ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..

సాధారణంగా మనం కిలో బియ్యం రూ.50 లేదా రూ.100 పెట్టి కొంటాం. కొంచెం ఖరీదైన రకం అయితే మరో వంద ఎక్కువేమో.. కానీ ఒక్క కిలో బియ్యం కొనాలంటే మాత్రం ఏకంగా వేలు చెల్లించాల్సిందే. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా కిన్మెమై ప్రీమియం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అసలు ఈ బియ్యం ఎందుకు అంత ఖరీదు? అనేది తెలుసుకుందాం..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..
World Most Expensive Rice

Updated on: Mar 13, 2026 | 7:30 AM

సాధారణంగా మన దేశంలో బియ్యం కిలో రూ.50 నుండి రూ.150 వరకు ఉంటుంది. మరీ ఖరీదైన బాస్మతీ రకం అయితే రూ.200 – రూ.300 వరకు ఉండవచ్చు. కానీ ఒక రకం బియ్యం ధర మాత్రం ఏకంగా రూ.12,000 నుండి రూ.15,000 పలుకుతోంది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా జపాన్‌కు చెందిన కిన్మెమై ప్రీమియం బియ్యం ఈ ఘనతను దక్కించుకుంది. జపాన్‌కు చెందిన టోయో రైస్ కార్పొరేషన్ ఈ ప్రత్యేకమైన బియ్యాన్ని ఉత్పత్తి చేస్తోంది. 2016లో 840 గ్రాముల బియ్యం ధర రూ.5,490గా ఉన్నప్పుడే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం దీని ధర మరింత పెరిగి, ఒక కిలో బియ్యం ధర దాదాపు రూ.12,500 కంటే ఎక్కువగా ఉంది.

ఎందుకింత ధర?

ఈ బియ్యం అంత ఖరీదైనది కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సాధారణంగా బియ్యాన్ని వండడానికి ముందు కడగాలి. కానీ కిన్మెమై బియ్యాన్ని కడగాల్సిన అవసరం లేదు. దీనిపై ఉండే మైనపు పొరను, స్టార్చ్‌ను ఒక ప్రత్యేక సాంకేతికతతో తొలగిస్తారు. ఈ బియ్యాన్ని పండించిన వెంటనే అమ్మరు. ఆరు నెలల పాటు నిల్వ ఉంచుతారు. దీనివల్ల బియ్యం రుచి, సువాసన అద్భుతంగా పెరుగుతాయి. ఈ బియ్యం గింజలను యంత్రాలతో కాకుండా నిపుణులైన వ్యక్తులు స్వయంగా ఎంపిక చేస్తారు. జపాన్‌లోని అత్యుత్తమ రకాలైన కోషిహికారి, పికామారు బియ్యాల మిశ్రమమే ఈ కిన్మెమై ప్రీమియం.

ఆరోగ్య ప్రయోజనాలు: సాధారణ బియ్యం కంటే 6 రెట్లు మేలు

ఈ బియ్యం కేవలం రుచిలోనే కాదు ఆరోగ్యంలోనూ మేటి. దీనిలో సాధారణ బియ్యం కంటే 6 రెట్లు ఎక్కువ LPS ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. అలాగే దీనిలో ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండి, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి.

పరిమిత ఉత్పత్తి.. అపరిమిత డిమాండ్

ఈ బియ్యం కేవలం జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది. అందుకే దీని ఉత్పత్తి చాలా పరిమితంగా ఉంటుంది. దీనిని కొనుగోలు చేయాలంటే ముందుగానే ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన ఆహారంగా గుర్తింపు పొందింది.

Follow Us