తీవ్ర వాతావరణ పరిస్థితులు.. వైపరీత్యాలు.. భారత్‌లో ఇక నిత్యకృత్యమేనా?

| Edited By: Srikar T

May 15, 2024 | 12:19 PM

భూగోళంపై నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ కారణంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల గురించి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టే వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులు తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్నాయి. వేసవిలో గాలి దుమారాలు సహజం.

తీవ్ర వాతావరణ పరిస్థితులు.. వైపరీత్యాలు.. భారత్‌లో ఇక నిత్యకృత్యమేనా?
Weather In India
Follow us on

భూగోళంపై నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ కారణంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల గురించి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టే వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులు తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్నాయి. వేసవిలో గాలి దుమారాలు సహజం. కానీ వాటి తీవ్రత ఊహించని రీతిలో పెరిగి మహానగరాలను వణికిస్తున్నాయి. మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. గాలి దుమారాలు, ధూళి తుఫాన్లు, వర్షాల తీవ్రత నానాటికీ పెరగడం ఒకెత్తయితే.. ఇలాంటి విపత్తుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ఈ మధ్య కొద్ది రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న కొన్ని ఘటనలను పరిశీలిస్తే..

మే 13: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంపై ప్రచండ వేగంతో కూడిన గాలులతో ధూళి తుఫాను విరుచుపడింది. ఈ ధాటికి ఘట్కోపర్ ప్రాంతంలో ఓ భారీ హోర్డింగ్ నిట్టనిలువుగా పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌పై కుప్పకూలింది. దాని కింద నలిగి 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 74 మంది తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదే రోజు గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్, గాంధీనగర్ సహా పలు ప్రాంతాల్లో ధూళి తుఫాను బీభత్సం సృష్టించింది. ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం విరుచుకుపడింది. రహదారులపై వాహనాల రాకపోకలను స్తంభింపజేసింది.

ఇవి కూడా చదవండి

మే 10: దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని ధూళి తుఫాను అతలాకుతలం చేసింది. ఈ గాలి దుమారంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 23 మంది గాయాల పాలయ్యారు.

ఏప్రిల్ 13: భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్టే రాజస్థాన్‌పై అనేక ధూళి తుఫాన్లు విరుచుకుపడ్డాయి. తీవ్రమైన వేగంతో కూడిన గాలుల ధాటికి కచ్చా గృహాలు సహా అనేక నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.

భూతాపమే కారణం..

అతి భారీ వర్షాలు, తీవ్రమైన వేడి గాలులుతో పాటు తరచుగా సంభవిస్తున్న అతి తీవ్ర ధూళి తుఫాన్లు, గాలి దుమారాలకు భూతాపమే కారణమని పాఠశాల విద్యార్థిని అడిగినా చెబుతాడు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ (IITM) అధ్యయనం ప్రకారం 1950 నుంచి నమోదైన ఘటనలను పరిశీలిస్తే… వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న వైపరీత్యాల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని తేలింది. ఈ సమాచారాన్ని ‘నేచర్ కమ్యూనికేషన్స్’ పేరుతో నిర్వహిస్తున్న సైన్స్ మ్యాగజీన్లో ప్రచురించింది. ఇలాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, విపత్తుల కారణంగా అనూహ్య స్థాయి వరదలు సంభవిస్తూ ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలు కలుగజేస్తున్నాయని పేర్కొంది. భారత్‌లో ఎక్కువగా ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లో ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, ఝార్ఖండ్, అస్సాం, మేఘాలతో పాటు పశ్చిమ కనుమలకు ఆనుకున్న గోవా, కర్ణాటక కోస్తా ప్రాంతం, ఉత్తర కర్ణాటకలో ఈ తరహా విపత్తులకు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ ఎన్విరాన్‌మెంట్, సస్టెయినబులిటీ అండ్ టెక్నాలజీ సంస్థ వ్యవస్థాపక సీఈవో చంద్ర భూషణ్ ఇసుక తుఫాన్లు పెరగడానికి కారణం భూతాపమే అని చెబుతున్నారు. భూమ్మీద ధూళిని ప్రభావితం చేసేవాటిలో గాలి వేగం, భూ ఉపరితలంపై తేమ, ఉష్ణోగ్రత, నీటి వనరులు వంటివి ఉన్నాయి. భూతాపం పెరిగినప్పుడు సహజంగానే భూ ఉపరితలంపై తేమ తగ్గి, పొడిబారిపోతుంది. దాని మీదుగా వీచే గాలుల వేగం పెరిగితే, ఆ ధూళి మొత్తం వాతావరణంలోకి చేరుతుంది. ఇలాంటి పరిస్థితులు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా పశ్చిమ మధ్య ప్రాంతాలతో పాటు మధ్యఆసియా దేశాలు, సహారా ఎడారి ప్రాంతంలో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదైన సందర్భాల్లో ఇలాంటి ఘటనలు కూడా పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఉష్ణోగ్రత స్థాయి పెరగడంతో హీట్ వేవ్ (వేడి గాలులు), ఇసుక తుఫాన్లు పెరుగుతున్నాయి.

