ECI Press Conference: కేంద్ర ఎన్నికల సంఘం చెప్పే ఈ 10 విషయాలను గుర్తు పెట్టుకోండి..!

|

Mar 16, 2024 | 7:10 PM

Lok Sabha Election 2024 Schedule: ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో నిర్వహించడం జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికల పూర్తి షెడ్యూల్‌ను కమిషన్‌ విడుదల చేసింది. బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాలకు మొత్తం 7 దశల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

ECI Press Conference: కేంద్ర ఎన్నికల సంఘం చెప్పే ఈ 10 విషయాలను గుర్తు పెట్టుకోండి..!
Eci Rajeev Kumar
Follow us on

మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికలపై ప్రపంచం ఒక కన్ను వేసి ఉంచుతుందని అన్నారు. నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వ్యవస్థను మెరుగుపరిచేందుకు వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామని చెప్పారు. ఈసారి ధనబలం, అంగబలం లేని ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం రెండేళ్లుగా సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఈసారి ఎన్నికల సందర్భంగా చాలా కఠినంగా ఉంటామన్నారు. కొంతమంది వ్యక్తుల వల్ల మొత్తం ఎన్నికల వ్యవస్థ చెడిపోకూడదని మేము కోరుకుంటున్నామన్నారు రాజీవ్ కుమార్. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం 10 మార్గదర్శకాలను విడుదల చేసింది.

1. ద్వేషపూరిత ప్రసంగాలకు చోటు లేదు

ఎన్నికల సంధర్బంగా ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే మార్గదర్శకాలను ఇచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ద్వేషపూరిత ప్రసంగాలకు తావు లేదన్నారు. నాయకులు, కార్యకర్తలు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

2. మనీ పవర్‌పై కఠిన చర్యలు

ఈసారి ధనబలం విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. దీనిపై దర్యాప్తు సంస్థలను సంప్రదించామన్నారు. ఒక నాయకుడు కానీ, అతని కార్యకర్తలు, అనుచరులు గానీ డబ్బును రహస్యంగా ఉపయోగిస్తే, అది అతనికి మంచిది కాదన్నారు. అక్రమ మార్గంలో తరలించే డబ్బు విషయంలో కఠినంగా వ్యవహారిస్తామన్నారు సీఈసీ.

3. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే సీరియస్ యాక్షన్

ఎన్నికల సమయంలో ఎవరైనా సోషల్ మీడియా లేదా ఏ ఇతర మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ సారి నకిలీ వార్తలను గుర్తించడానికి ఒక సెటప్‌ను సిద్ధం చేసామన్నారు సీఈసీ, అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.

4. నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు టిక్కెట్లు ఎందుకు..?

నేర చరిత్ర ఉన్న నేతలకు ఎందుకు టిక్కెట్లు ఇచ్చారో రాజకీయ పార్టీలు వివరించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇందుకోసం రాజకీయ పార్టీలు పత్రికలు, టీవీ ఛానళ్లలో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది.

5. స్టార్ క్యాంపెయినర్ల ప్రసంగాలపై నిఘా

అన్ని పార్టీల స్టార్ క్యాంపెయినర్లు వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం తెలిపింది. అలా చేస్తే కమిషన్ వారిపై చర్యలు తీసుకోవచ్చు. ఎన్నికలను సమస్యల ఆధారంగానే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ చెబుతోంది.

6. పిల్లల చిత్రాలను ఉపయోగించవద్దు

రాజకీయ పార్టీలు తమ ప్రచారాలలో చిన్న పిల్లలను ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఇలాంటి పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్‌ చెబుతోంది.

7. తప్పుడు ప్రకటనలపై చర్యలు

ఏదైనా రాజకీయ పార్టీ తప్పుడు ప్రకటనలు ఇవ్వాలని ప్రయత్నిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది. దీనిపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని కమిషన్ పేర్కొంది.

8. కులం, మతం గురించి మాట్లాడొద్దు

ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు కులం, మతం గురించి మాట్లాడకూడదని ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రచారం అందరినీ ఏకం చేయాలని, అందరినీ విభజించకూడదని కమిషన్ పేర్కొంది. దీనిపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

9. సోషల్ మీడియాలో ప్రత్యర్థుల పరువు తీయవద్దు

సోషల్ మీడియాలో ఏ నాయకుడిపైన గానీ, అభ్యర్థులపై పరువు నష్టం కలిగించే పోస్ట్‌లను చేయవద్దని కమిషన్ అన్ని పార్టీలకు ఆదేశాలు ఇచ్చింది. ఇదే జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

10. పార్టీలకు సరైన సలహా ఇవ్వండి

రాజకీయ పార్టీలు తమ సంస్థలకు సరైన సలహాలు ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది. అన్ని పార్టీలు సంస్థ పనితీరును పారదర్శకంగా ఉంచాలని కమిషన్ పేర్కొంది.

7 దశల్లో ఎన్నికలు, జూన్ 4న కౌంటింగ్

ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో నిర్వహించడం జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికల పూర్తి షెడ్యూల్‌ను కమిషన్‌ విడుదల చేసింది. బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాలకు మొత్తం 7 దశల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తొలి దశలో 102, రెండో దశలో 89, మూడో దశలో 94, నాలుగో దశలో 96, ఐదో దశలో 49, ఆరో దశలో 57, ఏడో దశలో57 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు కమిషన్‌ వెల్లడించింది.