Delhi Drugs Case: ఢిల్లీ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. కాంగ్రెస్‌పై హోంమంత్రి అమిత్ షా ఫైర్..

|

Oct 04, 2024 | 9:03 PM

ఢిల్లీ డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మరొక కీలక నిందితుడిని అరెస్ట్‌ చేయడంతోపాటు... రాజకీయ రంగు పులుముకోవడం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

Delhi Drugs Case: ఢిల్లీ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. కాంగ్రెస్‌పై హోంమంత్రి అమిత్ షా ఫైర్..
Amit Shah - Rahul Gandhi
Follow us on

ఢిల్లీ డ్రగ్స్‌ కేసు కీలక మలుపు తిరిగింది. వేలాది కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ పట్టుబడిన కేసు.. ఇప్పుడు పొలిటికల్‌ టర్న్‌ తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ డ్రగ్స్‌ రాకెట్‌లో తుషార్ గోయల్‌ పేరు ప్రముఖంగా వినిపించడంతో.. డ్రగ్స్‌ కేసు కాస్త బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌ పొలిటికల్‌ ఫైట్‌గా మారింది. హస్తం, కాషాయం పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్‌పై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. డ్రగ్స్‌ వ్యవహారంలో హస్తం పార్టీ నేత ప్రమేయం ఉండటం సిగ్గుచేటని తీవ్రంగా మండిపడ్డారు. డ్రగ్స్ ఫ్రీ ఇండియానే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తుంటే.. ఇలాంటి పనులకు పాల్పడటం దారుణమన్నారు. కాంగ్రెస్ పాలనలో పంజాబ్‌, హరియాణా, ఉత్తర భారతంలోని యువత ఈ మాదకద్రవ్యాల వల్ల ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో చూశాం.. ఇప్పుడదే కల్చర్‌ని దేశవ్యాప్తం చేయడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందంటూ ధ్వజమెత్తారు.

యువతను క్రీడలు, ఆవిష్కరణలు, విద్యవైపు ప్రోత్సహిస్తుంటే, వారిని కాంగ్రెస్‌ డ్రగ్స్ ప్రపంచం వైపు మళ్లించాలని అనుకుంటోందన్నారు. డ్రగ్‌ డీలర్ల రాజకీయ పలుకుబడితో సంబంధం లేకుండా ఆ నెట్‌వర్క్‌ ఎక్కడున్నా మోదీ ప్రభుత్వం పెకిలించి వేస్తుందంటూ ఎక్స్‌ వేదికగా ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు అమిత్‌ షా..

ఇటు అమిత్‌ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్లు కన్నెర్ర చేస్తున్నారు. కావాలనే డ్రగ్స్‌ కేసును పక్కదారి పట్టించి… తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహావేశాలు వెల్లగక్కుతున్నారు. ఇక ఈ డ్రగ్స్‌ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. యూకేకి పారిపోతున్న జెస్సీని అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ వ్యవహారంలో యూకే లింక్స్‌ ఉన్నాయని అనుమానంతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..