టీచర్స్ ఎగెనెస్ట్ ది క్లైమేట్ క్రైసిస్ సభ్యుడు, రచయిత నాగరాజ్ ఆద్వే ఈ పరిణామాలను విశ్లేషిస్తూ.. వాతావరణ మార్పులకు, వైపరీత్యాలకు మధ్య సంక్లిష్ట సంబంధం ఉందన్నారు. సహజంగా వేడి వాతావరణం గాలుల వేగాన్ని పెంచుతుందని, అవి క్రమంగా ధూళి తుఫాన్లుగా మారతాయని అంటున్నారు. అడవుల నరికివేత, పచ్చదనాన్ని మాయం చేయడం వంటి మానవ తప్పిదాలు వీటికి మరింత దోహదం చేస్తున్నాయని, విపత్తుల తీవ్రతను కూడా పెంచుతున్నాయని వెల్లడించారు.

భూతాపం ఎందుకు పెరుగుతోంది.?

భూతాపాన్ని పెరగడానికి కారణాల్లో ముఖ్యమైనది భూమ్మీద గ్రీన్ హౌజ్ వాయువుల స్థాయి పెరగడమే. కార్బన్ డై ఆక్సైజ్ సహా మరికొన్ని వాయువులను గ్రీన్ హౌజ్ వాయువులుగా పేర్కొంటారు. భూగోళంపై ఇవి ఒక మోతాదులో ఉండకపోతే ప్రాణికోటి బ్రతకడం కూడా కష్టమే. సూర్య కాంతి లేని సమయంలో (రాత్రి వేళల్లో) భూమి అత్యంత శీతల పరిస్థితిని ఎదుర్కోకుండా ఈ గ్రీన్ హౌజ్ వాయువులు అడ్డుకుంటాయి. ఫలితంగా రాత్రివేళల్లో జీవరాశి మనుగడ సాగించగల్గుతోంది. అయితే వీటి మోతాదు వాతావరణంలో పెరిగే కొద్ది అనర్థాలు, వైపరీత్యాలే. కర్బన ఉద్గారాలు పెరగడంలో శిలాజ ఇంధనాల (పెట్రోలియం ఉత్పత్తులు)తో నడిచే వాహనాలు, నేల బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు వెదజల్లే వాయు కాలుష్యం వంటివి ప్రధానమైనవి. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం ప్రణాళిక, లక్ష్యం నిర్దేశించుకుంది. ఆ ప్రకారం రానున్న రోజుల్లో దేశంలో అపారంగా లభ్యమయ్యే సూర్య కాంతి ఆధారంగా సోలార్ ఎనర్జీని పెంపొందించాలని, అలాగే ఏమాత్రం కాలుష్యాన్ని వెదజల్లని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. అయితే ఇదంతా పూర్తిస్థాయిలో ఆచరణలోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ఈలోగా ప్రకృతికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. గ్రీన్ హౌజ్ వాయువులు సముద్ర జలాల ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. ఫలితంగా సముద్రమట్టం పెరుగుతోంది. సముద్ర జల ప్రవాహాలు (కరెంట్స్)లో మార్పులు చోటుచేసుకుని భీకర తుఫాన్లు, హరికేన్లు ఏర్పడుతున్నాయి.

