీరానికి చేరుకుంటుంది. సాయంత్రం 5:30 – 6:30 గంటల మధ్య విద్యుద్దీపాల కాంతులతో అలంకరించిన దివ్యమైన హంసవాహనంపై స్వామి, అమ్మవార్లు పవిత్ర కృష్ణా నదీ జలాలపై విహరిస్తారు. సుమారు 40 నిమిషాల పాటు నదిలో 3 రౌండ్ల పాటు ఈ తెప్పోత్సవం నయనానందకరంగా సాగుతుంది. తెప్పోత్సవం ముగిసిన తర్వాత, ఉత్సవ మూర్తులను వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం తిరిగి కొండపైకి చేరుస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us