రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. రాజ్యాంగంతోనే సామాన్యుడికి అత్యున్నత పదవులు!

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాసిన ప్రత్యేక వ్యాసం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. భారత రాజ్యాంగం సామాన్యులకు కల్పించిన అవకాశాలు, పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాలు, కీలక రాజ్యాంగ సవరణలు, మహిళా రిజర్వేషన్లు సహా పలు అంశాలను ప్రస్తావించారు. గత ప్రభుత్వాల రాజ్యాంగ సవరణలపై విమర్శలు గుప్పిస్తూ.. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. రాజ్యాంగంతోనే సామాన్యుడికి అత్యున్నత పదవులు!
PM Narendra Modi

Updated on: Nov 27, 2026 | 10:35 AM

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు కల్పిస్తూ, సామాజిక, ఆర్థిక న్యాయం అందించే గొప్ప పునాదిగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన రాసిన ప్రత్యేక వ్యాసంలో రాజ్యాంగ ప్రాధాన్యత, దేశంలో చోటుచేసుకున్న సంస్కరణలు, సామాన్య ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు, మహిళా సాధికారత సహా పలు అంశాలను ప్రస్తావించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయులకు నివాళులర్పిస్తూ.. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగంతోనే సామాన్యుడికి అత్యున్నత స్థానం

డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తో పాటు రాజ్యాంగ పరిషత్ సభ్యుల సేవలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. యువతకు రాజ్యాంగంపై అవగాహన పెంచాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రారంభించిందని తెలిపారు. తాను సాధారణ ఆర్థిక పరిస్థితులున్న కుటుంబంలో పుట్టానని, ఎలాంటి వారసత్వ హోదాలు, ప్రత్యేక అవకాశాలు లేకుండానే ఎదిగానని మోదీ గుర్తుచేసుకున్నారు. తనలాంటి సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సేవ చేసే బాధ్యతను చేపట్టే అవకాశం రాజ్యాంగం వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు.

పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాలు

రాజ్యాంగం హామీ ఇచ్చిన సామాజిక, ఆర్థిక న్యాయం క్రమంగా ప్రజల జీవితాల్లో వాస్తవ రూపం దాలుస్తోందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రపంచ బ్యాంకు నివేదికను ప్రస్తావిస్తూ.. భారత్‌లో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్, ముద్ర, పీఎం స్వనిధి పథకాలతో పాటు యూపీఐ వంటి డిజిటల్ సేవలు సామాన్యులకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయని వివరించారు.

చారిత్రక డిమాండ్లకు మూడు కీలక రాజ్యాంగ సవరణలు

దేశంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు డిమాండ్లకు రాజ్యాంగ సవరణల ద్వారా పరిష్కారం చూపినట్లు మోదీ తెలిపారు. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిందని, 102వ సవరణతో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా లభించిందని గుర్తుచేశారు. 103వ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు.

ప్రజలకు మరింత చేరువైన రాజ్యాంగం

భారత రాజ్యాంగం తొలిసారిగా ఎనిమిదో షెడ్యూల్‌లోని మొత్తం 22 భాషల్లో అందుబాటులోకి వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత కూడా శిక్షకు ప్రాధాన్యత ఇచ్చే వలస పాలన నాటి విధానం నుంచి న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యవస్థ వైపు దేశాన్ని తీసుకెళ్తోందని వివరించారు.

గత ప్రభుత్వాలపై మోదీ విమర్శలు

రాజ్యాంగంలోని కొన్ని సవరణలను ప్రస్తావిస్తూ గతంలో అధికారంలో ఉన్న నాయకత్వంపై ప్రధాని విమర్శలు గుప్పించారు. తొలి రాజ్యాంగ సవరణ ప్రాథమిక స్వేచ్ఛలను పరిమితం చేసిందని, 42వ సవరణ ద్వారా న్యాయ సమీక్ష అధికారాలకు కోత పడిందని ఆరోపించారు. అధికార దాహంతో, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించే నాయకత్వం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలుసుకోవడానికి యువత 38వ, 39వ రాజ్యాంగ సవరణలను అధ్యయనం చేయాలని సూచించారు. ఆర్టికల్ 356ను ఉపయోగించి దాదాపు 100 సార్లు రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేశారని, ఒక ప్రధానమంత్రి మాత్రమే 50కి పైగా సార్లు ఈ అధికారాన్ని వినియోగించారని విమర్శించారు.

ఆర్టికల్ 370 రద్దుతో హక్కుల విస్తరణ

2019లో ఆర్టికల్ 370, 35ఏలకు సంబంధించిన మార్పులతో చారిత్రక తప్పిదం సరిదిద్దినట్లు మోదీ పేర్కొన్నారు. గతంలో జమ్మూకశ్మీర్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు, మహిళలు కొన్ని హక్కులకు దూరమయ్యారని, తాజా మార్పులతో వారికి రాజ్యాంగ హక్కులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. నక్సలిజం నిర్మూలనతో పేదలు భయం లేకుండా తమ హక్కులను వినియోగించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిలో ఇప్పుడు ‘దిమాగీ నక్సల్స్’ మాత్రమే మిగిలారని వ్యాఖ్యానించారు.

రిజర్వేషన్లపై ప్రతిపక్షానికి మోదీ ప్రశ్నలు

ఓబీసీల రిజర్వేషన్లను తగ్గించి, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచనను అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ముందుకు తెస్తోందని ప్రధాని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తో పాటు రాజ్యాంగ నిర్మాతలు మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకించారని తన వ్యాసంలో పేర్కొన్నారు.

మహిళా సాధికారతకు పెద్దపీట

రాజ్యాంగ రూపకల్పనలో మహిళలు పోషించిన పాత్రను మోదీ ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడంపై ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ‘విరోధ పక్షం’ కంటే ‘అవరోధ పక్షం’గా మారిందని వ్యాఖ్యానించారు. దేశ మహిళల హక్కులు, సాధికారత దిశగా చేపట్టే ప్రయత్నాలను ఏ శక్తీ అడ్డుకోలేదని పేర్కొన్నారు.

2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం

దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ‘ఇండియా ఫస్ట్’ అనే ఆలోచనతో ముందుకు సాగాలని ప్రధాని పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన పౌరులుగా తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే రాజ్యాంగ విలువలను గౌరవించడం, హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించడం ప్రతి ఒక్కరికీ అవసరమని తన వ్యాసంలో మోదీ పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us