జెసికి షాక్ మీద షాక్.. కథ కంచికేనా?

అనంతపురం జిల్లా రాజకీయాలను.. మరీ ముఖ్యంగా తాడిపత్రి ప్రాంతాన్ని ఏకచ్ఛాద్రిపత్యంగా శాసించిన జెసి బ్రదర్స్ శకం ఇక ముగిసినట్లేనా? జరుగుతున్న పరిణమాలను చూస్తే అవుననే అంటున్నారు అనంత జిల్లా వాసులు. ఆయన అనుచరులదీ ఇదే అభిప్రాయం కావడం పరిస్థితిలో తీవ్రతను సూచిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుందంటే జెసి బ్రదర్స్.. టిడిపి అధికారంలో వుందంటే పరిటాల కుటుంబం అనంతపురం జిల్లా రాజకీయాలను శాసించే వారు. పరిటాల రవి మరణం తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. […]

జెసికి షాక్ మీద షాక్.. కథ కంచికేనా?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 21, 2019 | 9:30 PM

అనంతపురం జిల్లా రాజకీయాలను.. మరీ ముఖ్యంగా తాడిపత్రి ప్రాంతాన్ని ఏకచ్ఛాద్రిపత్యంగా శాసించిన జెసి బ్రదర్స్ శకం ఇక ముగిసినట్లేనా? జరుగుతున్న పరిణమాలను చూస్తే అవుననే అంటున్నారు అనంత జిల్లా వాసులు. ఆయన అనుచరులదీ ఇదే అభిప్రాయం కావడం పరిస్థితిలో తీవ్రతను సూచిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుందంటే జెసి బ్రదర్స్.. టిడిపి అధికారంలో వుందంటే పరిటాల కుటుంబం అనంతపురం జిల్లా రాజకీయాలను శాసించే వారు.

పరిటాల రవి మరణం తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. 2004-2014 మధ్య కాలంలో జెసి బ్రదర్స్ ఒంటిచేత్తో జిల్లా రాజకీయాలను శాసించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలలో జెసి బ్రదర్స్ తెలుగుదేశం పార్టీలో చేరాక కూడా జిల్లా మీద ఎంతో కొంత పట్టు కొనసాగించారు. ముఖ్యంగా తాడిపత్రి ప్రాంతంపై ఎవరు పెద్దరికం చేయకుండా జెసి బ్రదర్స్ కాపాడుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైనట్లు కనిపిస్తోంది.

గత రెండు నెలలుగా జెసి ఆర్థిక మూలాలకు కేంద్ర బిందువైన దివాకర్ ట్రావెల్స్ బస్సులు ఒక్కటొక్కటే సీజ్ అవుతున్నాయి. పాత వాహనాలు షెడ్డుకు చేరుకుంటున్నాయి. ఫలితంగా దివాకర్ ట్రావెల్స్ ఆల్‌మోస్ట్‌ మూతపడిన పరిస్థితి. ట్రావెల్స్‌పై ఆర్టీఏ దాడుల్లో పొలిటికల్ కోణం వుందని జెసి బ్రదర్స్ పలుమార్లు ఆరోపించారు. అధికార వైసీపీ నేతలు తన వ్యాపారాలను మూసి వేయించేందుకు కంకణం కట్టుకున్నారని జెసి దివాకర్ రెడ్డి ఇటు అనంతలోను, అటు అమరావతిలోను పలు సందర్భాలలో ఆరోపణలు గుప్పించారు. ఒక దశలో చేసేదేమీ లేక వాపోయినంత పని చేశారు.

జెసి బ్రదర్స్ పతనం ఇంతటితో ఆగలేదు. ఆర్థిక మూలాలు కుచించుకుపోతున్న తరుణంలోనే జెసి బ్రదర్స్‌కు వారి అనుచరులు షాకివ్వడం మొదలు పెట్టారు. ఒక్కొక్కరే వరుసగా టిడిపిని వీడి వైసీపీలోకి చేరిపోతున్నారు. జెసి బ్రదర్స్‌కు మైనారిటీల్లో ఎంతో కొంత ప్రాభవం వుందంటే ఆయన దగ్గరున్న ముస్లిం నేతలే దానికి కారణం. అలాంటిది.. జెసి అనుచరుల్లో గోరా, షబ్బీర్ తదితరులు ఇటీవల ఆయనకు షాకిచ్చి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు అదే బాటలో వున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఇలా ఒకవైపు ఆర్థిక మూలాలు తరిగిపోతుండడం, మరోవైపు అనుచరులు ఎవరి దారి వారు చూసుకుంటూ వుండడం.. ఇంకో వైపు ముంచుకొస్తున్న వృద్ధాప్యం.. వెరసి అనంత రాజకీయాల్లో జెసి శకం ఇక ముగిసినట్లేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి జెసి బ్రదర్స్ తదుపరి వ్యూహాలేంటో ? తర్వాత తరాన్ని రాజకీయంగా ఎలా ప్రమోట్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే.