సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్(75) దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఈయనకు బీపీ, షుగర్‌తో పాటూ కార్డియా సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు . మంగళవారం అనారోగ్యం కారణంగా కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ & మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిట్ అయ్యారు. అయితే నిన్న రాత్రి 10.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 1948 జూన్ 10 న బీహార్‌లోని అరారియాలో జన్మించిన రాయ్.. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మీడియా, హాస్పిటాలిటీ, ఆటోమొబైల్, ఎడ్యూకేషన్ సహా వివిధ రంగాలలో విస్తరించి పెద్ద సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. భారతదేశ వ్యాపార రంగంలో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు. ఇండియన్ క్రీడాకారులు ధరించే స్పోర్ట్స్ జెర్సీపై తన సంస్థ పేరును బ్రాండింగ్‌గా మార్చుకొని దశాబ్ధాల పాటూ చరిగిపోనిదిగా ముద్రించుకున్నారు.
గోరఖ్‌పూర్‌లోని ప్రభుత్వ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడంతో రాయ్ ప్రయాణం ప్రారంభమైంది. అతను 1976లో కష్టాల్లో ఉన్న చిట్ ఫండ్ కంపెనీ సహారా ఫైనాన్స్‌ను టేకప్ చేసి ఫైనాన్స్ రంగంలోకి ప్రవేశించారు. 1978లో దానిని సహారా ఇండియా పరివార్‌గా మార్చాడు. ఇలా క్రమక్రమంగా సహారా అనేక వ్యాపారాలలోకి విస్తరించింది. 1992లో హిందీలో రాష్ట్రీయ సహారా పేరుతో వార్తాపత్రికను ప్రారంభించింది. 1990ల చివరలో పూణే సమీపంలో ప్రతిష్టాత్మకమైన ఆంబీ వ్యాలీ సిటీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి, సహారా టీవీతో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించారు. కొద్ది రోజులకు దీనిని సహారా వన్‌గా మార్చారు. 2000లో సహారా లండన్‌లోని గ్రోస్వెనర్ హౌస్ హోటల్‌తో పాటూ న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్‌ను కొనుగోలు చేసి హోటల్ మేనేజ్మెంట్ రంగంలో అడుగు పెట్టారు. కేవలం రూ.2000 పెట్టుబడితో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి కోట్ల సామ్రాజ్యానికి అధినేతగా మారిన ఆయన జీవితం ఎంతో మంది స్టార్టప్ సంస్థలకు స్పూర్థి దాయకంగా నిలుస్తోంది.
సహారా పరివార్‌ను టైమ్స్ ఇండియా అనే మ్యాగజైన్ ఒకప్పుడు భారతీయ రైల్వేల తర్వాత మనదేశంలో రెండవ అతిపెద్ద ఉపాధి సంస్థగా కీర్తించింది. సుమారు 1.2 మిలియన్ల మంది ఉద్యోగులను కలిగి ఉందని పేర్కొంది. అతనికి వ్యాపారంలో పెద్దగా విజయాలు ఉన్నప్పటికీ, న్యాయపరమైన సవాళ్లను కూడా ఎదుర్కొంటూ వచ్చారు. 2014లో, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)తో వివాదానికి సంబంధించి కోర్టుకు హాజరుకానందున భారత అత్యున్నత న్యాయస్థానం అతనిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. ఇది సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారితీసింది. రాయ్ కొన్ని రోజుల పాటూ తీహార్ జైలులో గడిపి ఆపై పెరోల్‌పై విడుదలయ్యారు.
అతనికి వ్యాపార సామ్రాజ్యంలో ఉన్న అపారమైన అనుభవానికిగానూ ఈస్ట్ లండన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పట్టాను ఇచ్చి గౌరవించింది. అలాగే లండన్‌లోని పవర్‌బ్రాండ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్‌లో బిజినెస్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు రాయ్. ఇలా అనేక అవార్డుతో భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన పారిశ్రామిక వేత్తగా నిలిచారు. ఇటీవల కాలంలో ఎలక్ట్రాలనిక్ వాహనాల తయారీతోపాటూ గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు ఉత్నత విద్యను కల్పించాలనే ఉద్ధేశ్యంతో ముందుకు సాగారు. ఈయన మరణం యావత్ పారిశ్రామిక రంగానికే తీరని లోటుగా కొందరు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..