కర్ణాటక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కర్ణాటకలో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతుండగా.. మళ్లీ సత్తాచాటాలని కాంగ్రెస్, జేడీఎస్ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీని మళ్లీ గెలిపించేందుకు ప్రధాని మోడీ సైతం రంగంలోకి దిగారు. రెండు రోజులపాటు ప్రధాని మోడీ సుడిగాలి పర్యటన నిర్వహించారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మైసూరులో మెగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు బహిరంగ సభల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రోడ్‌షోలకు జనం పోటెత్తారు. చుట్టూ ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ ప్రధాని మోడీ ముందుకు సాగారు. కాగా.. ప్రధాని రోడ్ షోలో అకస్మాత్తుగా అలజడి రేగింది. కార్యకర్తలకు ప్రధాని మోడీ.. అభివాదం చేస్తుండగా.. ఓ ఫోన్ గాల్లొంచి ప్రధాని వైపు వచ్చింది. దీంతో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. ఓ మహిళ తన ఫోన్ ను ప్రధాని వైపు విసిరినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఎస్పీజీ సైతం అప్రమత్తమైంది.
అయితే, ప్రధాని రోడ్ షో.. నగరంలోకి ప్రవేశించే క్రమంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్త ఈ మొబైల్ ఫోన్‌ను విసిరినట్లు పోలీసులు తెలిపారు. మహిళ విసిరిన తర్వాత మొబైల్ ఫోన్ వాహనం బానెట్‌పై పడింది. అయితే, బహిరంగ కార్యక్రమాల సమయంలో ప్రధాని మోడీ భద్రతకు బాధ్యత వహించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) వెంటనే అప్రమత్తమై ఫోన్ ను స్వాధీనం చేసుకుంది.
#WATCH | Security breach seen during Prime Minister Narendra Modi’s roadshow, a mobile phone was thrown on PM’s vehicle. More details awaited. pic.twitter.com/rnoPXeQZgB
— ANI (@ANI) April 30, 2023
బీజేపీ మహిళా కార్యకర్త ‘ఉత్సాహం’తో ఫోన్ విసిరారని, ఆమెకు ఎలాంటి ‘దురుద్దేశం’ లేదని పోలీసులు తెలిపారు. “ఉత్సాహంలో ఫోన్ విసిరారు.. ఆమెకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు, ఆమెకు ఎస్పీజీ సిబ్బంది ఫోన్ ను అందిచారు. ఆ మహిళను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.” అని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (లా అండ్ ఆర్డర్), అలోక్ కుమార్ వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు.
ఈ ఘటన మైసూరు జిల్లా కేఆర్ సర్కిల్‌లో చోటుచేసుకుంది. కాగా, మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..