80’s, 90’s కిడ్స్‌కు గుడ్ న్యూస్.. 26 ఏళ్ల తర్వాత మళ్లీ రానుందా గోల్డ్ స్పాట్?

ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన గోల్డ్ స్పాట్ ఆరెంజ్ శీతల పానీయం మరోసారి వార్తల్లో నిలిచింది. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గోల్డ్ స్పాట్ క్యాన్‌తో ఉన్న ఫోటోను సాక్షి ధోనీ పంచుకోవడంతో, ఈ డ్రింక్‌ 26 ఏళ్ల తర్వాత మళ్లీ మార్కెట్‌లోకి వస్తోందా అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. 1980లు, 1990లలో పెరిగిన వారికి గోల్డ్ స్పాట్ ఒక తీపి జ్ఞాపకంగా నిలిచింది.

80s, 90s కిడ్స్‌కు గుడ్ న్యూస్.. 26 ఏళ్ల తర్వాత మళ్లీ రానుందా గోల్డ్ స్పాట్?
Gold Spot Comeback

Updated on: Nov 25, 2026 | 11:05 AM

1980లు, 1990లలో పెరిగిన వారికి గోల్డ్ స్పాట్ ఆరెంజ్ శీతల పానీయం ఒక మధుర జ్ఞాపకం. సుమారు 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ప్రముఖ డ్రింక్ మళ్లీ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవల భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గోల్డ్ స్పాట్ క్యాన్‌తో కనిపించిన ఫోటోను సాక్షి ధోనీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ పునరాగమనంపై ఊహాగానాలు మరింత పెరిగాయి. ధోనీ ఈ బ్రాండ్‌తో జతకట్టారా లేదా అనేది అధికారిక ప్రకటన తర్వాతే తేలనుంది.

గోల్డ్ స్పాట్ చరిత్ర, ఆదరణ:

1949లో పార్లే సంస్థ గ్లూకో కోలాతో శీతల పానీయాల రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత 1952లో గోల్డ్ స్టార్ పెప్పర్‌మింట్ పేరు స్ఫూర్తితో గోల్డ్ స్పాట్ అనే నారింజ రుచి పానీయాన్ని ప్రారంభించింది. తీపి, పులుపు కలగలిసిన నారింజ రుచి, ఆకర్షణీయమైన ప్రకటనలు దీనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అప్పట్లో సీసా మూతల లోపల ఉండే కార్టూన్ బొమ్మలను సేకరించడం పిల్లలకు ఎంతో సరదాగా ఉండేది. 1970లలో రేఖ నటించిన ప్రకటన, లివ్వా లిటిల్ హాట్, సిప్పా గోల్డ్ స్పాట్ నినాదం బాగా ప్రాచుర్యం పొందాయి. 1980ల మధ్యలో కమలేష్ పాండే రూపొందించిన ది జింగ్ థింగ్ నినాదం, డిస్కో శైలి ప్రకటనలతో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. పార్లే రూపొందించిన థమ్స్ అప్, లిమ్కా, మాజా సరసన గోల్డ్ స్పాట్ నిలిచింది.

ఇవి కూడా చదవండి

నిలిపివేత, పునరాగమన కారణాలు:

1993లో కోకా-కోలా భారత్‌లోకి తిరిగి వచ్చినప్పుడు పార్లే పానీయాల బ్రాండ్లను కొనుగోలు చేసింది. అయితే తన వద్ద ఇప్పటికే ఫాంటా అనే నారింజ పానీయం ఉండటంతో, రెండు బ్రాండ్ల మధ్య పోటీని నివారించేందుకు 2000లో గోల్డ్ స్పాట్ ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రస్తుతం భారత శీతల పానీయాల మార్కెట్‌లో కాంపా వంటి బ్రాండ్లు, ప్రాంతీయ పానీయాల నుంచి పోటీ పెరుగుతోంది. దీనికి తోడు తక్కువ చక్కెర లేదా చక్కెర రహిత పానీయాలకు వినియోగదారుల్లో ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కోకా-కోలా తన పాత బ్రాండ్‌ను తక్కువ లేదా సున్నా చక్కెర రూపంలో తిరిగి తీసుకురావాలని భావిస్తోంది.

పాత రుచి ఉంటుందా అనే సందేహం:

నేటి తరం డైట్ డ్రింక్స్‌కు ఎలా ఆకర్షితులవుతున్నారో, అప్పట్లో గోల్డ్ స్పాట్ అలాంటి ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండేది. అయితే గతంలో చక్కెరతో కూడిన తీపి, నారింజ సువాసన, ప్రత్యేకమైన ఫిజ్ వల్లే గోల్డ్ స్పాట్‌ను ప్రజలు ఇష్టపడ్డారు. ఇప్పుడు తక్కువ లేదా చక్కెర రహిత ఫార్ములాతో వస్తే పాత రుచిని ఎంతవరకు అందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పాత జ్ఞాపకాలను కొత్త రుచి ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us