పాల ప్యాకెట్‌పై కేవలం ఎక్స్‌పైరీ డేట్ మాత్రమే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!
మనదేశంలో చాలా కుటుంబాలలో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా పిల్లలకు ఇచ్చే పాల ప్యాకెట్‌తోనే ప్రారంభమవుతుంది. సాధారణంగా షాప్‌లో లేదా డెలివరీ ద్వారా పాల ప్యాకెట్ తీసుకోగానే చాలామంది చూసేది ఒకే ఒక్కటి.. అది ఎప్పుడు ప్యాక్ చేశారు, గడువు తేదీ ఎప్పటివరకు ఉంది అనేది మాత్రమే. కానీ, మీ కుటుంబ ఆరోగ్య భద్రత దృష్ట్యా పాల ప్యాకెట్‌పై ఈ తేదీలతో పాటు మరికొన్ని అత్యంత ముఖ్యమైన సమాచారం ఉంటుందని మీకు తెలుసా? ఇకపై పాలు కొనేటప్పుడు ఈ వివరాలను తప్పకుండా పరిశీలించండి.

రోజువారీ జీవితంలో పాల ప్యాకెట్ కొనేటప్పుడు చాలామంది కేవలం తయారీ, గడువు తేదీలను మాత్రమే చూస్తుంటారు. అయితే, ప్యాకెట్‌పై మన కుటుంబ ఆరోగ్యానికి అవసరమైన ఇతర కీలక వివరాలు కూడా ఉంటాయి. ప్యాకెట్‌పై ఉండే ఫ్యాట్ శాతం,SNF (Solids-Not-Fat) వివరాలు పాలు ఏ రకానికి చెందినవో తెలియజేస్తాయి. అలాగే ప్రామాణికతను నిరూపించే FSSAI లైసెన్స్ నంబర్, నాణ్యత సమస్యలు వస్తే గుర్తించడానికి బ్యాచ్ నంబర్, నిల్వ చేసే సూచనలు సరిచూసుకోవాలి. ఈ వివరాలను గమనించడం ద్వారా సురక్షితమైన, పోషకాలతో కూడిన పాలను ఎంచుకోవచ్చు.
పాల ప్యాకెట్‌పై పరిశీలించాల్సిన ముఖ్యమైన వివరాలు:
ఫ్యాట్, SNF వివరాలు:
పాల ప్యాకెట్‌పై ఫ్యాట్ శాతం, SNF (Solids-Not-Fat) స్పష్టంగా రాసి ఉంటాయి. ఇవి పాలు ఏ రకానికి చెందినవో నిర్ధారిస్తాయి. ఫుల్ క్రీమ్ మిల్క్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటే, టోన్డ్ లేదా డబుల్ టోన్డ్ మిల్క్‌లో తక్కువగా ఉంటుంది. SNF అంటే కొవ్వు మినహా పాలలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, లాక్టోస్. మీ ఆరోగ్య అవసరాలకు తగ్గట్టుగా ఫుల్ క్రీమ్ లేదా టోన్డ్ పాలను ఎంచుకోవడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.
FSSAI లైసెన్స్ నంబర్:
ప్యాకెట్‌పై 14 అంకెల FSSAI అంటే..భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ లైసెన్స్ నంబర్ ఉందో లేదో చూడాలి. ఈ నంబర్ ఉంటేనే ఆ పాలు ప్రభుత్వ గుర్తింపు పొందిన భద్రతా ప్రమాణాల ప్రకారం ప్యాక్ చేయబడ్డాయని అర్ధం. ఇది పాల నకిలీ తనాన్ని నివారిస్తుంది.
బ్యాచ్ నంబర్:
ప్రతి పాల ప్యాకెట్‌పై ఒక విశిష్ట బ్యాచ్ నంబర్ ఉంటుంది. పాలలో ఏవైనా నాణ్యతా లోపాలు లేదా సమస్యలు ఎదురైనప్పుడు తయారీ సంస్థకు ఫిర్యాదు చేయడానికి ఈ బ్యాచ్ నంబర్ ఎంతో కీలకం. దీని ద్వారా ఆ పాలు ఏ సమయానికి, ఏ ప్లాంట్‌లో ప్యాక్ చేయబడ్డాయో సులభంగా గుర్తించవచ్చు.
నిల్వ చేసే పద్ధతులు:
పాల ప్యాకెట్ పైభాగంలో ‘Keep Refrigerated’ లేదా Consume soon after opening వంటి సూచనలు ఉంటాయి. పాలను సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకపోతే అవి త్వరగా పాడైపోతాయి. కాబట్టి ఈ సూచనలను ఖచ్చితంగా పాటించాలి. రోజువారీ ఆహారంలో భాగమైన పాలను కొనేటప్పుడు ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తాజా, సురక్షితమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించవచ్చు!




