శ్రీశైల క్షేత్రంలో భారీ కుంభకోణం.. కోట్లలో ఎగనామం..

మహిమాన్విత జ్యోతిర్లింగం, శక్తి పీఠం కొలువైన పవిత్ర శ్రీశైలం క్షేత్రంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొంతమంది అక్రమార్కులు భక్తుల సొమ్ములు కాజేశారు. 150 రూపాయల శీఘ్ర దర్శనం కౌంటర్లో

  • Tv9 Telugu
  • Publish Date - 12:33 pm, Mon, 25 May 20
శ్రీశైల క్షేత్రంలో భారీ కుంభకోణం.. కోట్లలో ఎగనామం..

Srisailam Temple: మహిమాన్విత జ్యోతిర్లింగం, శక్తి పీఠం కొలువైన పవిత్ర శ్రీశైల క్షేత్రంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొంతమంది అక్రమార్కులు భక్తుల సొమ్ములు కాజేశారు. 150 రూపాయల శీఘ్ర దర్శనం కౌంటర్లో కోటి 80 లక్షల రూపాయలు మాయమయ్యాయి. పదిహేను వందల రూపాయల అభిషేకం టికెట్లలో 50 లక్షలు మాయమయ్యాయి. డొనేషన్స్ కౌంటర్లలో కోటి రూపాయల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. వసతి సదుపాయం కౌంటర్లో 50 లక్షల అవినీతి జరిగింది.

టోల్ గేట్ పెట్రోల్ బంకుల నిర్వహణలో మరో రూ.40 లక్షలు, 500 రూపాయల టిక్కెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్లలో మరో 50 లక్షల రూపాయలు దుర్వినియోగం జరిగింది. అవినీతికి పాల్పడ్డ అక్రమార్కులు ఏకంగా సాఫ్ట్‌వేర్‌ నే మార్చేశారు. అభియోగం తమ మీదికి రాకుండా సదరు అక్రమార్కులు టికెట్ కౌంటర్లలో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారు.

అయితే.. ఒక్కొక్కటిగా అవినీతి బయట పడడంతో ఒకరిపై ఒకరు ఈవోకు పిటిషన్లు పెట్టుకున్నారు. తీగలాగితే డొంక కదిలిన చందంగా కోట్ల రూపాయల అక్రమాలు బట్టబయలు చేశారు ఆలయ ఈవో రామారావు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయ ఈవో కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. ‘భారీ ఎత్తున అవినీతి జరిగింది వాస్తవమే. మొత్తం ఎంత జరిగింది అనేదానిపై ఇంకా పూర్తి నివేదిక రాలేదు.. రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నాం. ప్రభుత్వానికి కూడా నివేదిక తయారు చేస్తున్నాం’ అని తెలిపారు.