
చికెన్, మటన్ను నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తింటారు. ముఖ్యంగా.. కర్రీ, ఫ్రైతోపాటు.. పలు రకాలుగా వండుకుని తింటారు. అయితే, మేక మాంసంలో ప్రతి భాగం ప్రత్యేకమైనదే.. లివర్, తలకాయ, కాళ్లు, బోటి.. ఇలా అన్ని కూడా ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి.. అయితే.. నాన్వెజ్ తినే వారిలో చాలామంది ఇష్టంగా తినే వంటకాల్లో బోటి కర్రీ ఒకటి. ఈ మేక లేదా గొర్రె బోటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చాలామందికి తెలియదు. బోటిలో అధికంగా ప్రోటీన్, ఫ్యాట్స్ ఉంటాయి.. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఎప్పుడూ అలసటగా, బలహీనంగా అనిపించే వారికి బోటి ఒక వరం లాంటి ఆహారం.. అందుకే.. బోటి కూరను వారానికి లేదా పదిరోజులకు ఒకసారి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు పెద్దలు..
వాస్తవానికి బోటి కూరలో శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, ఐరన్, ఫైబర్ తోపాటు విటమిన్ బి12, విటమిన్ ఎ, ఇ, కె ఉంటాయి. అందుకే.. నాన్ వెజ్ ప్రియులు ముఖ్యంగా.. మటన్ తినే వారు బోటి కూరను ఇష్టంగా తింటారు.
జిమ్కు వెళ్లి లేదా వర్కౌట్స్ చేసేవారికి కండరాల బలం పెరగడానికి బోటి ఒక ఉత్తమమైన ఆహారం. బోటిలో ఉండే జింక్ చర్మం ప్రకాశవంతంగా మారడానికి.. జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.
విటమిన్ B12 మెమరీ పవర్ ను పెంచి, మెదడును చురుకుగా ఉంచుతుంది. శరీరంలో ప్రతి కణానికి, ముఖ్యంగా నరాల వ్యవస్థకు సహాయపడేలా చేస్తుంది. అంతేకాకుండా.. నరాల బలహీనతను నివారిస్తుంది.
అలాగే, బోటిలో పుష్కలంగా ఉండే ఐరన్ రక్త స్థాయిలు పెరగడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా మంచిది.
బోటి కర్రీలో ఉండే ప్రోబయోటిక్స్ మన గట్ హెల్త్ కి, జీర్ణవ్యవస్థ పనితీరుకు చాలా మంచిది. సన్నగా ఉండేవాళ్లు త్వరగా బరువు పెరగాలనుకుంటే, బోటి కర్రీ బెస్ట్ ఫుడ్ అని డైటీషియన్లు సూచిస్తున్నారు.
అయితే, బోటి కర్రీని పరిమితికి మించి తింటే కొలెస్ట్రాల్ గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు (బీపీ) ఉన్నవాళ్లు ఈ బోటి కర్రీని అస్సలు తినకూడదు. సరైన మోతాదులో తీసుకుంటే బోటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. కానీ జాగ్రత్త లేకపోతే నష్టం కూడా కలిగించవచ్చని పేర్కొంటున్నారు.. అయితే.. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే ముందుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.