Pawan Kalyan: 10వ తరగతి పరీక్షల నిర్వహణ మూర్ఖత్వమే..ఎగ్జామ్స్ రద్దుకు పవన్ డిమాండ్

కరోనా ఉధృతిలో పదో తరగతి పరీక్షలు నిర్వహణ మూర్ఖత్వమే అవుతుందంటూ ఏపీ సర్కార్ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. లక్షలాది విద్యార్థులతో పాటు వారి కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టేస్తున్నారని అభ్యంతరం తెలిపారు.

  • Janardhan Veluru
  • Publish Date - 12:14 pm, Tue, 20 April 21
Pawan Kalyan: 10వ తరగతి పరీక్షల నిర్వహణ మూర్ఖత్వమే..ఎగ్జామ్స్ రద్దుకు పవన్ డిమాండ్
ప్రతీకాత్మక చిత్రం

కరోనా ఉధృతిలో పదో తరగతి పరీక్షలు నిర్వహణ మూర్ఖత్వమే అవుతుందంటూ ఏపీ సర్కార్ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. లక్షలాది విద్యార్థులతో పాటు వారి కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి ప్రమోట్ చేసిందని…ఒక్క ఏపీ సర్కారుకు మాత్రమే మిలిట్రీ నియామకాలు ఇబ్బంది వచ్చిందా? అని ప్రశ్నించారు. తక్షణమే 10 తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసి…పై తరగతులకు ప్రమోట్ చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

కరోనా బారినపడి విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేసిన పత్రికా ప్రకటన పూర్తి సారాంశం….

‘‘కరోనా తీవ్రత వల్ల ఆరోగ్య విపత్తు తలెత్తి ప్రజలందరూ తీవ్ర భయాందోళనలో ఉంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందాన వ్యవహరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు. అదే విధంగా అనేక జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, వాటి హాస్టళ్లలో ఉన్నవారు ఈ వైరస్ సోకి ఇబ్బందులుపడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాను చెప్పిన షెడ్యూల్ ప్రకారమే 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడం ప్రభుత్వ మూర్ఖత్వ పోకడ అని అర్థం అవుతోంది.
45ఏళ్ళు దాటినవారు… దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు… వృద్ధులు… చిన్నారులను కరోనా ముప్పు నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి అని వైద్య నిపుణులు పదేపదే చెబుతూ ఉన్నారు. ఎటువంటి లక్షణాలు చూపించకుండా కరోనా వైరస్ మానవాళిపై దాడి చేస్తుంటే – పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు క్లాసులు, పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం పాలకులకు ప్రజల యోగక్షేమాలు, ఆరోగ్యంపై ఏ మాత్రం బాధ్యత లేకపోవడమే అవుతుంది. తరగతులు, పరీక్షల కోసం వెళ్ళి వచ్చే విద్యార్థుల ద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది. పదో తరగతికి 6.4 లక్షల మంది, ఇంటర్మీడియెట్ కు 10.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అంటే సుమారుగా 16.5 లక్షల మందిని, వారి కుటుంబాలను ప్రభుత్వం నేరుగా కరోనా ముప్పులోకి గెంటి వేస్తున్నట్లే. ఆ విద్యార్థుల కుటుంబాల్లో 45ఏళ్ళు పైబడినవారు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉంటారు. వారందరినీ కరోనా చుట్టుముడితే బాధ్యత ఎవరు తీసుకుంటారు?

Pawan Kalyan

Pawan Kalyan(File Photo)

పరీక్షల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోతే మిలట్రీ ఉద్యోగాలు కోల్పోతారు అనడం అర్థరహితం. ఇప్పటికే సి.బి.ఎస్.ఈ. 10వ తరగతి పరీక్షలు రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పొరుగున తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పరీక్షలు రద్దు చేసింది.

సి.బి.ఎస్.ఈ., తెలంగాణ విద్యార్థులకు లేని ఇబ్బదులు ఏపీలో ఎందుకు తలెత్తుతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 2020లో 10వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన సర్టిఫికెట్స్ జారీలో రాష్ట్ర విద్యా శాఖ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకొనేందుకే ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ అందరినీ ఇబ్బందులు పాల్జేస్తున్నారు. గత తప్పిదాలను సరిదిద్దుకోకపోగా మరిన్ని తప్పులు చేసి ప్రజలను కరోనా ముంగిట నిలబెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 11వ తరగతి, తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో నిర్ణయం తీసుకోవాలి. 10వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను తక్షణమే రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్ చేయాలి.

కరోనా సెకండ్ వేవ్ విషయంలో ప్రభుత్వ యంత్రాంగాల్లో సన్నద్ధత, ప్రణాళిక తగిన విధంగా లేవు. కరోన సెకండ్ వేవ్ విషయంలో ప్రజలను మరింతగా అప్రమత్తం చేయలేకపోయాయి. ఫలితంగా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతూ మందుల కొరత, ఆక్సిజన్ నిల్వలు లేకపోవడం నుంచి ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా అందుబాటులో లేకుండాపోయాయి. ఇలాంటి ఆరోగ్య విపత్తు తలెత్తినప్పుడు ప్రభుత్వం మరింత బాధ్యతగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి ఉండగా- విద్యార్థులకు పరీక్షలుపెడతాం, తరగతులకు రావాలి, ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు ఇస్తామనడం మరింత ఉత్పాతాన్ని సృష్టించడమే అవుతుంది’’.

(పవన్ కల్యాణ్)