Amma Vodi: ‘జగనన్న అమ్మ ఒడి.. పిల్లల చదువుల బడి..’ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరు బహిరంగ సభ లైవ్ అప్డేట్స్

 • Venkata Narayana
 • Publish Date - 3:45 pm, Mon, 11 January 21
Amma Vodi: 'జగనన్న అమ్మ ఒడి.. పిల్లల చదువుల బడి..' ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరు బహిరంగ సభ లైవ్ అప్డేట్స్

Jagananna Amma Vodi Scheme: ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద రెండో ఏడాది నిధుల చెల్లింపులు ఇవాళ ఏపీ సర్కారు షురూ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో 15 వేల రూపాయల చొప్పున రూ.6,673 కోట్లు జమ చేస్తున్నారు. నెల్లూరులో జరుగుతోన్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంఫ్యూటర్ బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు. ఈ సందర్భంగా నెల్లూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలివస్తున్నారు. ఒకపక్క స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదలచేసి గ్రామీణ ప్రాంతాల్లో అమ్మఒడి పథకం ఆపాలని ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ జగన్ సర్కారు ముందుకెళ్తుండటం విశేషం. ఈ కార్యక్రమ లైవ్ అప్డేట్స్ ఈ దిగువున..

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 11 Jan 2021 15:45 PM (IST)

  ప్రజలకు మేలు జరుగుతుంటే ఓర్వలేక కడుపు మంటతో ఆలయాల ధ్వంసం : సీఎం జగన్

  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంటే ఓర్వలేక కడుపు మంటలో ఆలయాల ధ్వంసం వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు, శక్తుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాన్యులకు రక్షణ లేకుండా ఎన్నికలకు నిర్వహించాలంటున్నారని విమర్శించారు. విద్రోహ శక్తుల పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధిని చూసి ప్రతిపక్షాల్లో కడుపుమంట కనిపిస్తోందని సీఎం అన్నారు. దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, ఆ తర్వాత దేవాలయాల సందర్శన అంటున్నారని మండిపడ్డారు. “రథాలను తగలబెట్టి రథయాత్రలు చేస్తున్నారు.. సంక్షేమ పథకాల మంచి ప్రజలకు తెలియకూడదనే.. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు” అని సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు.

 • 11 Jan 2021 14:24 PM (IST)

  దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

  దేవుడిపై భక్తి లేనివాళ్లు ఆలయాల భూములను కాజేసిన వాళ్లు, ఆలయాల్లో క్షుద్రపూజలు చేసినవాళ్లు. ఇప్పుడు దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. “కోవిడ్‌కు భయపడి చంద్రబాబు, లోకేష్‌ హైదరాబాద్‌లో దాక్కుంటారు. సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా ఎన్నికలు నిర్వహించాలంటారు. పేదింటి మహిళలకు ఇళ్ల స్థలాలు అందకుండా కేసులు వేస్తున్నారు. వ్యవస్థలో ఉన్న కోవర్టులు కూడా ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు.” అని జగన్ అన్నారు. ఆలయాల్లో విగ్రహాలు పగలగొట్టారని, రాబోయే రోజుల్లో బడులపై విధ్వంసం సాగిస్తారేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

 • 11 Jan 2021 14:24 PM (IST)

  ఒక పద్దతి ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేశారు : సీఎం జగన్

  గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను ఒక క్రమ పద్దతి ప్రకారం నిర్వీర్యం చేశారని సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పేరుతో దోపిడీ జరిగేదన్నారు. పరిస్థితులను మార్చేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. పాఠశాలకు విద్యార్ధి రాకపోతే మొదటి రోజు ఫోన్‌లో మెసేజ్‌.. వరుసగా రెండు రోజులు రాకుంటే వాలంటీర్‌ నేరుగా ఇంటికొచ్చి విద్యార్ధి యోగక్షేమాలు తెలుసుకుంటారని వెల్లడించారు. పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చే బాధ్యత తల్లిదండ్రుల కమిటీలతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు, వాలంటీర్లపై ఉందన్నారు. రాబోయే మూడేళ్లలో వంద శాతం పిల్లలు బడిబాట పట్టేలా చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. పాఠశాలల్లో టాయిలెట్లు శుభ్రంగా లేకపోతే 1902 నంబర్‌కు ఫోన్ చేయొచ్చని, గ్రామ సచివాలయాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని సీఎం సూచించారు.

   

 • 11 Jan 2021 14:24 PM (IST)

  అంగన్‌వాడీ కేంద్రాల పేర్లు మారుస్తున్నాం : సీఎం జగన్

  అంగన్‌వాడీ కేంద్రాల పేర్లు మారబోతున్నాయని సీఎం జగన్ చెప్పారు. అంగన్ వాడీ కేంద్రాలను ఇకమీదట ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నామన్నారు. వైఎస్‌ఆర్ పీపీ-1, వైఎస్‌ఆర్ పీపీ-2, వైఎస్‌ఆర్ ప్రీ ఫస్ట్ క్లాస్‌గా కొనసాగుతాయని సీఎం పేర్కొన్నారు. అంతేకాదు, రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సేవలు అందిచడంతో పాటు అండర్ గ్రౌండ్‌ ఇంటర్నెట్ కేబుల్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు.

 • 11 Jan 2021 14:24 PM (IST)

  విద్యార్ధులకు ల్యాప్‌టాప్ ఆఫర్ : సీఎం జగన్

  విద్యార్ధులకు కంప్యూటర్ స్కిల్స్‌ పెంచేందుకు ల్యాప్‌టాప్ ఆఫర్ ప్రకటించారు సీఎం జగన్. వచ్చే ఏడాది నుంచి 9 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు ఈ అవకాశం ఉంటుందన్నారు. అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్‌టాప్‌ ఇస్తామని సీఎం వైఎస్ జగన్‌ తెలిపారు. 4 జీబీ ర్యామ్‌, 500 జీబీ హార్డ్‌డిస్క్‌, విండోస్ 10 ఓఎస్‌ ఫీచర్స్‌తో ల్యాప్‌టాప్‌ ఉంటుందన్నారు. మూడేళ్ల వారంటీతో కూడిన ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు అందిస్తామన్నారు.

 • 11 Jan 2021 14:23 PM (IST)

  అదనంగా 4 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు: సీఎం జగన్

  అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపిస్తే రూ.15వేలు సాయం అందించామని, వరుసగా రెండో ఏడాది కూడా అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. అమ్మఒడి రెండో విడత ద్వారా రూ.6,673 కోట్లు అందిస్తున్నామని, నేరుగా తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నామని చెప్పారు. ఫలితంగా అదనంగా 4 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని చెప్పుకొచ్చారు. కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు అందజేస్తున్నామని, గోరుముద్ద పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు.

 • 11 Jan 2021 14:23 PM (IST)

  అమ్మఒడి పథకం శ్రీరామ రక్ష : సీఎం జగన్

  చదువుల రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్కూలు ఫీజులు కట్టలేక చిన్నారుల్ని కూలిపనులకు పంపుతున్న సందర్భాల్ని చూశానని జగన్ అన్నారు. ఆ పరిస్థితుల్ని మార్చడానికే జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చామని జగన్ అన్నారు. నవరత్నాల హామీల్లో ఒకటైన ‘జగనన్న అమ్మ ఒడి’ రెండో ఏడాది చెల్లింపులను నెల్లూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సందర్భంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదవాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. అమ్మఒడి పథకం ద్వారా 45 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతి బిడ్డకు అమ్మఒడి శ్రీరామరక్ష అని, 19 నెలల పాలనలో చదువుల విప్లవం తీసుకొచ్చామని సీఎం పేర్కొన్నారు.

 • 11 Jan 2021 14:23 PM (IST)

  జగన్ మామ ఉన్నాడన్న ఆనందంలో రాష్ట్రంలోని చిన్నారులున్నారు: మంత్రి ఆదిమూలపు

  విద్యాశాఖకు మంత్రిగా దళితుడైన తనను చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రంలో చిన్నారులంతా తమకు జగన్ మామ ఉన్నాడన్న సంతోషంలో ఉన్నారని ఆదిమూలపు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దార్శనికుడు, సంఘ సంస్కర్త అని ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభోత్సవ సభలో మంత్రి మాట్లాడారు. ఈ రోజు చారిత్రాత్మక దినం. ఎన్నో అరిష్టాలు, అడ్డంకులు, కుయుక్తులు, కుట్రలు చేధించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్న శుభ దినం అని మంత్రి చెప్పారు.

