
కేరళ: అందంగా కనిపించాలనే ఆశతో సోషల్ మీడియా ప్రకటనలను నమ్మి సౌందర్య ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ ఘటన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారాన్ని నమ్మి ఆన్లైన్లో ఫెయిర్‌నెస్ క్రీమ్ కొనుగోలు చేసి ఉపయోగించిన 17 ఏళ్ల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. చివరకు ఆమెకు ప్రమాదకరమైన కిడ్నీ వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మలప్పురానికి చెందిన బాలిక మొటిమలు, నల్ల మచ్చలు, చర్మంపై పిగ్మెంటేషన్ తొలగిపోతాయంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేసిన వీడియోలను చూసింది. వాటిలో ఇచ్చిన వాట్సాప్ నంబర్ ద్వారా విక్రేతలను సంప్రదించి ఫెయిర్‌నెస్ క్రీమ్ ఆర్డర్ చేసింది. మొదట్లో మంచి ఫలితాలు కనిపించడంతో దాదాపు ఏడాది పాటు ఆ ఉత్పత్తిని ఉపయోగించింది. ఆ తర్వాత కూడా పలుమార్లు కొత్త సీసాలు కొనుగోలు చేసింది.
అయితే కొంతకాలానికి ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. రక్తపోటు పడిపోవడం, స్పృహ కోల్పోవడం, కాళ్లకు తీవ్రమైన వాపు రావడం వంటి లక్షణాలు కనిపించాయి. వాపు కారణంగా నడవడానికి, మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను మలప్పురంలోని ఆస్టర్ మిమ్స్ మదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె శరీరంలో పాదరసం (మెర్క్యురీ) ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గౌరీ ఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలికకు మెంబ్రేనస్ నెఫ్రోపతీ అనే తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. క్రీమ్‌లోని పాదరసం కిడ్నీలలోని వడపోత వ్యవస్థను దెబ్బతీసినట్లు వైద్య పరిశోధనల్లో వెల్లడైంది.
ఆ క్రీమ్‌పై నిర్వహించిన పరీక్షల్లో పాదరసం స్థాయి మిలియన్‌కు 12,500 భాగాలు (12,500 ppm) ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా అనుమతించదగిన స్థాయి మిలియన్‌కు ఒక భాగం కంటే తక్కువగా ఉండాలి. అంటే ఆ ఉత్పత్తిలో ప్రమాదకర స్థాయిలో పాదరసం ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై బాలిక కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరోగ్య సమస్యల గురించి కంపెనీకి ఫిర్యాదు చేసినా సరైన స్పందన రాలేదని బాలిక తెలిపింది. దీంతో సదరు సంస్థపై వినియోగదారుల కోర్టులో న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబం నిర్ణయించింది. విచారణ, న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో క్రీమ్ పేరు వెల్లడించలేదు.
ఈ సందర్భంగా వైద్యులు కీలక హెచ్చరిక చేశారు. చర్మం తెల్లగా మారుతుందని, కొద్ది రోజుల్లోనే మచ్చలు తొలగిపోతాయని చెప్పే సోషల్ మీడియా ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. చర్మ సమస్యలు ఉంటే నిపుణులైన డెర్మటాలజిస్టులను సంప్రదించాలని కోరారు. అందం కోసం చేసే చిన్న పొరపాటు ప్రాణాలకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..