Delhi: నాడు బెంగళూరు, నేడు హస్తిన.. రాజధానిలో ముదురుతున్న నీటి సంక్షోభం

దేశ రాజధాని నీటి కటకట ఎదుర్కొంటోంది. జీవ నదిగా పేరున్న 'గంగ' ఉపనది 'యమున' ఒడ్డునే కొలువైన ఈ నగరంలో నీటి కొరత నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే నగరానికి నీటి అందజేసే జలాశయాలు అడుగంటాయి. ఢిల్లీ నగరానికి నీటిని మోసుకొచ్చే కెనాల్‌కు హర్యానా ప్రభుత్వం తగినంత నీటిని విడుదల చేయడం లేదని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మొత్తంగా ఢిల్లీలోని అనేక ప్రాంతాల ప్రాంతాల ప్రజలు నీటి సంక్షోభంతో సతమతమవుతున్నారు.

Delhi: నాడు బెంగళూరు, నేడు హస్తిన.. రాజధానిలో ముదురుతున్న నీటి సంక్షోభం
Delhi
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 16, 2024 | 10:30 AM

దేశ రాజధాని నీటి కటకట ఎదుర్కొంటోంది. జీవ నదిగా పేరున్న ‘గంగ’ ఉపనది ‘యమున’ ఒడ్డునే కొలువైన ఈ నగరంలో నీటి కొరత నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే నగరానికి నీటి అందజేసే జలాశయాలు అడుగంటాయి. ఢిల్లీ నగరానికి నీటిని మోసుకొచ్చే కెనాల్‌కు హర్యానా ప్రభుత్వం తగినంత నీటిని విడుదల చేయడం లేదని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మొత్తంగా ఢిల్లీలోని అనేక ప్రాంతాల ప్రాంతాల ప్రజలు నీటి సంక్షోభంతో సతమతమవుతున్నారు. నీటి ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో మధ్యతరగతి, పేద ప్రజలు నివసించే కాలనీలు, మురికివాడలు మాత్రమే కాదు, ధనికులు నివసించే ప్రాంతాలు సైతం ఉన్నాయి. తీవ్ర కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో మునిర్కా, వసంత్ కుంజ్, మితాపూర్, కిరారీ, సంగమ్ విహార్, ఛతర్‌పూర్ మరియు బల్జిత్ నగర్‌తో పాటు చాణక్యపురిలోని సంజయ్ క్యాంప్, గీతా కాలనీలోని కొన్ని ప్రాంతాలు, రోహిణి, బేగంపూర్, వసంత్ కుంజ్, ఇంద్రా ఎన్‌క్లేవ్, సరాయ్ రోహిల్లా, మనక్‌పురా. ప్రభాత్ రోడ్, రాయ్‌గర్‌పురా, బీదన్‌పురా, దేవ్ నగర్, బాపా నగర్, బల్జీత్ నగర్ వంటి ప్రాంతాలున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా ఈ ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తోంది. అయితే నీటి ట్యాంకర్ రోజుకు ఒకసారి మాత్రమే చేరుతున్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. దీంతో ప్రజలకు సరిపడా నీరు అందడం లేదు. ట్యాంకర్ల నుంచి నీరు తెచ్చుకునేందుకు ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలోని సంజయ్ క్యాంప్ ప్రాంతంలో కూడా, ప్రతిరోజూ ఉదయం ప్రజలు తమ పనులన్నీ వదిలి వాటర్ ట్యాంకర్ కోసం వేచి చూస్తున్నారు. వాటర్ ట్యాంకర్ రాగానే, దాని వెనుకాల పరుగులు తీస్తూ.. నీటిని పట్టుకునేందుకు ఎగబడుతున్నారు. మొత్తంగా ట్యాంకర్ల వద్ద యుద్ధ వాతావరణం నెలకుంటోంది.

యమునా తీరమే.. అయినా సంక్షోభమే!

ఉత్తర భారత దేశంలో ప్రవహించే గంగా, సింధూ, బ్రహ్మపుత్ర.. వాటి ఉపనదులకు జీవనదులుగా పేరుంది. ఇందుక్కారణం వీటి జన్మస్థానం హిమాలయాలే. రుతుపవనాల సమయంలో వర్షాల కారణంగా ఈ నదులు ఉప్పొంగి ప్రవహిస్తే.. వేసవిలో హిమగిరుల్లోని మంచు కరగడం వల్ల నిండుగా ఉంటాయి. మొత్తంగా ఏడాది పొడవునా ఈ నదుల్లో పుష్కలంగా నీరు ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీ యమునా నది ఒడ్డునే ఉంది. కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, అత్యధిక జనసాంద్రత కల్గిన ఆగ్రా, కాన్పూర్ నగరాలు సైతం ఈ నది ఒడ్డునే ఉన్నాయి. హిమాలయాల్లోని యమునోత్రి వద్ద జన్మించిన ఈ నదిలోనూ నీరు పుష్కలంగానే ఉంటుంది. ఢిల్లీ, ఆగ్రా, కాన్పూర్ నగరాలను దాటిన తర్వాత ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) వద్ద గంగా నదిలో కలుస్తుంది. ఢిల్లీ నగర ప్రజల దాహార్తిని, రోజువారీ అవసరాలను తీర్చేది కూడా ఈ నది నీరే. అయితే నేరుగా ఆ నదిలో ఉన్న నీటిని తీసుకుని వాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఢిల్లీలో ప్రవహించే సమయంలో ఈ నది మురికి కాలువను తలపిస్తుంది. అంటే హైదరాబాద్‌లో మూసీ నది మాదిరిగా అన్నమాట. నగరం విడుదల చేసే మురుగునీరు మాత్రమే కాదు, పరిశ్రమలు విడుదల చేసే కాలుష్య జలాలు సైతం ఇందులోనే కలుస్తున్నాయి. అందుకే ఢిల్లీ దగ్గర యమున నుంచి నీటిని నేరుగా ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. అందుకే ఢిల్లీకి ఎగువన హర్యానాలో నిర్మించిన జలాశయాల నుంచి నీటిని నదికి సమాంతరంగా కాలువల ద్వారా రప్పించుకుని, శుద్ధి చేసి పంపిణీ చేయాల్సి వస్తోంది.

