G-20 Summit India: దేశంలో క్రికెట్ అభిమానులకు టీ-20 ఫీవర్ గురించి తెలుసు. వివిధ దేశాల ఆటగాళ్లు దేశంలోని వివిధ నగరాలు లేదా రాష్ట్రాల తరఫున ఆడుతూ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంటారు. కానీ ఇప్పుడు దేశంలో జీ-20 ఫీవర్ నడుస్తోంది. అవును.. జీ-20 శిఖరాగ్ర సదస్సుకు భారతదేశం వేదిక కావడమే ఇందుక్కారణం. పైగా ఈ ఏడాది భారతదేశమే జీ-20 అధ్యక్ష బాధ్యతల్లో ఉండడం మరో విశేషం. ఇంతకీ జీ-20 అంటే ఏంటి?
జీ-20 అంటే ప్రపంచంలోని అగ్రరాజ్యాల సమాహారం. గ్రూప్-20 కి సంక్షిప్త నామమే జీ-20. ప్రపంచీకరణ అనంతరం 1999లో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో 19 అగ్ర రాజ్యాలు, యురోపియన్ యూనియన్ కలిసి పరస్పరం సహకరించుకోవడం కోసం ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేశాయి. అగ్రరాజ్యాలుగా పేరొందిన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలతో పాటు యురోపియన్ యూనియన్‌లోని సభ్య దేశాలు ఇందులో భాగంగా ఉన్నాయి. అంటే ప్రపంచ జీడీపీలో 85%, జనాభాలో దాదాపు 70 శాతం కలిగిన దేశాల సమాహారమే ఈ జీ-20. ప్రపంచంలోనే జరిగే వ్యాపార, వాణిజ్య కార్యాకలాపాల్లో 75% ఈ దేశాల నుంచే జరుగుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దీన్ని మినీ ఐక్యరాజ్యసమితిగా వ్యవహరించవచ్చు. అయితే జీ-20లో పరస్పర ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుని వాటిని ఆయా దేశాలు అమలు చేస్తుంటాయి. కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన, ఆంక్షలు లేవు. అమలుచేయకపోతే శిక్షలు కూడా లేవు.
తొలినాళ్లలో ఆర్థికాంశాల్లో పరస్పర సహకారం కోసం ఈ జీ-20 ఏర్పడినప్పటికీ ఆ తర్వాతి కాలంలో తన ఎజెండాను విస్తరించుకుంది. సుస్థిరాభివృద్ధి, వాణిజ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పులు, అవినీతి నిరోధక చర్యలు వంటి అంశాల్లో కూడా పరస్పరం సహకరించుకోవాలని, అత్యుత్తమ విధానాలను ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. చూడ్డానికి మినీ ఐక్యరాజ్యసమితిలా ఉన్నప్పటికీ ఈ జీ-20 గ్రూపునకు శాశ్వత సచివాలయం, కార్యాలయం లేవు. ఎందుకంటే ప్రతియేటా జీ-20 అధ్యక్ష బాధ్యత సభ్య దేశాల మధ్య మారుతూ ఉంటుంది. ఆ ఏడాది ఏ దేశం అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఆ దేశంలోనే తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసి సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తూ ఉంటాయి. గత ఏడాది ఇండోనేషియా (2022) సారధ్యం వహించగా.. 2021లో ఇటలీ, 2020లో సౌదీ అరేబియా అధ్యక్ష బాధ్యతల్ని నిర్వహించాయి. నవంబర్ 30తో భారత అధ్యక్ష బాధ్యతల గడువు తీరిపోతుంది. డిసెంబర్ 1 నుంచి బ్రెజిల్ దేశం అధ్యక్ష బాధ్యతలు చేపడుతుంది. భారత సారథ్యంలో ఎజెండాలోని అంశాలపై దేశంలోని 60 నగరాల్లో సుమారు 200 సమావేశాలు జరిగాయి.
భారత్‌లో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సమావేశాల కారణంగా న్యూఢిల్లీ నగరం జీ-20 రాజధానిగా మారిపోయింది. అంటే ఒక రకంగా ప్రపంచ రాజధానిగా మారిందని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ సహా అగ్రరాజ్యాల అధినేతలు రెండ్రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు. అయితే సభ్య దేశాల్లో రష్యా, చైనా దేశాధినేతలు మాత్రం హాజరుకావడం లేదు. చైనా దేశాధినేత షీ జిన్ పింగ్ తనకు బదులుగా చైనా ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతారని ఆ దేశం ప్రకటించింది. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ హాజరుకాకపోవడం వెనుక అనేక కారణాలున్నాయి. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన తర్వాత పుతిన్‌ను వార్ క్రిమినల్‌గా డిక్లేర్ చేస్తూ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. నాటో సభ్య దేశాలు పుతిన్ అంటే మండిపడుతున్నాయి. యుద్ధం కారణంగా రష్యాలో అంతర్గత సమస్యలు కూడా పెచ్చుమీరాయి. ఈ పరిస్థితుల్లో ఆయనకు బదులుగా రష్యా విదేశాంగ మంత్రి లాబ్రోస్‌ను పంపుతున్నట్టు ఆ దేశం ప్రకటించింది.
గత ఏడాది డిసెంబర్ 1న భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టినప్పటి నుంచి తనదైన ప్రత్యేక ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రతిష్ట ఇనుమడింపజేసేలా కార్యక్రమాలను రూపొందించింది. ‘అతిథి దేవో భవ’ అన్న భారతీయ సూక్తిని అడుగడుగునా అమలు చేసేలా చర్యలు చేపట్టింది. దేశంలోని నైపుణ్యాలను, మౌలిక వసతులను ప్రపంచానికి చాటి చెబుతూ అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ ఏరకంగా తీసిపోదన్న అభిప్రాయం కలిగే అతిథులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో సదస్సులను ఏర్పాటు చేయడం ద్వారా జీ-20 దేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు భారత దేశ చారిత్రక, వారసత్వ వైభవం తెలియజేసే ప్రయత్నం చేసింది. భారత సారథ్యంలో ఆర్థికాంశాలపై నేరుగా ఆయా దేశాల ఆర్థిక మంత్రులు చర్చలు జరిపేలా ఒక ట్రాక్, అలాగే ఇతర అంశాలపై వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేస్తూ మరో ట్రాక్ ఏర్పాటు చేసింది. వర్కింగ్ గ్రూపులు ఇప్పటికే విస్తృతంగా సమావేశాలు నిర్వహించాయి. ఇప్పుడు చిట్టచివరగా దేశాధినేతలు పాల్గొనే శిఖరాగ్ర సదస్సు కోసం దేశ రాజధాని న్యూఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సకల ఏర్పాట్లతో స్వాగతం పలుకుతోంది.
అతిథులను భారత సంస్కృతి, సంప్రదాయాలతో పరిచయం చేయడంతో పాటు నగదురహిత లావాదేవీల్లో విప్లవం సృష్టించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) గురించి వివిధ దేశాల ప్రతినిధులకు లైవ్ డెమో ఇవ్వనున్నారు. ఈ మధ్యనే ఢిల్లీలోని ఓ కూరగాయల మార్కెట్లో జర్మనీ రాయబారి తన మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు జరిపి ఆశ్చర్యపోయిన వీడియో విస్తృతంగా వైరల్ అయింది. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇంకా అమల్లో లేని UPI గురించి భారత ప్రభుత్వం ఘనంగా చాటుకునే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థలో చెల్లింపుల్లో వేగం, కచ్చితత్వంతో పాటు పారదర్శకతకు పూర్తిస్థాయి ఆస్కారం కల్గిస్తున్న ఈ వ్యవస్థపై ప్రపంచ దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సాధించిన ప్రగతిని ప్రపంచానిటి చాటి చెప్పేందుకు ఇది సరైన వేదిక, సరైన సమయం అని భారత ప్రభుత్వం భావిస్తోంది.
ఆహారం, వేషభాషలు, మతాలు, ధర్మాలు, భాషలు.. ఇలా ఎన్నో వైవిధ్యాల సమాహారం భారతదేశం. ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా ప్రతి స్టేజిలోనూ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. విదేశీ అతిథులకు భారత్‌లో ప్రఖ్యాతిగాంచిన వీధి వంటకాలు (స్ట్రీట్ ఫుడ్స్)ను రుచిచూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ క్రమంలో గోల్ గప్పే (పానీ పూరి) వంటి ఆహార-పానీయాలను వివిధ దేశాల అతిథులు రుచిచూసే అవకాశం ఉంది. అలాగే ఈ ఏడాదిని మిల్లెట్ ఇయర్‌గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న నేపథ్యంలో తృణధాన్యాలు, చిరుధాన్యాలతో తయారు చేసిన రుచికరమైన వంటకాలు, వాటి పోషక విలువలను తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తోంది. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పేరొందిన పాకశాస్త్ర నిపుణుల(షెఫ్)ను పిలిపించి వారితో వంటకాలు సిద్ధం చేస్తున్నట్టు స్పెషల్ సెక్రటరీ ముక్తేశ్ కే. పరదేశీ వెల్లడించారు.
