Chicken Liver Fry: ముక్క ముక్కలో నాటు స్టైల్ ఘాటు.. కర్ణాటక స్పెషల్ ‘చికెన్ లివర్ ఫ్రై’ సీక్రెట్ రెసిపీ ఇదే!

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియుల ఇళ్లలో రకరకాల వంటకాల ఘుమఘుమలు మొదలవుతాయి. సాధారణంగా చికెన్ కర్రీ, ఫ్రైస్ అందరూ చేసుకునేవే. కానీ, చికెన్ లివర్ (కాలేజా) ఇష్టపడే వారి కోసం కర్ణాటక పల్లెటూరి శైలిలో చేసే 'నాటి స్టైల్ చికెన్ లివర్ ఫ్రై' ఒక అద్భుతమైన వంటకం. దీనిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం..

Chicken Liver Fry: ముక్క ముక్కలో నాటు స్టైల్ ఘాటు.. కర్ణాటక స్పెషల్ చికెన్ లివర్ ఫ్రై సీక్రెట్ రెసిపీ ఇదే!
Naati Style Chicken Liver Fry

Updated on: Jul 17, 2026 | 7:38 PM

మిరియాల ఘాటు, తాజా మసాలాల సువాసనలతో డ్రైగా తయారుచేసే ఈ వంటకం అన్నంలోకి సైడ్ డిష్‌గా లేదా వేడివేడిగా తిరడానికి స్టార్టర్‌గా అద్భుతంగా ఉంటుంది. చికెన్ లివర్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి, దానిని సరైన పద్ధతిలో వండకపోతే ముక్క చెదిరిపోయే ప్రమాదం ఉంది. మరి ముక్క గట్టిపడకుండా, జ్యుసీగా పక్కా కర్ణాటక నాటి స్టైల్ ఫ్లేవర్‌తో ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.

1. కావలసిన పదార్థాలు:

చికెన్ లివర్ (అర కిలో), సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర.

స్పెషల్ మసాలా కోసం: ధనియాలు, జీలకర్ర, ఎక్కువ మొత్తంలో మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు, కొద్దిగా నిమ్మరసం.

2. కడగడంలో జాగ్రత్తలు
చికెన్ లివర్‌ను శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటిలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి రెండు మూడు సార్లు మెల్లగా కడగాలి. దీనివల్ల లివర్‌లో ఉండే ఒక రకమైన నీచు వాసన పూర్తిగా తొలగిపోతుంది. కడిగిన తర్వాత నీరంతా పోయేలా పక్కన పెట్టుకోవాలి.

3. మసాలా పొడి తయారీ:

బాండీలో నూనె లేకుండా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్కను దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కాస్త బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. నాటి స్టైల్ వంటకాలకు మిరియాల ఘాటే ప్రధాన ఆకర్షణ.

4. వండే పద్ధతి
కడాయిలో 3-4 స్పూన్ల నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.

ఆ తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయాక, శుభ్రం చేసి పెట్టుకున్న లివర్ ముక్కలను, పసుపు, తగినంత ఉప్పు వేసి మితమైన మంటపై బాగా కలపాలి.

లివర్ ముక్కల నుండి నీరు ఊరుతుంది. ఆ నీటితోనే ముక్కలను 5 నుండి 8 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. లివర్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ సేపు ఉడికిస్తే ముక్క గట్టిగా రబ్బర్లా అయిపోతుంది.

నీరంతా ఇంకిపోతున్న సమయంలో మనం ముందుగా సిద్ధం చేసుకున్న స్పెషల్ నాటి మసాలా పొడిని వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. లో-ఫ్లేమ్‌లో మరో 3-4 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి.

చివరగా కొద్దిగా నిమ్మరసం పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని దించుకుంటే నోరూరుంచే కర్ణాటక నాటి స్టైల్ చికెన్ లివర్ ఫ్రై రెడీ.

Follow Us