
మన ప్రకృతిలో లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ అమూల్యమైన పోషక విలువలను కలిగి ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది సిట్రస్ కుటుంబానికి చెందిన బత్తాయిపండు.. ఇది కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఒక సహజ ఔషధం. విటమిన్ సి తో పాటు పొటాషియం, ఫాస్ఫరస్, వివిధ మినరల్స్ బత్తాయిలో పుష్కలంగా లభిస్తాయి. దీనిని నేరుగా తీసుకున్నా లేదా జ్యూస్ రూపంలో సేవించినా అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
బత్తాయి పిల్లల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు వారి శారీరక ఎదుగుదలకు, ముఖ్యంగా జ్ఞాపకశక్తి పెంపుదలకు తోడ్పడతాయి. ఇది వారికి ఒక సహజసిద్ధమైన టానిక్‌గా పనిచేస్తుంది.
కీళ్ల నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారికి బత్తాయి రసం ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు బత్తాయి పండ్ల రసంలో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల ఈ సమస్యల తీవ్రత తగ్గుతుంది. అలాగే, అల్సర్, పేగులలో పుండ్లు ఉన్నవారికి కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, పుండ్లు మానేందుకు సహాయపడుతుంది.
బత్తాయి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (HDL) అభివృద్ధి చెందుతుంది. ఇది రక్త శుద్ధికి సహాయపడుతుంది. రక్తహీనత సమస్యను నివారించి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
డయేరియా వంటి కారణాలతో అలసిపోయి, నీరసంగా ఉన్నవారికి బత్తాయి పండ్ల రసం తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి వెంటనే శక్తిని చేకూరుస్తాయి.
కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్ సి అధికంగా ఉండే బత్తాయి గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. కడుపులోని శిశువు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు బత్తాయి రసంలో పుష్కలంగా ఉంటాయి. బత్తాయి పండ్ల రసంలో తేనె, నిమ్మరసంతో పాటు ఉసిరిని కలిపి తీసుకుంటే కంటి చూపు మరింత మెరుగుపడుతుంది. ఇది నరాలపై ఒత్తిడిని తగ్గించి, రక్త శుద్ధితో పాటు వీర్య అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది.
బత్తాయి పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్లు పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. సుమారు 70 గ్రాముల బత్తాయి పండులో కేవలం 40 క్యాలరీల శక్తి మాత్రమే ఉంటుంది. ఈ తక్కువ క్యాలరీల కారణంగా బరువు తగ్గాలనుకునే వారికి బత్తాయి రసం ఒక మంచి ఎంపిక. ప్రతిరోజు ఖాళీ కడుపుతో బత్తాయి రసం తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
బత్తాయి రసం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. బి.పి. (రక్తపోటు), షుగర్ (మధుమేహం) నియంత్రణలో ఉంటాయి. అలాగే, ఎముకలు బలంగా తయారవడానికి కూడా ఇది తోడ్పడుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, బత్తాయి చర్మ సౌందర్యానికి కూడా ఉపకరిస్తుంది. బత్తాయి పండ్ల తొక్కలను ఎండబెట్టి పొడి చేసి, దానిని సున్నిపిండితో కలిపి నీటితో పేస్ట్‌లా తయారుచేసుకొని ముఖానికి రాసుకుంటే మృత కణాలు తొలగిపోయి, చర్మం కాంతివంతంగా, నిగనిగలాడుతుంది. పలు సౌందర్య సాధనాల కంపెనీలు కూడా తమ ఉత్పత్తులలో బత్తాయిని ఉపయోగిస్తున్నాయి.
బత్తాయి పండ్లు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా బత్తాయి పండ్లను లేదా రసాన్ని తీసుకుని మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని డైటీషియన్లు పేర్కొంటున్నారు. అయితే.. ఏమైనా సమస్యలుంటే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..