కందిపప్పు vs పెసరపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీకు తెలియని నిజాలు..

రెండూ ప్రొటీన్ ఇచ్చే పప్పులే.. కానీ పొట్టలోకి వెళ్లాక వీటి ప్రభావం మాత్రం పూర్తిగా వేరు. కొందరికి కందిపప్పు తింటే గ్యాస్ ఇబ్బంది పెడుతుంది, మరికొందరికి పెసరపప్పు త్వరగా ఆకలి వేసేలా చేస్తుంది. మరి బరువు తగ్గాలనుకునే వారికి, నిత్యం జీర్ణ సమస్యలతో సతమతమయ్యే వారికి ఈ రెండింటిలో ఏది అసలైన ఔషధం. పోషకాల లెక్కల్లో ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఛాయిస్ అనేది ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం.

కందిపప్పు vs పెసరపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీకు తెలియని నిజాలు..
Moong Dal Vs Toor Dal

Updated on: Oct 08, 2026 | 7:05 AM

భారతీయుల భోజనంలో పప్పు లేని రోజంటూ దాదాపు ఉండదు. పప్పుచారు, సాంబారు, ముద్దపప్పు, కిచిడీ ఇలా ఏదో ఒక రూపంలో ప్రతి ఇంటా పప్పు ప్రధాన ఆహారంగా ఉంటుంది. అయితే రోజువారీ వంటకాల్లో ఎక్కువగా వాడే కందిపప్పు, పెసరపప్పులలో ఏది ఎక్కువ ఆరోగ్యకరం? జీర్ణక్రియకు ఏది మంచిది? అనే చర్చ చాలామందిలో నడుస్తుంటుంది. దీనికి సంబంధించి పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పెసరపప్పు తేలికగా జీర్ణమయ్యే ఆహారంగా పేరుగాంచింది. ఇందులో నాణ్యమైన ప్లాంట్ ప్రొటీన్, తక్కువ కొవ్వు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పొట్ట ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి, అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వారికి, పిల్లలకు పెసరపప్పుతో చేసిన కిచిడీ లేదా పప్పును వైద్యులు సిఫార్సు చేస్తారు. ఇది శరీరానికి చలువ చేస్తుంది. రాత్రి వేళల్లో తేలికపాటి భోజనం చేయాలనుకునే వారికి పెసరపప్పు అద్భుతమైన ఎంపిక.

రుచిలో రారాజు.. కడుపు నింపే కందిపప్పు

కందిపప్పు భారతీయులకు ఆల్‌టైమ్ ఫేవరెట్. చిక్కటి సాంబారు, ముద్దపప్పు నెయ్యితో కలిపి తినే రుచే వేరు. కందిపప్పులో ప్రోటీన్‌తో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఐరన్, ఫోలేట్, డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇది తిన్న తర్వాత చాలా సేపటి వరకు ఆకలి వేయకుండా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు, ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి ఇది మంచి శక్తినిస్తుంది. అయితే కొందరిలో కందిపప్పు తిన్నప్పుడు గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే కందిపప్పును వండే ముందు కనీసం 30 నుంచి 40 నిమిషాలు నీటిలో నానబెట్టి, తాలింపులో ఇంగువ, వెల్లుల్లి, జీలకర్ర వేసి వండితే జీర్ణ సమస్యలు రావు.

పోషకాల పోటీలో ఏది ముందంజ?

రెండు పప్పుల్లోనూ ప్రొటీన్లు సమృద్ధిగానే లభిస్తాయి. కానీ శరీర స్పందనను బట్టి వీటి ఉపయోగం మారుతుంది.

జీర్ణక్రియ దృష్ట్యా: పెసరపప్పు ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. సులభంగా జీర్ణమై పేగులపై భారం పడకుండా చూస్తుంది.

శక్తి, సంతృప్తి పరంగా: కందిపప్పు ఎక్కువ సమయం ఎనర్జీని అందిస్తుంది.

వెయిట్ లాస్ జర్నీలో: కేలరీలు తక్కువగా ఉండి సులభంగా అరిగేందుకు పెసరపప్పు అనుకూలం.

ఎలాంటి డైట్ పాటించాలి?

ఈ రెండింటిలో ఏదో ఒక పప్పునే ఎంచుకోవాల్సిన పనిలేదని న్యూట్రిషనిస్టులు స్పష్టం చేస్తున్నారు. వారంలో 3-4 రోజులు కందిపప్పు, మిగిలిన రోజుల్లో పెసరపప్పు వాడటం వల్ల ఆహారంలో వైవిధ్యం ఉంటుంది, శరీరానికి అన్ని రకాల అమైనో ఆమ్లాలు, పోషకాలు అందుతాయి. రాత్రి వేళల్లో పెసరపప్పును, మధ్యాహ్న భోజనంలో కందిపప్పును తీసుకోవడం అత్యంత ఆరోగ్యకరమైన పద్ధతి.

Loading...
Unable to load recommendations.
Follow Us