 • 11 Jan 2021 14:23 PM (IST)

  ‘నా అంత్యక్రియలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా హాజరు కావాలి’ : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

  తన అంత్యక్రియలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా హాజరు కావాలని కోరుకుంటున్నానని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తన జీవితకాలంమంతా జగన్ సీఎం గానే ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దేశానికే ఆదర్శమైన పాలన అందిస్తూ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నారని శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆనాడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమానికి పది అడుగులు ముందుకేస్తే.. ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ వంద అడుగులు ముందుకేస్తున్నారు.

 • 11 Jan 2021 13:36 PM (IST)

  చదువుల ద్రోహిగా చంద్రబాబు, ఇంగ్లీష్‌ మీడియాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు : అనిల్

  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో చిన్నారుల చదువుల ద్రోహిగా మారిపోయారని మంత్రి అనిల్ ఆరోపించారు. కుటిల రాజకీయాలతో ఇంగ్లీష్‌ మీడియాన్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.. మహిళలకు మంచి చేస్తుంటే అడ్డుకుంటున్న చంద్రబాబు మహిళా ద్రోహిగా మిగిలిపోతారు అని అనిల్ అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు మారుతారని చూస్తే.. ఆయన కుటిల రాజకీయాలు కొనసాగిస్తున్నారని అనిల్ చెప్పారు.

 • 11 Jan 2021 13:06 PM (IST)

  నువ్వా… మాట్లాడేది.! మా ముఖ్యమంత్రి గురించి.? : మంత్రి అనిల్

  మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు అమ్మఒడి సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నువ్వా… మాట్లాడేది మా ముఖ్యమంత్రి గురించి.? అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని విమర్శించారు. మళ్లీ జన్మంటూ ఉంటే జగన్ సైనికుడిగానే ఉంటానని అనిల్ చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుపడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు మహిళా ద్రోహి అని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ విమర్శించారు. జగనన్న అమ్మ ఒడి రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఈ రోజు అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా ఒక్కో తల్లికి రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. జగనన్న కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని పక్క రాష్ట్రాలు కోరుతున్నాయని అనిల్ అన్నారు.

 • 11 Jan 2021 12:34 PM (IST)

  పక్కరాష్ట్రాల వాళ్లు మాకు జగన్ లాంటి ముఖ్యమంత్రి కావాలంటున్నారు : మంత్రి అనిల్

  అమ్మఒడి నెల్లూరు సభా కార్యక్రమాన్ని సభ అధ్యక్షుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు భారత దేశ చరిత్రలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కడాలేని పథకాలు జగన్ చేపడుతున్నారని అనిల్ అన్నారు.

 • 11 Jan 2021 12:23 PM (IST)

  నెల్లూరు చేరుకున్న సీఎం జగన్

  తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌, నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అమ్మఒడి కార్యక్రమం రెండో దశ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నెల్లూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ నేతలు, ఘన స్వాగతం పలికారు.

 • 11 Jan 2021 11:58 AM (IST)

  భూమి పరిమితి, విద్యుత్ వాడకానికి సంబంధించి మార్పులు

  అమ్మఒడి పథకం పొందాలంటే గతేడాది నిర్ణయించినట్టు రెండున్నర ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల్లోపు మెట్ట భూమి పరిమితిని ఈ సారి మార్పుచేశారు. మూడెకరాల మాగాణి, 10 ఎకరాల మెట్టకు మార్పు చేస్తూ నిర్ణయించారు. కరెంటు వాడకానికి సంబంధించి గతంలో నెలకు 200 యూనిట్లు వినియోగించే వారిని అర్హులుగా గుర్తించగా.. ఇప్పుడు 300 యూనిట్లు వాడే వారికీ వర్తింపజేశారు. అంతేకాదు, గతంలో మాదిరి కాకుండా ఈసారి పారిశుద్ధ్య కార్మికులు, టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు ఉన్న వారి పిల్లలకూ ఈ సారి అమ్మఒడి పథకం ఇస్తున్నారు.

 • 11 Jan 2021 11:55 AM (IST)

  ఈ దఫా మరింత ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా నిబంధనలు సడలింపు

  అమ్మఒడి పథకం కింద గతేడాది 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,336 కోట్లు జమ చేసినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ దఫా మరింత ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా నిబంధనలు సడలించింది. కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులకు 75% హాజరు నిబంధనను సడలించారు. కుటుంబ ఆదాయ పరిమితిని నెలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.5వేల నుంచి రూ.6,250కు, పట్టణ ప్రాంతాల్లో రూ.10వేల నుంచి రూ.12వేలకు పెంచారు.