కేరళ, తమిళనాడు తీరాలకు ‘కల్లక్కడల్ ముప్పు పొంచి ఉందని కేంద్రం ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని సమాచారం. 11.30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో 0.5 మీ. నుంచి 1 మీటర్ల మేర అలల తాకిడి ఉంటుందని, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెచ్చరించింది.
‘ఐఎన్‌సీవోఐఎస్’ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కేరళ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ సంస్థ ‘కేఎస్‌డీఎంఏ’ అప్రమత్తమైంది. అధికారుల సూచన మేరకు తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించింది. తీర ప్రాంత వాసులు ఎట్టి పరిస్థితుల్లో చిన్న పడవలు, దేశవాళీ పడవలు వేసుకొని సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ముందుగానే పడవలను సురక్షిత ప్రదేశానికి చేర్చుకోవాలని ప్రకటించింది. ప్రస్తుతం జారీ చేసిన ప్రకటనను విరమించుకునే వరకు పర్యటకులు బీచ్‌లలో విహారానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాలని అధికారులకు ‘కేఎస్‌డీఎంఏ’ సూచించింది.
కల్లక్కడల్ అనేది సముద్రంలో అకస్మాత్తుగా సంభవించే మార్పు. అంటే సముద్రం ఓ దొంగలా దూసుకొస్తుందని అర్థం. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్ని సార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణమని ‘ఐఎన్‌సీవోఐఎస్’ సంస్థ వెల్లడించింది. ఎలాంటి సూచన, హెచ్చరిక లేకుండానే ఆ గాలులు వీస్తుంటాయని పేర్కొంది. అందుకే దీనిని స్థానికంగా ‘కల్లక్కడల్’ అని పిలుస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..