గుడ్లు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు..

ఆరోగ్యంగా ఉండాలన్నా, బాడీకి మంచి ప్రొటీన్ అందాలన్నా చాలా మంది రోజూ తినే ఏకైక సూపర్ ఫుడ్.. గుడ్డు. చిన్న పిల్లల నుండి ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎగ్స్ తినడానికి ఇష్టపడతారు. అయితే మనకు నచ్చినట్టు తింటే లాభం కంటే నష్టమే ఎక్కువ అని మీకు తెలుసా? చాలా మంది గుడ్ల విషయంలో చేస్తున్న రెండు తప్పులు ఏంటో తెలుసుకుందాం..

గుడ్లు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు..
How To Eat Eggs The Right Way

Updated on: May 18, 2026 | 7:10 AM

గుడ్లు పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్. ముఖ్యంగా బాడీ బిల్డింగ్ చేసేవారికి, ఫిట్‌నెస్ లవర్స్‌కు, సామాన్యులకు ఇది ప్రోటీన్‌కు అత్యుత్తమమైన, చౌకైన మూలం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుండి వర్కవుట్ డైట్ వరకు చాలా మంది తమ రోజువారీ ఆహారంలో గుడ్లను ఒక భాగం చేసుకుంటారు. అయితే మనలో చాలా మందికి గుడ్లను సరైన పద్ధతిలో ఎలా తినాలో తెలియదు. దీనివల్ల తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ, శరీరానికి అందాల్సిన సరైన పోషణను దూరం చేసుకుంటున్నారు. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుడ్లను సరైన పరిమాణంలో, సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడు మాత్రమే అవి శరీరానికి పూర్తి ప్రయోజనాలను అందిస్తాయి. లేదంటే ఆ అలవాట్లు గుడ్డులోని పోషక విలువలను తగ్గించడమే కాకుండా జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. అందుకే గుడ్లు తినేటప్పుడు ప్రతి ఒక్కరూ నివారించాల్సిన ఆ రెండు ప్రధాన తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

గుడ్లు.. పోషకాల గని

ప్రముఖ పోషకాహార నిపుణురాలు శాలిని వివరిస్తున్న దాని ప్రకారం.. ఒకే ఒక్క గుడ్డులో సుమారు 7 గ్రాముల హై-క్వాలిటీ ప్రోటీన్ లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ ఎ, బి, బి12, ఫోలేట్, సెలీనియం, బాడీకి అవసరమయ్యే అనేక రకాల సూక్ష్మపోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అయితే మనం చేసే ఈ రెండు పొరపాట్లు ఆ పోషకాలను నాశనం చేస్తాయి.

గుడ్లు తినేటప్పుడు చేసే 2 ప్రధాన తప్పులు..

తప్పు 1: పచ్చసొనను పూర్తిగా పక్కన పెట్టేయడం

చాలా మంది బరువు పెరుగుతామనే భయంతో లేదా కొలెస్ట్రాల్ వస్తుందని గుడ్డులోని పచ్చసొనను పారేసి, కేవలం తెల్లసొన మాత్రమే తింటారు. నిపుణుల ప్రకారం ఇది పెద్ద తప్పు. గుడ్డులోని ప్రధానమైన సూక్ష్మపోషకాలు, విటమిన్లు అన్నీ ఆ పచ్చసొనలోనే దాగి ఉంటాయి. కాబట్టి శరీరానికి సంపూర్ణ పోషణ అందాలంటే పచ్చసొనను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.

తప్పు 2: అతిగా తినడం

గుడ్లు ఆరోగ్యానికి మంచివి కదా అని రోజుకు ఐదారు గుడ్లను విపరీతంగా తినేస్తుంటారు. దీనివల్ల శరీరంలో అవసరానికి మించి క్యాలరీలు, కొవ్వు పేరుకుపోయి బరువు పెరగడం, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

తెల్లసొన Vs పచ్చసొన: ఏది ఎక్కువ ప్రయోజనకరం..?

గుడ్డులోని రెండు భాగాలకూ వాటి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది:

తెల్లసొన: ఇందులో కేవలం ప్యూర్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి, బరువు నియంత్రణలో ఉంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. ఇందులో ఫ్యాట్ అస్సలు ఉండదు.

పచ్చసొన: ఇందులో హెల్తీ ఫ్యాట్స్, కీలకమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది మెదడు పనితీరుకు, హార్మోన్ల సమతుల్యతకు, శరీరానికి సంపూర్ణ శక్తిని ఇవ్వడానికి అవసరం.

ఒక రోజులో ఎన్ని గుడ్లు తినడం సురక్షితం?

పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారు: మీరు ఎలాంటి జబ్బులు లేకుండా పర్ఫెక్ట్ హెల్త్‌తో ఉంటే రోజుకు 1 నుండి 2 సంపూర్ణ గుడ్లను హ్యాపీగా తినవచ్చు. ప్రొటీన్ ఎక్కువ కావాలనుకుంటే తెల్లసొనల సంఖ్యను పెంచుకోవచ్చు.

బరువు తగ్గేవారు – కొలెస్ట్రాల్ ఉన్నవారు: ఒకవేళ మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా లేదా గుండె జబ్బులు, హై కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నా.. వైద్యుల సలహా మేరకు పచ్చసొనను వారానికి రెండు లేదా మూడు సార్లకే పరిమితం చేసి రోజువారీగా 1 లేదా 2 గుడ్ల తెల్లసొనను మాత్రమే తీసుకోవడం సురక్షితం.

Follow Us