దేశంలోని ప్రధాన నగరమైన ముంబై అద్భుతమైన సంస్కృతి, వారసత్వం, చరిత్ర నిండిన నగరం. నేటి దేశ ఆర్ధిక రాజధాని ముంబై నాడు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించింది. నగర వీధుల్లో ల్యాండ్‌మార్క్‌లు ధైర్యం, ప్రతిఘటన, స్వేచ్ఛ కోసం ఏళ్ల తరబడి పోరాడిన స్వాతంత్ర్య యోధుల కథలతో ప్రతిధ్వనిస్తునే ఉన్నాయి. దేశంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడానికి ఆసేతు హిమాచలం రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన ముంబైలోని ఐదు ప్రసిద్ధ ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
బాబు గెను చౌక్, కల్బాదేవి
కల్బాదేవిలోని బాబు గెను చౌక్ స్వదేశీ ఉద్యమంతో లోతుగా పెనవేసుకున్న చారిత్రక మైలురాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ వాణిజ్య ప్రాంతం జాతీయవాద కార్యకలాపాలకు హాట్‌స్పాట్‌గా మారింది. ఈ ప్రాంతంలోనే స్వాతంత్ర్యం కోసం మన నాయకులు బ్రిటీష్ వస్తువులను బహిష్కరించమంటూ, భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను ప్రోత్సహించమని ర్యాలీ చేసారు. ఈ స్వదేశీ ఉద్యమం చినికి చినికి గాలి వానగా మారి చివరికి ఆగష్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునే విధంగా పోరాటానికి దారితీసింది. బ్రిటిష్ ఆర్థిక నియంత్రణను అణగదొక్కడం, భారతీయ పరిశ్రమను పునరుజ్జీవింపజేయడం లక్ష్యంగా స్వదేశీ ఉద్యమం స్ఫూర్తి. విదేశీ వస్తు బహిష్కరణ కోసం బాబు గెనూ చౌక్‌లో జరిగిన సమావేశాలు ప్రభావం బహిరంగ ప్రదర్శనలలో స్పష్టంగా కనిపించింది.
మణి భవన్
ముంబై స్వాతంత్ర్య పోరాటంలో లాబర్నమ్ రోడ్‌లోని మణి భవన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నివాసం ఒకప్పుడు మహాత్మా గాంధీ ముంబై పర్యటనల సమయంలో నివాసంగా ఉండేది. మణి భవన్‌లో గాంధీ తన ప్రసిద్ధ రచనలను రాశారు. సహాయ నిరాకరణ ఉద్యమం.. దండి మార్చ్‌తో సహా కీలకమైన ఉద్యమాలకు వ్యూహరచన ఇక్కడ నుంచే చేశారు. ఈ భవనం గాంధీ నాయకత్వానికి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడానికి చేసిన ప్రయత్నాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది నివాసంగా, విప్లవాత్మక ప్రధాన కార్యాలయంగా పనిచేసింది.
ఆగస్ట్ క్రాంతి మైదాన్
ఆగస్ట్ క్రాంతి మైదాన్ గతంలో గోవాలియా ట్యాంక్ అని పిలిచేవారు. క్విట్ ఇండియా ఉద్యమంలో దీని పాత్రతో ప్రసిద్ధి చెందింది. ఆగష్టు 8, 1942న ఈ చారిత్రాత్మక మైదానం ఒక మహత్తరమైన ర్యాలీని చూసింది. ఇక్కడ మహాత్మా గాంధీ వంటి నాయకులు భారతీయులలో ప్రతిఘటన స్ఫూర్తిని రగిలించే ఉత్తేజకరమైన ప్రసంగాలు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో నిర్ణయాత్మక ఘట్టాన్ని సూచిస్తూ “క్విట్ ఇండియా” అనే నినాదం ఇక్కడ ప్రముఖంగా వినిపించింది. ఈ మైదానం భారతీయ ఐక్యత, బ్రిటిష్ వలస పాలనను అంతం చేయాలనే సామూహిక సంకల్పానికి చిహ్నంగా మారింది.
గిర్గావ్ చౌపటీ
గిర్గావ్ చౌపట్టి దక్షిణ ముంబైలో ఉన్న ఐకానిక్ బీచ్. అనేక ముఖ్యమైన బహిరంగ సభలు, కార్యక్రమాలకు వేదికగా ఉంది. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల మద్దతును పెంచడానికి ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశాలు జరిగాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమ నాయకుడు బాలగంగాధర్ తిలక్ అంత్యక్రియల ఊరేగింపును కూడా బీచ్ చూసింది. ఒక గొప్ప జాతీయవాద నాయకుడిని కోల్పోవడాన్ని, స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న పోరాటానికి ప్రతీకగా నిలిచిన అతని మరణానికి ఈ బీచ్ ఒక ప్రతిబింబంగా నిలిచింది.
ముంబై డాక్
ముంబై డాక్‌యార్డ్.. దీనిని ఇప్పుడు ముంబై పోర్ట్ ట్రస్ట్ అని పిలుస్తున్నారు. 1946 నావికా తిరుగుబాటు సమయంలో కీలక పాత్ర పోషించింది. ఈ డాక్‌యార్డ్ బ్రిటీష్ వలస అధికారులకు వ్యతిరేకంగా భారతీయ నావికులు చేసిన పెద్ద తిరుగుబాటుకు కేంద్రంగా ఉంది. ఈ తిరుగుబాటును రాయల్ ఇండియన్ నేవీ రివోల్ట్ అని కూడా పిలుస్తారు. ఇది భారత సాయుధ దళాల శ్రేణులలో విస్తృతమైన అసంతృప్తిని హైలైట్ చేసిన ఒక ముఖ్యమైన ధిక్కార చర్య. ముంబై డాక్‌యార్డ్‌లో జరిగిన ఈ సంఘటనలు భారతదేశానికి స్వాతంత్ర్యం దిశగా ముందుకు సాగడంలో కీలక పాత్ర పోషించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..