సాయంత్రం అయ్యిందంటే.. వేడి వేడిగా పొట్టలో ఏదో ఒకటి పడాల్సిందే. లేకుంటే.. ఏదో వెలితిగా అనిపిస్తుంది. కొంత మంది ఇంట్లో వేసుకుని తింటే.. మరి కొంత మంది బయట ఫుడ్ తింటారు. ఇలా ఈవినింగ్ స్నాక్స్ లో శనగపప్పుతో చేసే మసాలా వడలు ఒకటి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మూడు రకాల పప్పులతో తయారు చేసే ఈ మసాలా వడలు ఒక్కసారి తింటే.. అస్సలు వదిలి పెట్టరు. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వంటివి కలిపితే అబ్బో సూపర్ అంతే. మరి ఈ వడలను ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగ పప్పు, మినప్పప్పు, కంది పప్పు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, కొత్తి మీర, ఉల్లి పాయలు, ఉప్పు, పుదీనా, ఆయిల్.
శనగ పప్పు, మినప్పప్పు, కంది పప్పులను విడివిడిగా కడిగి, ఓ నాలుగు గంటల పాటు నానబెట్టాలి. అవి బాగా నానాక మిక్సీ జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేయాలి. వీటిల్లోనే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని.. ఓ పాత్రలో తీసుకోండి. ఇందులో ఇప్పుడు పచ్చి మిర్చి, ఉల్లి పాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకుని వేసి బాగా కలుపు కోవాలి. కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకుంటే బావుంటాయి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసి వేడి చేయాలి. ఈ ఆయిల్ వేడెక్కాక.. పప్పు మిశ్రమాన్ని వడల మాదిరిగా చేసుకుని.. నూనె లో వేసు కోవాలి. మీడియం మంటపై రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడలు సిద్ధం. వీటిని పుదీనా చట్నీతో కానీ.. టమాటా సాస్ తో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. వీకెండ్స్, ఏదైనా స్పెషల్ డేల్ ఇలా తయారు చేసుకుని తింటే.. చాలా బావుంటాయి. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.