
మన దేశంలో ఉల్లిపాయ లేని కూర ఊహించడం కష్టం. అయితే ఉల్లిపాయలు కోయడం మొదలుపెట్టగానే కళ్లు మంట పుట్టడం, కన్నీళ్లు కారడం ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సాధారణ సమస్య. ఇలా ఎందుకు జరుగుతుందనే దాని వెనుక ఒక ఆసక్తికరమైన సైన్స్ దాగి ఉంది. ఉల్లిపాయలను కత్తితో కోసినప్పుడు వాటి లోపలి కణాలు విచ్ఛిన్నమై.. సిన్ ప్రొపనేథియల్ ఎస్ ఆక్సైడ్ అనే రసాయన వాయువు గాల్లోకి విడుదలవుతుంది. ఈ ఘాటైన వాయువు మన కళ్లలోని తేమతో కలిసిన వెంటనే స్వల్ప పరిమాణంలో సల్ఫ్యూరిక్ ఆమ్లంగా రూపాంతరం చెందుతుంది. దీనివల్ల కళ్లలో తీవ్రమైన మంట, దురద కలిగి కన్నీళ్లు కారడం మొదలవుతుంది. అయితే వంటింట్లో కొన్ని సులభమైన శాస్త్రీయ పద్ధతులు, చిన్న చిన్న మార్పులు పాటిస్తే ఈ కన్నీళ్ల బాధ నుంచి తేలికగా ఉపశమనం పొందవచ్చు.
చల్లటి నీరు లేదా ఫ్రిజ్: ఉల్లిపాయ తొక్క తీసిన తర్వాత తరగడానికి ముందు 15 నిమిషాల పాటు చల్లటి నీటిలో నానబెట్టండి. లేదా 10–15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత తరగండి. చల్లటి ఉష్ణోగ్రత రసాయన ఎంజైమ్‌ల వేగాన్ని తగ్గించి గ్యాస్ తక్కువగా విడుదలయ్యేలా చేస్తుంది.
పదునైన కత్తి వాడకం: మొద్దుబారిన కత్తితో కోస్తే ఉల్లిపాయ కణాలు ఎక్కువగా నలిగి ఎక్కువ గ్యాస్ వస్తుంది. అదే పదునైన కత్తిని ఉపయోగిస్తే కటింగ్ నునుపుగా జరిగి వాయువు విడుదల చాలావరకు తగ్గుతుంది.
చివర్లో వేరు భాగాన్ని కట్ చేయడం: ఉల్లిపాయ వెనుక ఉండే వేరు భాగంలోనే సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మిగతా భాగాన్ని తరిగిన తర్వాత ఆ వేరు భాగాన్ని చివర్లో కత్తిరించడం వల్ల కన్నీళ్లు తగ్గుతాయి.
ఫ్యాన్ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్: ఉల్లిపాయలు తరిగే సమయంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసుకోవడం వల్ల విడుదలయ్యే ఘాటైన వాయువులు నేరుగా కళ్లలోకి రాకుండా పక్కకు వెళ్లిపోతాయి.
నిమ్మరసం లేదా వెనిగర్: కటింగ్ బోర్డుకు కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ పూసి ఉల్లిపాయలు కోయడం వల్ల అందులోని ఘాటైన రసాయన ప్రభావం తగ్గిపోతుంది. ఈ సింపుల్ చిట్కాలతో కన్నీళ్లు రాకుండానే ఉల్లిపాయలను కోసేయండి.