MP Governor sets deadline for floor test: మధ్యప్రదేశ్ రాజకీయం ఒక్కసారిగా మళ్ళీ వేడెక్కింది. అందరి అంఛనాలకు తల్లకిందులు చేస్తూ బలపరీక్షను వాయిదా వేసిన స్పీకర్.. మధ్య ప్రదేశ్ రాజకీయం ఇప్పుడప్పుడే క్లైమాక్స్‌కు చేరదు అన్న మెసేజ్ ఇవ్వగా… రంగంలోకి దిగిన గవర్నర్ తనదైన శైలిలో మధ్య భారత రాజకీయాలను వేడెక్కించారు. బలపరీక్షను వాయిదా వేసేందుకు ఛాన్స్ లేదన్న సంకేతం మిస్తూ.. వెంటనే బలపరీక్షకు రెడీ కావాలని, లేకపోతే.. ఓటమిని అంగీకరించాలని హూంకరించారు.
బీజేపీ ఆడుతున్న రాజకీయ చదరంగంతో మధ్యప్రదేశ్‌లోని కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి తలెత్తింది. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు షిఫ్టు చేసి, కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాధిత్య సింధియాకు కమలం తీర్థం ఇప్పించి.. అక్కున చేర్చుకున్న బీజేపీ.. ఎంపీలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైంది. అందుకు అనుగుణంగా బీజేఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఎంపిక చేసింది. ఇక అధికారం చేతులు మారడమే ఖాయమనుకుంటున్న తరుణంలో బీజేపీ ఆశలపై స్పీకర్ ప్రజాపతి నీళ్ళు చల్లారు. సోమవారం (మార్చి 16న) కేవలం గవర్నర్ ప్రసంగాన్ని ముగించేసి.. బలపరీక్షను వాయిదా వేశారు. మార్చి 26న బలపరీక్షను నిర్వహించాలని, ఆలోగా బీజేపీ చేతుల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తిరిగి రప్పించుకోవచ్చని ముఖ్యమంత్రి కమల్ నాథ్ వ్యూహరచన చేశారు.
అయితే.. సోమవారం సాయంత్రానికి గవర్నర్ లాల్జీ టండన్ రంగంలోకి దిగడంతో మధ్య ప్రదేశ్ రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. మంగళవారమే బలపరీక్షకు సిద్దం కావాలని ముఖ్యమంత్రిని ఆదేశించారు గవర్నర్. మరో అడుగు ముందుకేసి.. మంగళవారం (మార్చి17) బలపరీక్షకు సిద్దం కాకపోతే.. ఓటమిని అంగీకరించినట్లుగానే భావించాల్సి వస్తుందని కూడా ఆయన కమల్ నాథ్‌కు తేల్చి చెప్పారు. అంటే.. మధ్య ప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటులో ఇక ఏ మాత్రం జాప్యం చేయవద్దని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే గవర్నర్‌కు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా.. అదేశాలిచ్చినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే గవర్నర్ తక్షణం బలపరీక్షకు సిద్దం కావాలని ముఖ్యమంత్రిని ఆదేశించారు.
గవర్నర్ ఆదేశాలతో ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఉలిక్కి పడ్డారు. మంగళవారం బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్‌ను సీఎం కోరతారా లేదా అన్నదిపుడు ప్రశ్నగా మారింది. కర్నాటకలో బలపరీక్ష నిర్వహణను పదిహేను రోజుల పాటు సాగదీసిన.. కాంగ్రెస్ పార్టీ స్పీకర్… మధ్యప్రదేశ్‌లోను అదే వ్యూహాన్ని అమలు చేస్తే.. మధ్యప్రదేశ్‌లో గవర్నర్, సీఎం ఆధిపత్యపోరుతో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడక తప్పదు.