Delhi Water Production

Delhi Water Production

ఢిల్లీకి జీవధార ‘మునక్’ కాలువ

ఢిల్లీ నగర నీటి అవసరాలను తీర్చుతున్న వనరుల్లో యమునా నదిదే అగ్రభాగం. ఢిల్లీ నగరానికి ఎగువన 102 కి.మీ దూరంలో హర్యానాలోని కర్నాల్ జిల్లా ‘మునక్’ వద్ద నిర్మించిన జలాశయం నుంచి ఢిల్లీకి చేరే నీరే ఆధారం. 1996లో ఢిల్లీ-హర్యానా ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ జలాశయం నుంచి ఢిల్లీ తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓ కందకాన్ని కాలువగా మార్చారు. ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో హర్యానా ప్రభుత్వం 2003 – 2012 మధ్య కాలంలో ఈ కాలువను లీకేజికి ఆస్కారం లేకుండా సిమెంట్‌తో నిర్మించింది. అయితే 2016లో జరిగిన జాట్ల ఆందోళన సమయంలో ఈ కెనాల్ నుంచి నీటి సరఫరాను అడ్డుకోవడంతో.. నగరం ఒక్కసారిగా తీవ్ర నీటి సంక్షోభంలోకి వెళ్లిపోయింది. చివరకు సాయుధ బలగాల పహారా మధ్య నీటి సరఫరాను పునరుద్ధరించాల్సి వచ్చింది.

సరఫరా లోపాలే కారణమా?

ఢిల్లీ నగర నీటి అవసరాలను తీర్చడం కోసం మొత్తం 9 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి సామర్థ్యం మొత్తం కలిపి 956 MGD (మిలియన్ గ్యాలన్స్ పర్ డే). హర్యానా నుంచి వచ్చే ‘మునక్’ కెనాల్ నీటితో పాటు ఢిల్లీలోని బావులు, బోరు బావుల వంటి ఇతర నీటి వనరుల నుంచి అటూఇటుగా 135 MGD నీటిని ‘ఢిల్లీ జల్ బోర్డ్’ సమీకరిస్తోంది. అయితే ఢిల్లీ అవసరాలకు తగ్గట్టు ‘మునక్’ కెనాల్ నుంచి 1050 క్యూసెక్కుల నీటిని హర్యానా ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరోవైపు ఢిల్లీలో నిర్వహణ లోపాల కారణంగా నీటి పైపుల లీకేజి ద్వారా పెద్ద మొత్తం నీరు వృధా అవుతోందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఓసారి ఆరోపించారు. మొత్తంగా నీటి సంక్షోభం ఒక రాజకీయ వివాదంగా మారింది.

నీటి కొరతను తీర్చేందుకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల సామర్థ్యానికి మించి ఉత్పత్తి చేసే ప్రయత్నాల్లో ‘ఢిల్లీ జల్ బోర్డ్’ ఉంది. జూన్ 15న జల్ బోర్డ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. హైదర్‌పూర్ ప్లాంట్ సామర్థ్యం 216 MGD కాగా, రోజుకు 230 MGD నీరు ఇక్కడ ఉత్పత్తవుతోంది. ఇదేమాదిరిగా సోనియా విహార్, భగీరథి, చంద్రావల్, ద్వారక, నంగ్లోయి, ఓఖ్లా ప్లాంట్లలోనూ వాటి అసలు సామర్థ్యం కంటే ఎంతో కొంత ఎక్కువ మొత్తంలోనే నీరు ఉత్పత్తవుతోంది. కానీ 131 MGD సామర్థ్యం కలిగిన వజీరాబాద్ ప్లాంట్ విషయంలోనే పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ వాస్తవంగా 79 MGD కంటే ఎక్కువ నీరు ఉత్పత్తి కావడం లేదు. ఇందుక్కారణం ఆ ప్లాంటుకు అందాల్సిన మొత్తంలో నీరు అందడం లేదు. ఫలితంగా 20 MGD నుంచి 50 MGD మేర ప్రతిరోజూ కొరత ఏర్పడుతోంది. దీని ప్రభావం నగరంలోని చాలా కాలనీలపై పడుతోంది. గణాంకాల ప్రకారం కొరత తీవ్రంగా కనిపించకపోయినా.. ఏ కాలనీలైతే ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుందో.. ఆ కాలనీల్లో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles