ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు మాట్లాడే ప్రతి మాట ఆచి, తూచి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే ఆ మాట చేసే చేటు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నోరు జారి ఏదైనా మాట్లాడారా ఇక అంతే సంగతులు. కొందరు నేతలు పదవులు పోగొట్టుకోగా, మరికొందరు అధికారాన్ని సైతం కోల్పోయిన ఉదంతాలు, దాఖలాలు ఉన్నాయి. కొందరు నేతలు చేసే వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టిస్తుంటే.. మరికొందరు నేతలు చేసే వ్యాఖ్యలు తమ అజ్ఞానాన్ని బయటపెడుతుంటాయి. ఈ కోవలో కంగనాతోపాటు మరికొంతమంది నేతలు ఉన్నారు. తాజాగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పొరపాటున నోరుజారి చేసిన వ్యాఖ్య ఇప్పుడు సరికొత్త వివాదాన్ని సృష్టిస్తోంది. జమ్ము-కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం (సెప్టెంబర్ 25) నాడు జమ్ముతో పాటు కాశ్మీర్ లోయలో ఉన్న సోపోర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఒక సభలో ప్రసంగిస్తూ కాశ్మీరీ పండిట్ల గురించి చెప్పబోయి వారిని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) నుంచి వచ్చిన శరణార్థులుగా పేర్కొన్నారు. ఆ వెంటనే తన తప్పును గ్రహించి సరిదిద్దుకున్నారు. అయినప్పటికీ.. రాహుల్ ఎక్కడ దొరుకుతారా అని కాచుకుని కూర్చునే ప్రత్యర్థి పార్టీ సోషల్ మీడియా విభాగం వెనువెంటనే ఆ మాటలను క్యాచ్ చేసింది. దాన్ని వివాదం చేస్తూ పోస్టులు పెడుతోంది. ఇంతకీ ఆయన ఏమన్నారు? అందులో అంత వివాదాస్పదంగా ఉన్న విషయమేంటి? అనేది చూడండి..
రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచారంలో కాశ్మీర్ లోయకు తిరిగొచ్చిన కాశ్మీరీ పండిట్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 90వ దశకంలో దారుణమైన ఊచకోతకు, మారణహోమానికి గురైన కాశ్మీరీ పండిట్లు లోయను విడిచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెల్లాచెదురైన విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. నివాసాలు, ఆస్తులు అన్నింటినీ వదులుకుని కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకునేందుకు లోయను వీడిన కాశ్మీరీ పండిట్లు న్యాయం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. తాజాగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత పండిట్లలో కొందరు మాత్రమే తమ ప్రాంతాలకు తిరిగి చేరుకున్నారు. వారిని ఆకట్టుకోవడం కోసం కాశ్మీరీ పండిట్లకు తమ హయాంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ చేసిన హామీలను నిలబెట్టుకున్నామని చెప్పారు. అయితే ఈ క్రమంలో కాశ్మీరీ పండిట్లను పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చిన శరణార్థులుగా సంబోధించడమే వివాదానికి కారణమైంది. “పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చిన శరణార్థులకు మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు అమలు చేశాం. సారీ.. కాశ్మీరీ పండిట్లు.. కాశ్మీరీ పండిట్లకు ఇచ్చిన హామీలను అమలు చేశాం” అంటూ రాహుల్ గాంధీ తన పొరపాటును వెనువెంటనే సరిదిద్దుకున్నారు. బహిరంగ సభలో చేసిన వ్యాఖ్య కాబట్టి సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రసంగం లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. దాన్ని ఎడిట్ చేసి విడుదల చేయడానికి కూడా ఆస్కారం లేకపోయింది. దాంతో బీజేపీ సోషల్ మీడియా విభాగం ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ తమ విమర్శనాస్త్రాలు సంధించింది.
