నా లవర్ కనిపించడం లేదంటూ పోలీసులకు కంప్లైంట్.. కట్‌చేస్తే బయటపడ్డ వీడి బండారం..

ప్రేమించిన యువతిని అతి కిరాతకంగా లోయలోకి తోసి చంపేశాడు.. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సార్, నా లవర్ కనిపించడం లేదు.. అంటూ హైడ్రామా మొదలుపెట్టాడు.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో వెలుగుచూసిన ఈ షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అతడు ఆడిన నాటకంలో పోలీసులు అసలు నిజం ఎలా బయటకు తీశారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నా లవర్ కనిపించడం లేదంటూ పోలీసులకు కంప్లైంట్.. కట్‌చేస్తే బయటపడ్డ వీడి బండారం..
Man Pushes Girlfriend Into Valley

Edited By:

Updated on: Oct 11, 2026 | 9:23 PM

ప్రేమించిన యువతిని కడతేర్చి, ఏమీ తెలియనట్లు పోలీసుల వద్దకే వెళ్లి నా ప్రియురాలు కనిపించడం లేదు అంటూ డ్రామాలాడిన ఓ కిరాతకుడి బండారం బట్టబయలైంది. తనకు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైన విషయం బయటపడుతుందనే భయంతో ప్రియురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లోయలోకి తోసి హత్య చేశాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. కొల్హాపూర్ జిల్లా భుదర్‌ఘడ్ తాలూకాకు చెందిన తరణుమ్ బషీర్ నాయక్ (23), శ్రీపాద దినకర్ వడర్ (25) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం సాఫీగానే సాగుతున్న సమయంలో.. శ్రీపాదకు కుటుంబ సభ్యులు వేరే యువతితో వివాహం నిశ్చయం చేశారు.

నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఘాతుకం

ఈ విషయం తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. తమ బంధానికి ముగింపు పలుకుదామంటూ శ్రీపాద ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అయితే వారి ప్రేమ వ్యవహారాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియజేస్తానని తరణుమ్ హెచ్చరించింది. దీంతో పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనన్న భయంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిందితుడు పథకం వేశాడు. పథకం ప్రకారం తరణుమ్‌ను ఓ నిర్మానుష్యమైన అటవీ ప్రాంతానికి శ్రీపాద తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య పెళ్లి, విడిపోవడం తదితర అంశాలపై తీవ్ర వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో శ్రీపాద ఆమెను పక్కనే ఉన్న లోతైన లోయలోకి తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన తరణుమ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ప్రియురాలు కనిపించడం లేదంటూ కట్టుకథలు

హత్య చేసిన అనంతరం నిందితుడు శ్రీపాద ఏమీ తెలియనట్లు నటిస్తూ భుదర్‌ఘడ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తరణుమ్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అతడు చెప్పిన వివరాల్లో పరస్పర విరుద్ధ ప్రకటనలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతడిపై నిఘా ఉంచి గట్టిగా విచారించగా అసలు నిజం బయటపడింది. తానే ఆమెను లోయలోకి తోసి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.

లోయ నుంచి మృతదేహం వెలికితీత

నిందితుడు హత్య చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పాటు అత్యంత లోతుగా ఉండటంతో రెస్క్యూ సిబ్బంది సహాయం తీసుకున్నారు. తీవ్ర శ్రమించి తరణుమ్ మృతదేహాన్ని లోయ నుంచి బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శ్రీపాదను పోలీసులు అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us