Protein Day 2022: జన్యు మార్పిడి చేసిన ఆహారం ఇప్పుడు అభివృద్ది చెందుతున్న దేశాలకు చాలా అవసరం. పోషకాహార భద్రతను సాధించడంలో ఇది కీలకంగా ఉంటుంది. ప్రపంచ దేశాలు ఎదుర్కుంటున్న సవాళ్ళలో ఆకలి అతి పెద్ద సవాలుగా ఉంది. వేగంగా పెరుగుతున్న జనాభాతో ఈ సమస్య రోజు రోజుకూ తీవ్రతరమవుతోంది. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం, 2020లో 2.37 బిలియన్ల మంది ప్రజలకు ఆకలి తీర్చుకోవడానికి తిండి గింజలు లేవు లేదా ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం లభించడం లేదు. ఇందులో విచిత్రమైన విషయం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ ఆకలితో అలమటిస్తున్న జనాభా పరిమాణం పెరుగుతుండటం. అటువంటి పరిస్థితిలో, 2030 నాటికి ఆహార రహిత ‘జీరో-హంగర్’ లక్ష్యాన్ని సాధించడంలో జన్యుపరంగా మార్పు చేసిన (GM) పంటలు కీలకమైన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.
GM పంటలు మంచి దిగుబడి, చీడ పీడల నిరోధక లక్షణాల కోసం జన్యు ఇంజనీరింగ్ ద్వారా మార్చబడిన మొక్కలు. ఇది రైతులు మెరుగైన పంట దిగుబడి సాధించడంతో పాటు స్థానిక ప్రతికూల పర్యావరణ పరిస్థితులను తట్టుకోవడంలో సహాయపడుతుంది. కొన్ని GM పంటలు పోషకాహారం, విటమిన్లు, ఖనిజాలను పెంచడానికి కూడా రూపొందాయి. ఇవి పిల్లల్లో పోషకాహార లోపం, కుంగుబాటు వంటి సవాళ్లను అధిగమించడంలో సహాయపడతాయి.
భారతదేశంలో కూడా పోషకాహార లోప సమస్యలను ఎదుర్కోవటానికి GM పంటలు ఉపయోగకరంగా ఉండవచ్చు. RTI ద్వారా అడిగిన ఒక ప్రశ్నకు ఇటీవల కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ జవాబిచ్చింది. దీని ప్రకారం భారతదేశంలో 33 లక్షల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వారిలో సగానికి పైగా పిల్లలు తీవ్రమైన కేటగిరీలో ఉన్నారని వెల్లడించింది. నాణ్యమైన, పౌష్టికాహారాన్ని ఉత్పత్తి చేసేందుకు భారతదేశం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
‘మన ఆహారోత్పత్తి, నాణ్యతను పెంచడానికి సాంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తున్నప్పటికీ, ప్రస్తుతం మన ఆహారంలో నిర్దిష్ట ఖనిజాలు, పోషకాలను జోడించాలనుకుంటే.. గత 25 సంవత్సరాలుగా ప్రపంచం విశ్వసిస్తున్న జన్యు ఇంజనీరింగ్ అనే ఉపయోగకరమైన సాంకేతికతను మనం ఆశ్రయించవచ్చు’ అని ప్రముఖ ప్లాంట్ బయోటెక్నాలజిస్ట్, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ మాజీ డైరెక్టర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ప్రొఫెసర్ KC బన్సల్ చెప్పారు.
జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన పంటలు లేదా GMOలు మొదటిసారిగా 1996లో అమెరికాలో సాగుచేశారు. ISAAA (ఇంటర్నేషనల్ సర్వీస్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ అగ్రి-బయోటెక్ అప్లికేషన్స్) నివేధిక ప్రకారం 2019లో 29 దేశాలలోని దాదాపు 17 మిలియన్ల మంది రైతులు 190 మిలియన్ హెక్టార్లకు పైగా GM పంటలు వేశారు.
అయినప్పటికీ, GM విత్తనాలు ఇప్పటికీ ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలలో పెద్ద సంస్థల చేతుల్లోనే తయారవుతున్నాయి. పేద – అభివృద్ధి చెందుతున్న దేశాలలో వారి పోషకాహార సవాళ్లను ఎదుర్కోవటానికి GM పంటల అవసరం ఎంతో ఉంది. ఈ దేశాలలో ఈ కొత్త సాంకేతికత లేదా GM విత్తనాలను ఉపయోగించడం చాలా తక్కువ. అంతేకాకుండా, పర్యావరణ ప్రభావం, స్థానిక పంట రకాలు భద్రత, ఆరోగ్య సమస్యలపై ఉన్న ఆందోళనలు GM విత్తనాల విషయంలో ఈ దేశాలు వెనకడుగు వేయడానికి కారణాలుగా చెప్పవచ్చు. అత్తెకాకుండా ఈ పంటల నిరోధక నిబంధనలు కూడా GM పంటలను ఈ దేశాలు విస్తృతంగా స్వీకరించడానికి ఆటంకం కలిగిస్తుంది.
‘ప్రస్తుతం, భారతదేశంలో Bt పత్తితో సహా ప్రపంచంలో దాదాపు 15 GM ఆహార పంటలు వాణిజ్యపరంగా సిద్ధం అవుతున్నాయి. జీఎం టెక్నాలజీతో పాటు జీనోమ్ ఎడిటింగ్ వంటి కొత్త టెక్నాలజీలను కూడా భారత్ పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సాంకేతికతలు కలిసిన ఆహార పదార్థాల పోషక విలువలను మరింత ప్రభావవంతంగా మెరుగుపరచడంలో సహాయపడతాయి’ అని ప్రొఫెసర్ బన్సల్ చెప్పారు.
భారతదేశంలోని రైతులు వాతావరణ మార్పు, తగ్గిపోతున్న నీటి వనరులు, భూమి వనరుల నుంచి ఉత్పన్నమయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో GM పంటలు సహాయపడతాయి.
‘వాతావరణ మార్పుల కారణంగా మన భూ వనరులు, నీటి వనరులు తగ్గిపోతున్నాయి. అందువల్ల, జన్యు సవరణ వంటి సాంకేతికతలను ఉపయోగించడం గతంలో కంటే ఇప్పుడు మనకు చాలా ముఖ్యమైనది. అస్థిర వాతావరణ పరిస్థితులను తట్టుకోగల, పెరగడానికి తక్కువ నీరు, నేల వనరులు అవసరమయ్యే మరింత స్థితిస్థాపక పంటలను ఉత్పత్తి చేయడంలో GM సహాయపడుతుంది’ అని ప్రొఫెసర్ బన్సల్ స్పష్టంగా చెబుతున్నారు.
వాస్తవానికి GM పంటలు మనం జీవిస్తున్న ఈ గందరగోళ సమయాల్లో ఆహార సురక్షిత భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తాయనేది పలువురు నిపుణుల మాట.