
ప్రయాణం అంటే కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడం మాత్రమే కాదు. మనసుకు నూతనోత్తేజాన్ని, జీవితానికి మధుర జ్ఞాపకాలను అందించే ఒక అద్భుతమైన అనుభూతి. ఈ ఉరుకులు పరుగులు జీవితం, పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకుని.. కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులను చూడడం వల్ల మనసు ఎంతో తేలికపడుతుంది. అందులోనూ చలికాలంలో చేసే ప్రయాణాలకు ఉండే అందమే వేరు. మంచు దుప్పటి కప్పుకున్న పచ్చని కొండలు, పొగమంచుతో నిండిన లోయలు.. చల్లని పిల్లగాలుల మధ్య ప్రయాణించడం ఎవరికైనా స్వర్గధామంలా అనిపిస్తుంది.
ముఖ్యంగా ఎండ వేడిమి, ఉక్కపోత ఉండవు కనుక పగటిపూట కూడా ఏమాత్రం అలసట లేకుండా ఎక్కువ ప్రదేశాలను హాయిగా చుట్టేయవచ్చు. ముఖ్యంగా అరకు, లంబసింగి, ఊటీ, మున్నార్, కూర్గ్ లేదా హిమాలయ ప్రాంతాల్లో వింటర్ అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. వెచ్చని స్వెటర్లు ధరించి, రాత్రివేళ చలిమంటల పక్కన కూర్చుని వేడివేడి కాఫీ సిప్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తే ఉంటుంది.. అది మాటలకు అందని.. అక్షరాలతో వర్ణించలేని ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అయితే ట్రిప్స్ కి వెళ్లాలంటే ఎక్కువగా విమానం, ట్రైన్, బస్ లలో వెళ్తూ ఉంటారు. అలా కాకుండా డ్రైవ్ చేసుకుంటూ కారులో రోడ్ ట్రిప్ వెళితే వచ్చే మజా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలాంటి వారి కోసమే ఈ చలికాలంలో స్వర్గంలో విహరించేలా ఉండే బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఏవో తెలుసుకుందాం..
1.ఢిల్లీ-సిమ్లా-కిన్నౌర్-స్పితి..
స్పితి వ్యాలీ నిస్సందేహంగా భారతదేశంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ఇది చాలా మంది వీక్షించాలి అనుకునే డ్రీమ్ ప్లేస్. మీరు స్పితి వ్యాలీని సందర్శించాలనుకునే వారిలో ఒకరు అయితే, ఢిల్లీ నుండి సిమ్లా, కిన్నౌర్ మీదుగా స్పితి వ్యాలీకి రోడ్ ట్రిప్ చేయడం ఉత్తమం. ప్రయాణంలో అద్భుతమైన ధంకర్, చంద్రతాల్ సరస్సులను కూడా చూడవచ్చు. NH3 హైవే గుండా 730 కి.మీ ప్రయాణించడానికి మీకు దాదాపు 17 గంటల సమయం పడుతుంది.
2.ఢిల్లీ-చోప్తా..
చోప్తా వ్యాలీ ఢిల్లీ నుండి 403 కి.మీ దూరంలో ఉంది. రోడ్డు ప్రయాణాలకు సులభంగా చేరుకోవచ్చు. ఈ ప్రదేశానికి రోడ్డు మార్గంలో ప్రయాణించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 8790 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడికి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉండగా.. వాటిలో ఒకటి సోనిపట్, ముజఫర్నగర్, రూర్కీ, హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్ మీదుగా వెళ్తుంది. మరొకటి ఘజియాబాద్, సోనిపట్, ముజఫర్నగర్, రూర్కీ, హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్ మీదుగా ఉంటుంది.
3.లక్నో-మున్సియారి..
మున్సియరి సముద్ర మట్టానికి 7540 అడుగుల ఎత్తులో ఉంది. లక్నో నుండి ప్రారంభమై ఈ ప్రదేశానికి వెళ్ళే మార్గంలో అద్భుతమైన పర్వతాలు, లోయలను చూడొచ్చు. NH7 హైవే ద్వారా 568 కి.మీ ప్రయాణించడానికి మీకు దాదాపు 14 గంటల సమయం పడుతుంది.
4. అమృత్సర్-భర్మూర్
ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి పర్వతాలు ఉత్తమమైన ప్రదేశం. అమృత్సర్ మీదుగా హిమాచల్ ప్రదేశ్లోని భర్మోర్కు వెళ్లవచ్చు. ఈ రోడ్ ట్రిప్ లో తోటలు, వ్యవసాయ క్షేత్రాలు మీకు స్వాగతం పలుకుతాయి.