Akhilesh Yadav: అకస్మాత్తుగా హైదరాబాద్‌కు అఖిలేశ్.. కేసీఆర్‌తో భేటీ వెనుక వ్యూహమేంటి? దౌత్యవ్యూహమిదేనా?

| Edited By: Shaik Madar Saheb

Jul 03, 2023 | 8:55 PM

అసలేం జరుగుతోంది ? సడన్‌గా అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ సిటీకి రావడం, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అవడంతో మొదలైన ప్రశ్న ఇది. మొన్నటికి మొన్న బీహార్ రాజధాని పాట్నాలో...

Akhilesh Yadav: అకస్మాత్తుగా హైదరాబాద్‌కు అఖిలేశ్.. కేసీఆర్‌తో భేటీ వెనుక వ్యూహమేంటి? దౌత్యవ్యూహమిదేనా?
Kcr
Follow us on

Akhilesh Yadav:  అసలేం జరుగుతోంది ? సడన్‌గా అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ సిటీకి రావడం, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అవడంతో మొదలైన ప్రశ్న ఇది. మొన్నటికి మొన్న బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన విపక్షాల భేటీ తర్వాత కేసీఆర్ పార్టీని ఆ కూటమిలోకి రానీయం అన్నారంతా. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని ఈజీగా చెప్పవచ్చు. ఆ తర్వాత తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… భారత రాష్ట్ర సమితిని బీజేపీ బీ టీమ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ని ఓడిస్తామని కూడా కుండబద్దలు కొట్టారు. కానీ రాహుల్ వచ్చి వెళ్ళిన మర్నాడే విపక్ష కూటమిలో యాక్టివ్‌గా వున్న సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, యుపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అనూహ్యంగా హైదరాబాద్‌లో ల్యాండయ్యారు. వచ్చీ రాాగానే ప్రగతి భవన్‌కు వెళ్ళి కేసీఆర్‌తో లంచ్ భేటీ అయ్యారు. కేసీఆర్‌తో భేటీ కంటే ముందే ఆయన ఓ హింటిచ్చారు. తమ లాగానే కేసీఆర్ బీజేేపీ మీద పోరాడుతున్నారని, ఆయనతో కలిసి మోదీని గద్దె దింపుతామని ఆయన అన్నారు. మరి పాట్నా భేటీ తర్వాత మీడియా మీట్‌లో అందరితోపాటు అఖిలేశ్ కూడా వున్నారు. బీఆర్ఎస్, వైసీపీలను పాట్నా భేటీకి ఎందుకు ఆహ్వానించలేదని అడిగితే ఆ రెండు పార్టీలను విశ్వసించలేమన్నారు. కాంగ్రెస్ స్టాండ్‌తోపాటే 17 పార్టీలు అన్న సంకేతమిచ్చారు. కాంగ్రెస్ నేతలైతే ప్రస్తుతానికి అదే స్టాండ్ మీదున్నారు. అందుక్కారణం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలేనన్నది ఏ మాత్రం రాజకీయ పరిఙ్ఞానం వున్నవారిని అడిగినా చెబుతారు. మరి అఖిలేశ్, కేసీఆర్ భేటీ దేనికి ?

పాట్నా భేటీలో యాక్టివ్‌గా వున్న మరాఠా యోధుడు, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఇపుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్రలో జరిగిన రాజకీయపరమైన మార్పులు ఆయన అనుమతితో జరిగాయా ? లేక ఆయన్ను పక్కన పెట్టి ఎన్సీపీ నేతలే చక్రం తిప్పారా అన్నది ఇదమిత్తంగా తేలనప్పటికి.. ఇపుడు విపక్షాల కూటమిలో శరద్ పవార్ రోల్ తాత్కాలికంగానైనా ముగిసినట్లే భావించాలి. జులై 17, 18 తేదీలలో బెంగళూరు వేదికగా విపక్షాల రెండో భేటీ జరగబోతోంది. మొదటి భేటీలో పాల్గొన్న పార్టీలలో రెండు పార్టీలు ఈ భేటీకి హాజరయ్యే అంశం ఇపుడు సందేహంలో పడింది. నిజానికి మొదటి భేటీలో ఢిల్లీ ఆర్డినెన్సుకు మద్దతు కూడగట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నించింది. మిగిలిన పార్టీలు మద్దతుకు ముందుకు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చలేదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో వున్న ఢిల్లీ, పంజాబ్‌లలో తమను దారుణంగా దెబ్బకొట్టిన అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ అగ్రనేతలు గుర్రుగా వుండడమే అందుకు కారణం. ఢిల్లీ ఆర్డినెన్సుపై కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వకపోవడంతో పాట్నా భేటీ అనంతరం జరిగిన మీడియా మీట్‌లో కేజ్రీవాల్ పాల్గొనకుండానే వెళ్ళిపోయారు. అనాటి నుంచి కేజ్రీవాల్ విపక్షాల కొత్త కూటమికి దూరంగానే వున్నారు. ఈక్రమంలో బెంగళూరు భేటీకి ఆమ్ ఆద్మీ పార్టీ గైర్హాజరయ్యే అవకాశాలే ఎక్కువ.

