ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర పెంపు. వరి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచింది కేంద్రం. కేబినెట్ కీలక నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. పెట్టుబడి ఖర్చులపై ఒకటిన్నర రెట్లు ఎక్కువ మద్దతు ధర ఉండాలని 2018 కేబినెట్‌లో చెప్పామన్న కేంద్ర మంత్రి.. మద్దతు ధర పెట్టుబడి ఖర్చు కంటే 50 శాతం ఎక్కువగా నిర్ణయించామని ప్రకటించారు. పెట్టుబడి ఖర్చు అంచనాలను Commission for Agricultural Costs and Prices-CACP ఇప్పటికే అందుబాటులో ఉన్న శాస్త్రీయ విధానంలో లెక్కిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో, వివిధ గ్రామాల్లో వివరాలు సేకరించి పెట్టుబడి ఖర్చులను అంచనా వేస్తారు. చిరుధాన్యాలను మోదీ సర్కారు ప్రోత్సహిస్తోందన్న అశ్విని వైష్ణవ్.. ఈ క్రమంలోనే చిరుధాన్యాలకు మద్దతు ధర పెంచామని ప్రకటించారు.
కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు పరిశీలిస్తే.. సాధారణ రకం వరికి 2300 రూపాయలు, గ్రేడ్-ఎ కి 2320 రూపాయలు. 2013-14లో 1310 రూపాయలు ఉన్న ధరను మోదీ ప్రభుత్వం 2300 రూపాయలకు పెంచిందన్నారు అశ్విని వైష్ణవ్. ఇక పత్తి విషయానికి వస్తే.. 7121 రూపాయల మద్దతు ధర ప్రకటించింది కేంద్రం. 2013-14లో ఇది 3700 రూపాయలే అని గుర్తు చేశారు కేంద్ర మంత్రి. పంటల వారిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు పరిశీలిస్తే..
–కందులు మద్దతు ధర 7,550 రూపాయలు. గత ఏడాదితో పోల్చితే 550 రూపాయలు అదనం
–మినుములు మద్దతు ధర 7,400. గతేడాది కంటే 450 రూపాయలు ఎక్కువ
–పెసర మద్దతు ధర 8,682 రూపాయలు ఇది గతేడాది కంటే 124 రూపాయలు ఎక్కువ
–వేరుశనగకు 6,783 రూపాయలు నిర్ణయించిన కేంద్రం, ఇది గతేడాది కంటే 406 అదనం అని ప్రకటించింది.
–జొన్న ఎంఎస్‌పి 3,371 రూపాయలు. గతేడాది కంటే ఇది 191 రూపాయలు అదనం.
–సజ్జలు 2,625 రూపాయలు, రాగులు 4,290 రూపాయలు, మొక్కజొన్న 2,225 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 7280 రూపాయలు, నువ్వులు 9,267 రూపాయలు, సోయాబీన్‌కి 4,892 రూపాయల మద్దతు ధర నిర్ణయించింది కేంద్రం.
మొదటి పదేళ్లలో ఒక పునాదిని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్తున్న కేంద్రం.. మూడో దఫాలో ఆయా రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించబోతున్నట్లు ఆశిస్తోంది.
“మోదీ మూడో దఫా పాలనను చాలా కీలకంగా భావిస్తున్నాం. మొదటి పదేళ్ల పాలనలో ఆర్థిక రంగం, వ్యవసాయంలో ఒక పునాది ఏర్పాటు చేసుకున్నాం. ఈ మూడో దఫా పాలనలో ఆర్థిక రంగంలో, వ్యవసాయంలో మంచి పెరుగుదల వస్తుందని ఆశిస్తున్నాం, రైతు ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది” అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
కనీస మద్దతు ధర పెంపుతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచే క్రమంలో అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు కేంద్రం చెప్తోంది. వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ ఉంచి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునేందుకు వీలుగా 2 లక్షల గోడౌన్ల నిర్మాణం చేపట్టామంటోంది. వీటి నిర్వహణను సహకార సంఘాలు చూసుకుంటాయి. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ తొలి సంతకం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదలపైనే చేశారు. దానికి కొనసాగింపుగా కేబినెట్ భేటీలో పంటల మద్దత ధరలు పెంచుతూ రైతుకు తీపి కబురు అందించారు. మరో వైపు సముద్రం నుంచి కరెంట్ ఉత్పత్తి చేసేలా గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 7,453 కోట్ల రూపాయలతో చెరో 500 మెగావాట్ల సామర్థ్యంతో ఆఫ్‌షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వారణాసి ఎయిర్‌పోర్ట్‌కి 2,869 కోట్ల రూపాయలు కేటాయించింది. మహారాష్ట్ర విధావన్ దగ్గర గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్టును 76,200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే టాప్- 10 పోర్టుల్లో ఒకటిగా నిలవనుంది. ఈ పోర్టు నిర్మాణం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు పది లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు అంచనా.