
కాశ్మీర్ లోయలోని పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. పర్యాటకుల తాకిడితో దెబ్బతింటున్న అటవీ ప్రాంతాలను రక్షించేందుకు దూద్‌పత్రి, యూస్‌మార్గ్ సహా నాలుగు ప్రధాన ప్రాంతాల్లో క్యాంపింగ్, ఆఫ్-రోడింగ్, బోన్‌ఫైర్లపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. పర్యాటకుల సందడితో కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న అటవీ ప్రాంతాలను ‘జీరో వేస్ట్ జోన్లుగా’ మార్చేందుకు అటవీ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దూద్‌పత్రి, యూస్‌మార్గ్, తోసామైదాన్, హాజిన్-బ్రెన్వార్ ప్రాంతాల్లో ఇకపై పర్యాటకులు ఇష్టానుసారంగా వ్యవహరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
పర్యావరణానికి హాని కలిగించే అనేక పనులపై అటవీ శాఖ కఠినమైన ఆంక్షలు విధించింది:
1. క్యాంపింగ్ & టెంట్లు: అటవీ ప్రాంతాల్లో టెంట్లు వేసుకోవడం లేదా క్యాంపింగ్ చేయడంపై నిషేధం.
2. ఆఫ్-రోడింగ్: అడవుల్లో వాహనాలను ఇష్టానుసారంగా నడపడం (Off-roading) పూర్తిగా నిషిద్ధం.
3. బోన్‌ఫైర్లు: అడవుల్లో మంటలు వేయడం లేదా బోన్‌ఫైర్లు ఏర్పాటు చేయడంపై ఆంక్షలు.
4. ప్లాస్టిక్ రహిత జోన్లు: ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో ‘యాంటీ-పాలిథీన్ చెక్ పోస్టులను’ ఏర్పాటు చేయనున్నారు. ప్లాస్టిక్ వాడకం, విక్రయాలు, నిల్వ చేయడం చట్టరీత్యా నేరం.
ఈ పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది:
ప్రజా చైతన్యం: పర్యాటకులకు వ్యర్థాల నిర్వహణ, పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాల (క్లాత్ బ్యాగులు) వాడకంపై అవగాహన కల్పిస్తారు.
వారపు పారిశుద్ధ్య డ్రైవ్: ప్రతి బుధవారం అటవీ శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు, వాలంటీర్లతో భారీ స్థాయిలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈకో-ఫ్రెండ్లీ డస్ట్‌బిన్లు: చెత్తను శాస్త్రీయంగా సేకరించేందుకు అవసరమైన చోట్ల డస్ట్‌బిన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిని కనీసం వారానికి రెండుసార్లు క్లియర్ చేస్తారు.
అటవీ శాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. “రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాల్లో అటవీ పర్యావరణ వ్యవస్థను దెబ్బతీసే ఏ చర్యను సహించేది లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తే జమ్మూ-కాశ్మీర్ నాన్-బయోడిగ్రేడబుల్ మెటీరియల్ యాక్ట్-2007, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్-2016 ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని అధికారులు స్పష్టం చేశారు.
పర్యాటకుల తాకిడి పెరగడం పర్యావరణానికి ఏ విధంగా ముప్పుగా మారుతుందో గుర్తించిన అటవీ శాఖ, ఈ నిర్ణయం ద్వారా పర్యాటకాన్ని సుస్థిరమైన (Sustainable Tourism) మార్గంలో తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు ఇకపై ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..