విపత్తులను ముందే గుర్తించగలమా?

ప్రకృతికి ఎదురొడ్డి నిలబడడం భూమ్మీద మనిషికే కాదు ఏ జీవరాశికి కూడా సాధ్యం కాదు. కానీ ప్రకృతి వైపరీత్యాన్ని ముందే పసిగట్టగల్గితే.. దాని బారిన పడి ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిశోధన సంస్థలు వాతావరణంలో మార్పులను పసిగట్టి తగిన హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. అయితే ప్రకృతిలో సంభవించే అన్ని రకాల వైపరీత్యాలను, వాటి తీవ్రతను ముందుగానే అంచనా వేయడం అన్ని వేళలా సాధ్యం కాదు. ఎందుకంటే వాతావరణం అన్నదే అత్యంత సంక్లిష్టమైన అంశం. సుదీర్ఘ అనుభవం, లోతైన అవగాహన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భారత వాతావరణ శాఖ (IMD) ఈ మధ్య కాలంలో చాలా అంశాల్లో ముందుగానే హెచ్చరిస్తోంది. ముఖ్యంగా హీట్ వేవ్ (వేడి గాలులు), తుఫాన్లు, వాటి తీవ్రత విషయంలో వాతావరణ శాఖ అంచనాలు దాదాపుగా నిజమవుతున్నాయి. ఆ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పుడు ప్రాణనష్టాన్ని నివారించగల్గుతున్నాం. అయితే హీట్ వేవ్, తుఫాన్లను అంచనా వేయగల్గినంతగా.. ప్రకృతిలో సంభవించే అన్ని వైపరీత్యాలను పసిగట్టడం, లేదా వాటి తీవ్రతను అంచనా వేయడం సాధ్యం కాదు.

ఈ వైపరీత్యాలను అడ్డుకోవాలంటే తక్షణం భూతాపం పెరగకుండా చర్యలు చేపట్టడమే ఏకైక మార్గమని ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిశోధకులు, నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతమైన విధానాలను అమలు చేయాలని, తద్వారా గ్రీన్ హౌజ్ వాయువుల స్థాయిని తగిన మోతాదులో ఉంచగల్గితే సమస్య పరిష్కారం అవుతుందని సూచిస్తున్నారు. మరోవైపు విపత్తులను ఎదుర్కొనేందుకు తగిన మెకానిజం, విపత్తు సహాయక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పెరిగిన భూతాపాన్ని తగ్గించలేము అన్న అపోహలు కూడా సరికాదని, భూమ్మీద మానవ సమూహం మొత్తం సమష్టిగా కాలుష్య ఉద్గారాలను తగ్గిస్తే అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చని వెల్లడిస్తున్నారు. భూతాపం పెరుగుదల శాతం 0.18 డిగ్రీల నుంచి 0.25 డిగ్రీలకు పెరిగిందని, అత్యవసరంగా కఠిన చర్యలు చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరవేగంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని నిలిపివేసి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించాలని, అదొక్కటే ప్రస్తుతం మానవ సమాజం చేతిలో ఉన్న ఏకైక పరిష్కార మార్గమని విశ్లేషిస్తున్నారు. అప్పటి వరకు ప్రకృతిలో చోటుచేసుకునే తీవ్రమైన వైపరీత్యాలు, విపత్తులను ఎదుర్కోవాల్సిందేనని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..