
భారతీయ వంటకాల్లో జీలకర్ర ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాలింపుకు మంచి సువాసన ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. సాధారణంగా మనం కిరాణా దుకాణాలు లేదా సూపర్‌మార్కెట్ల నుంచి తెచ్చుకునే జీలకర్ర ప్యాకెట్లను వాడుతుంటాం. అయితే మీ ఇంట్లో చిన్న బాల్కనీ లేదా ఎండ తగిలే కాస్త జాగా ఉంటే చాలు.. రసాయనాలు లేని స్వచ్ఛమైన జీలకర్రను సొంతంగా ఇంట్లోనే పండించుకోవచ్చు. దీనికి పెద్ద తోటలు కానీ, ప్రత్యేకమైన వ్యవసాయ పరికరాలు కానీ అవసరం లేదు. సరైన కుండీ, అనువైన మట్టి, కాస్తంత సంరక్షణ ఉంటే ఎవరైనా జీలకర్ర మొక్కను ఇంట్లోనే సులభంగా పెంచవచ్చు.
జీలకర్ర వేర్లు తేలికగా వ్యాపించడానికి వీలుగా కాస్త వెడల్పుగా ఉండే కుండీని ఎంచుకోవాలి. కుండీ మట్టిదైనా, ప్లాస్టిక్‌దైనా లేదా సిరామిక్‌దైనా పర్వాలేదు కానీ అడుగు భాగంలో కచ్చితంగా నీరు బయటకు పోయే రంధ్రాలు ఉండాలి. కుండీలో నీరు నిలిచిపోతే వేర్లు త్వరగా కుళ్లిపోయి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది.
జీలకర్ర సాగుకు తేలికపాటి, నీరు సులభంగా ఇంకిపోయే ఇసుక కలిసిన నల్లరేగడి లేదా తోట మట్టి చాలా మంచిది. కుండీలో మట్టిని వదులుగా నింపిన తర్వాత, దాదాపు అర అంగుళం లోతులో మాత్రమే విత్తనాలను చల్లుకోవాలి. విత్తనాలను మరీ లోతుగా పాతిపెట్టకుండా పైన తేలికపాటి మట్టి పొరను కప్పి, నీటిని చిలకరించాలి. వంటింట్లో ఉండే పాత లేదా ప్రాసెస్ చేసిన జీలకర్ర విత్తనాలన్నీ మొలకెత్తకపోవచ్చు. కాబట్టి నాణ్యమైన లేదా మొలకెత్తే సామర్థ్యం ఉన్న దేశీ జీలకర్ర విత్తనాలను ఎంచుకోవడం ఉత్తమం.
జీలకర్ర మొక్కలు ఆరోగ్యంగా ఎదగడానికి పుష్కలమైన సూర్యరశ్మి ఎంతో అవసరం. కుండీని ప్రతిరోజూ కనీసం 5 నుంచి 6 గంటల పాటు నేరుగా ఎండ తగిలే బాల్కనీ లేదా డాబాపై ఉంచాలి. నీరు పోసే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మట్టి ఎప్పుడూ కాస్త తేమగా ఉండేలా చూసుకోవాలి తప్ప కుండీలో నీరు నిలవ ఉండకూడదు. కుండీ పైమట్టి పొడిగా మారినప్పుడే నీటిని స్ప్రే చేయాలి.
మొక్క ఎదుగుదలకు పోషకాలు తప్పనిసరి. రసాయన ఎరువుల జోలికి వెళ్లకుండా ఇంట్లోనే దొరికే సేంద్రియ ఎరువులు వాడటం మంచిది. మట్టిలో వర్మీకంపోస్ట్, బాగా చివికిన ఆవు పేడ లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్‌ను నెలకు ఒకటి లేదా రెండుసార్లు కొద్ది మొత్తంలో అందిస్తే సరిపోతుంది. మోతాదుకు మించి ఎరువులు వేస్తే మొక్కలు మాడిపోయే ప్రమాదం ఉంది.
జీలకర్ర విత్తనాలు నాటిన కొద్ది వారాల్లోనే మొక్క పెరిగి, అందమైన చిన్న తెల్లని లేదా గులాబీ రంగు పూలు పూస్తుంది. పూత రాలిన తర్వాత క్రమంగా చిన్న జీలకర్ర గింజలు ఏర్పడతాయి. వాతావరణం, ఎండ తీవ్రతను బట్టి మొక్క పూర్తిగా పక్వానికి వచ్చి గింజలు ఎండిపోవడానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. మొక్క పసుపు రంగులోకి మారి, గింజలు బ్రౌన్ కలర్‌లోకి మారినప్పుడు జాగ్రత్తగా కోసి, నీడలో పూర్తిగా ఆరబెట్టుకోవాలి. తేమ లేకుండా బాగా ఎండిన తర్వాత గింజలను వేరు చేసి గాజు సీసాలో భద్రపరుచుకుంటే సువాసనభరితమైన ఆర్గానిక్ జీలకర్ర సిద్ధమైనట్లే.