అతిథులకు స్వాగతం పలకడం నుంచి వసతి, భోజన సదుపాయాల్లో ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఏ కాస్త తేడా వచ్చినా దేశ ప్రతిష్టకే మచ్చ వస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తోంది. అతిథులను మెప్పించేందుకు హోటళ్లు, సదస్సు జరిగే వేదికలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది.
ప్రపంచదేశాధి నేతలు జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం భారతదేశ రాజధాని న్యూఢిల్లీకి వస్తున్న నేపథ్యంలో యావత్ నగరం అంతటా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరీ ముఖ్యంగా దేశాధినేతలు సంచరించే సెంట్రల్ ఢిల్లీ ప్రాంతాన్ని అత్యంత హై-సెక్యూరిటీ జోన్‌గా మార్చేశారు. గగనతలాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చేశారు. భారత వాయుసేన, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ ఢిల్లీ గగనతలంపై ఏ అనుమానాస్పద వస్తువు కనిపించినా సరే కూల్చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాల కోసం 1.30 లక్షల మంది భద్రతా సిబ్బంది, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్‌ను ఉపోయోగించనున్నారు. దేశాధినేతలను తరలించడం కోసం రూ. 18 కోట్లతో 20 బుల్లెట్ ప్రూఫ్ కార్లను ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. నగరంలో అడుగడుగునా కెమెరాలు ఉన్నాయి. వాటిలో చాలా కెమేరాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కనెక్ట్ చేశారు. ఎవరైనా వేగంగా పరిగెత్తినా, గోడలు ఎక్కి దూకినా గుర్తించి అప్రమత్తం చేసేలా సాఫ్ట్‌వేర్ డిజైన్ చేసినట్టు తెలిసింది.
ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలకు చెందిన 45 వేల మంది భద్రతా విధుల్లో సేవలు అందించనున్నారు. వారిలో కొందరు కమెండో ఆపరేషన్లలో సుశిక్షితులైన జవాన్లు కూడా ఉన్నారు. ఆధునిక ఆయుధాల వినియోగంపై శిక్షణ పొందిన మహిళా కమెండోలను కూడా రంగంలోకి దించారు. ఏదైనా విపత్తు సంభవిస్తే వెంటనే రంగంలోకి దిగేందుకు 400 మంది ఫైర్ సిబ్బందితో పాటు 450 క్విక్ రియాక్షన్ టీమ్స్‌ను సిద్ధం చేసింది. ఎక్కడికక్కడ అంబులెన్సులు, ఫైరింజన్లను కూడా మోహరించింది.
జీ-20 సభ్య దేశాల అధినేతలతో పాటు ఈ శిఖరాగ్ర సదస్సుకు ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ప్రపంచ ఆరోగ్య సంస్థల అధినేతలు కూడా హాజరవుతున్నారు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌కు ఐటీసీ మౌర్య హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. జో బైడెన్ భద్రత కోసం ఆ దేశానికి సీఐఏ, యూకే నుంచి ఎంఐ-6, చైనా నుంచి ఎంఎస్ఎస్ వంటి నిఘా సంస్థలు ఇప్పటికే ఢిల్లీలో దిగాయి. తమ తమ దేశాధినేతల భద్రతపై చర్యలు మొదలుపెట్టాయి. నగరంలోని ప్రముఖ స్టార్ హోటళ్లన్నీ ప్రభుత్వ యంత్రాంగం ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఆయా హోటళ్లలో దేశాధినేతలు, విదేశీ ప్రతినిధులకు మాత్రమే వసతి కల్పించేలా చర్యలు చేపట్టింది.
మరోవైపు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు రాజధాని నగరంలో తీవ్ర ఆంక్షలు, నిషేధాజ్ఞలను పోలీసులు అమల్లోకి తీసుకొచ్చారు. అన్ని దుకాణాలు, కార్యాలయాలు, బ్యాంకులు మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆ మూడు రోజుల్లో ఢిల్లీకి చేరుకోవాల్సిన 100కు పైగా రైళ్లను రద్దు చేసింది. సెంట్రల్ ఢిల్లీని పూర్తిగా శత్రుదుర్భేద్యంగా మార్చేసింది. కేవలం సెంట్రల్ ఢిల్లీలో నివసించే ప్రజలు మినహా మరెవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించకుండా ఆంక్షలు విధించింది. భద్రతా విధుల్లో భాగంగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్స్‌తో మాక్ డ్రిల్స్ కూడా చేస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు దేశ రాజధానిలో అప్రకటిత కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్ అమలవుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..