బీజేపీ సీనియర్ నేత, సోషల్ మీడియా విభాగం వ్యవహారాలు చూసుకుంటున్న అమిత్ మాలవ్యా స్పందిస్తూ.. “రాహుల్ గాంధీ ఇక మీదట ‘పప్పు’ (అవివేకి లేదా పరిపక్వత లేని వ్యక్తి) కాదంటూ కాంగ్రెస్ ఓవర్సీస్ విభాగం నేత శామ్ పిట్రోడా మనందరినీ నమ్మించాలని చూస్తున్నారు. కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చిన శరణార్థులకు, కాశ్మీరీ పండిట్లకు మధ్య తేడా తెలుసుకోలేకపోతున్నారు. అసలు కాశ్మీర్ సమస్యకు మూలమే జవహర్‌లాల్ నెహ్రూ. అది చాలదన్నట్టు ఆయన వారసత్వం కూడా అలాగే వ్యవహరిస్తోంది” అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Then Sam Pitroda wants us to believe that he isn’t Pappu anymore… a man who is the Leader of Opposition can’t distinguish between refugees from PoK and Kashmiri Pandits.
The mess in Kashmir is a legacy of Jawaharlal Nehru. As if that wasn’t enough, we now have Rahul Gandhi also. pic.twitter.com/xKFhpirM2Z— Amit Malviya (@amitmalviya) September 25, 2024
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సైతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు చేశారు. “జమ్ము-కాశ్మీర్ ప్రజలకు భారత ప్రభుత్వం ఒక ఔట్‌సైడర్, కానీ పాకిస్తాన్ మాత్రం కాదు” అన్నట్టుగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ జమ్ములో చేసిన ప్రసంగంలో జమ్ము-కాశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా గురించి మాట్లాడుతూ “భారతదేశ చరిత్రలో అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఏపీ నుంచి తెలంగాణ, బిహార్ నుంచి ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్ వంటి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఒక రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతం (UT)గా మారింది. అది జమ్ము-కాశ్మీర్ విషయంలోనే జరిగింది. ఇది మీ అందరికీ జరిగిన అన్యాయం. మీ ప్రజాస్వామ్య హక్కులను లాక్కుపోయారు” అన్నారు. దీనికి కొనసాగింపుగా.. “జమ్ము-కాశ్మీర్‌ను ఆ రాష్ట్ర ప్రజలు పరిపాలించడం లేదు. వేరే రాష్ట్రానికి చెందినవారు పాలిస్తున్నారు. ఈ ఎన్నికలకు ముందే మీకు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా వస్తుందని భావించాం. అదే సరైన చర్య. కానీ వాళ్లు ముందు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మేము జమ్ముకాశ్మీర్ రాష్ట్ర ప్రజల ప్రజాస్వామ్య హక్కులు, రాష్ట్ర హోదాు తిరిగివ్వమని డిమాండ్ చేస్తున్నాం” అన్నారు. జమ్ము తర్వాత సోపోర్‌లో జరిగిన సభలోనూ ఇవే వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలనే విష్ణువర్ధన్ రెడ్డి తప్పుబట్టారు. “కాంగ్రెస్ ఎప్పుడూ కాశ్మీర్ విషయంలో బయటిదేశం పాకిస్తాన్‌తో చర్చలు కోరుకుంటుంది. వారికి భారతదేశం ఔట్‌సైడర్, కానీ పాకిస్తాన్ మాత్రం కాదు” అంటూ విమర్శించారు.
So basically, Rahul Gandhi is saying in Jammu that ‘the Indian govt is an outsider for the people of J&K, so it’s an injustice for them.’
But same Congress & their allies always advocate for talks with Pakistan regarding Kashmir. So, for him, the Indian govt is an outsider, but… pic.twitter.com/3SW3w7MEmg
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) September 25, 2024
రాహుల్ గాంధీ వివిధ అంశాలపై చేస్తున్న వ్యాఖ్యలు అనేక సందర్భాల్లో వివాదాస్పదంగా మారుతున్నాయి. విదేశాలకు వెళ్లినప్పుడు సైతం ఆయన భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారన్న విమర్శల్ని ఆయన ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవి ఆయన అపరిపక్వతను బయటపెడుతుంటాయి. అయితే తాజా వ్యాఖ్యలు పొరపాటున చేసినవే తప్ప అవగాహన లేకుండా చేసినవి కాదు. అయినా సరే.. ఎన్నికల వేళ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ లాభం పొందాలని ప్రత్యర్థులు చూస్తుంటారు. అందుకు ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..