
భారతీయ ఇండ్లలో గుడ్డు ఒక ముఖ్యమైన అల్పాహారం. ఇందులో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, లూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో తోల్పడుతాయి. అయితే వీటిని ఒక్కొక్కరూ ఒక్కొలా ఆహారంలో చేర్చుకుంటారు. కొందరు పచ్చి గుడ్లను తింటే మరికొందరు ఉడికించుకొని తింటారు, మరి కొందరు ఆమ్లెట్, ఆఫ్ బాయిల్ రూపంలో ఆహారంలో చేర్చుకుంటారు. కానీ పచ్చిగడ్లు తినడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పచ్చిగుడ్లు ఎందుకు తినకూడదు, వాటికి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి. ఉడికించిన గుడ్లు, పచ్చి గుడ్ల మధ్య తేడాలు ఏంటో చూద్దాం.
పచ్చి గుడ్ల కంటే వండిన గుడ్లు ఎందుకు మంచివి?
చాలా మంది గుడ్లను వండుకుని తింటే, కొందరు ఫిట్‌నెస్ ప్రియులు మాత్రం పచ్చి గుడ్లు తాగితేనే ఎక్కువ ప్రోటీన్లు, పోషకాలు అందుతాయని, ఉడికించడం వల్ల అవి నశిస్తాయని భావిస్తుంటారు. కానీ, ఇది నిజం కాదని ప్రముఖ వైద్యులు డాక్టర్ అన్షుమన్ కౌశల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్పష్టం చేశారు. పచ్చి గుడ్లు తినడం ప్రమాదకరమని అందరికీ తెలుసు. అయినా తింటారు. ఎందుకు? పచ్చి గుడ్ల వల్ల ఎక్కువ ప్రోటీన్ వస్తుందనేది కేవలం ఒక పాప్ కల్చర్ అపోహ మాత్రమే అని ఆయన చెప్పారు.
దీనికి సంబంధించి 1998 నాటి జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ బెల్జియం పరిశోధనను ఆయన ఉదహరించారు. ఉడికించిన గుడ్లను తిన్నప్పుడు మన శరీరం 91 శాతం ప్రోటిన్‌ను గ్రహిస్తుందని.. అదే పచ్చి గుడ్లను తాగడం వల్ల కేవలం 51శాతం ప్రోటీన్ మాత్రమే అందుతుందని తెలిపారు. అంటే ఉడికించిన గుడ్డుతో పోల్చుకుంటే పచ్చి గుడ్డు తీసుకోవడం ద్వారా 40 శాతం ప్రోటీన్‌ను కోల్పోతున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా పచ్చిగుడ్లు నేరుగా తాగడం వల్ల సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.
పోస్ట్ చూడండి..
పచ్చి గుడ్లు vs వండిన గుడ్లు
వండటం వల్ల పోషకాలు నశించవు: చాలా మంది గుడ్లను ఉండికించడం వల్ల పోషకాలు పోతాయి అనుకుంటారు. కానీ వేడి చేయడం వల్ల ప్రోటీన్ నిర్మాణం విడిపోయి, ఎంజైమ్‌లు సులభంగా లోపలికి ప్రవేశించి అమినో యాసిడ్లను విడుదల చేస్తాయి. దీనివల్ల పోషకాలు నశించవు సరేకదా, జీర్ణం కావడం సులువవుతుంది.
బయోటిన్ విడుదల అవుతుంది: చర్మం, జుట్టు ఆరోగ్యానికి బయోటిన్ అవసరం. పచ్చి గుడ్డు తెల్లసొనలో అవిడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది బయోటిన్‌ను బంధించి శరీరానికి అందకుండా చేస్తుంది. గుడ్డును ఉడికించినప్పుడు ఈ అవిడిన్ నశించి, బయోటిన్ విడుదలై శరీరానికి అందుతుంది. ఇది జుట్టు రాలడం, చర్మ సమస్యలు, గోళ్లు విరగడం వంటి వాటిని అడ్డుకుంటుంది.
సాల్మొనెల్లా బ్యాక్టీరియా నశిస్తుంది: గుడ్డు పెంకును కడగడం వల్ల బ్యాక్టీరియా పోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ, కోడి అండాశయంలోనే ఈ బ్యాక్టీరియా గుడ్డు లోపలికి చేరుతుంది దీనిని ట్రాన్స్‌ఓవేరియన్ ట్రాన్స్‌మిషన్ అంటారు. కాబట్టి పెంకు పైన కడిగినా ప్రయోజనం ఉండదు. ఉండికించినప్పుడు దాని లోపల ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.
గుడ్లను సురక్షితంగా ఎలా తినాలి?
గుడ్లను ఎప్పుడూ ఉడకబెట్టి లేదా కర్రీస్‌లో, లేదా స్క్రాంబుల్డ్ , లేదా ఆమ్లెట్ రూపంలో మాత్రమే తినండి.
గుడ్లు ఉడకపెట్టేప్పుడు దానిలోని తెల్లసొన పూర్తిగా ఉడకేలా చూసుకోండి.
గర్భిణీలు, పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, క్యాన్సర్ లేదా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న రోగులు పచ్చి గుడ్లను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇది ప్రాణాంతకం కావచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.