
మిజోరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఐజ్వాల్ సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సియాల్‌సుక్ వద్ద గురువారం ఓ కారు అదుపుతప్పి లోతైన కందకంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దూరదర్శన్ ఐజ్వాల్ సెంటర్ న్యూస్ డైరెక్టర్‌గా, డిఫెన్స్ పీఆర్ఓగా పనిచేసిన నంపిబౌ మారన్మయితో పాటు పీఐబీ ఇంఫాల్ ప్రాంతీయ కార్యాలయ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ అంగమ్ పామే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ (సీబీసీ) ఐజ్వాల్ ప్రాంతీయ కార్యాలయానికి చెందిన ఎం.టి.ఎస్ ఉద్యోగి హెచ్. లియన్వాలా మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు, అధికారుల వివరాల ప్రకారం.. నలుగురు సియాల్‌సుక్ పర్యాటక ప్రాంతం నుంచి ఐజ్వాల్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌కు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కందకంలో పడిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతుల్లో నంపిబౌ మారన్మయికి రక్షణ వ్యవహారాలు, డిఫెన్స్ న్యూస్ కవరేజీలో సుదీర్ఘ అనుభవం ఉంది. డిఫెన్స్ పీఆర్ఓగా పనిచేస్తూ భారత రక్షణ దళాలకు సంబంధించిన సమాచారం, కార్యకలాపాలు, విజయాలను ప్రజలకు చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అనంతరం డీడీ న్యూస్ మిజోరం డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. రక్షణ జర్నలిజానికి ఆయన చేసిన సేవలను సహచరులు, అధికారులు గుర్తు చేసుకున్నారు.
పీఐబీ ఇంఫాల్ ప్రాంతీయ కార్యాలయ అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన డాక్టర్ అంగమ్ పామే కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం సమాచార, ప్రసార రంగంలో విషాదాన్ని నింపింది. సీబీసీ ఐజ్వాల్ కార్యాలయానికి చెందిన హెచ్. లియన్వాలా మృతితో వారి సహచరులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ ఘటనపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, ఈ పూడ్చలేని నష్టాన్ని భరించే శక్తిని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని సహచరులు, అధికారులు ప్రార్థించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..