ఇక మహారాష్ట్రలో జులై 2 నాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీకి చెందిన మెజారిటీ వర్గం ఇపుడు ఎన్డీయే కూటమికి దగ్గరయ్యింది. ఏకంగా బీజేపీ, శివసేనతో కలిసి మహారాష్ట్రలో అధికార కూటమిలో కొనసాగుతోంది. ఇపుడు శరద్ పవార్ దగ్గర ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందరున్నారంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. తన సొంతింటినే కాపాడుకోలేని శరద్ పవార్ బెంగళూరు భేటీకి హాజరవడం సందేహమే. ఈ లెక్కన పాట్నా భేటీలో మొత్తం పదిహేడు పార్టీలుంటే.. బెంగళూరుకు వచ్చేసరికి అది 15కో లేక బీజేపీ బీహార్ ఆపరేషన్ కూడా పూర్తయితే 14కో పడిపోయే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర మాదిరిగానే బీహార్‌లో నితీశ్ పార్టీని నిట్టనిలువునా చీల్చేందుకు భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ప్రారంభించినట్లు కథనాలు వస్తున్నాయి. బీజేపీ వ్యూహం వర్కౌట్ అయితే, పదిహేను రోజుల్లో పరిస్థితి మారిపోవచ్చు. నితీశ్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు చీలిపోయి వేరు కుంపటి పెట్టుకుని బీజేపీ మద్దతుతో అక్కడ అధికారం చేపడితే నైతికంగా నితీశ్ కుమార్‌కు భారీ దెబ్బ తగలొచ్చు. అదే జరిగితే ఇప్పటి దాకా విపక్షాలను ఒక జట్టుగా చేరుస్తున్న నితీశ్ ఆ రోల్‌లో కొనసాగలేరు. బహుశా ఈ పరిణామాలను ఊహించినందువల్లనే విపక్షాల రెండో భేటీ నిర్వహణ బాధ్యతలను కాంగ్రెస్ అధినాయకత్వం చేపట్టింది.

ఇవి కూడా చదవండి

ఇలాంటి కీలకతరుణంలో అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌ని కల్వడం దేనికి ? ఇది లోతుగా ఆలోచిస్తే గానీ తేలని అంశం. ఓ వ్యూహం ప్రకారం చూస్తే కేసీఆర్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దాకా ఓ పంథాలోను, ఆ తర్వాత ఫలితాలను బట్టి మరో పంథాను ఎంచుకోవచ్చు. కేసీఆర్ తెలంగాణలో మూడోసారి కూడా సొంతంగా అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి దూరంగానే వుంటారు. సార్వత్రిక ఎన్నికల దాకా బీజేపీతో అంటీముట్టనట్లుంటారు. ఒకవేళ తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పోలరైజ్ అయి, కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా పడితే మాత్రం పరిస్థితి వేరుగా వుంటుంది. ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే మాత్రం కాంగ్రెస్, కేసీఆర్ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ఇదంతా ఊహాజనితంగా అనిపించినా రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చన్నది గుర్తు పెట్టుకోవాల్సిందే. బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్, కేసీఆర్ భావిస్తే మాత్రం తెలంగాణ ఎన్నికల తర్వాత రెండు పార్టీలు కలిసి పని చేయడం ఖాయం. బహుశా ఆ ముందస్తు వ్యూహంతోనే కాంగ్రెస్ దూతగా అఖిలేశ్ హైదరాబాద్ పర్యటనకు వచ్చి వుంటారన్నది రాజకీయ విశ్లేషకుల అంఛనా.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం